
‘ఫూలే’ చిత్ర దర్శకుడు అనంత్ మహదేవన్. ఆ చిత్రంలో ప్రధాన పాత్రధారులు
అభిప్రాయం
మొదటిసారి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని ప్రఖ్యాత సినిమా డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తీశారు. ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. ఆ సినిమా నిజానికి ఫూలే 198వ జయంతి అయిన 2025 ఏప్రిల్11న విడుదల కావలసి ఉంది. కానీ దేశంలోని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సినిమా విడుదలను వ్యతిరేకించి ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్’ (సీబీఎఫ్‌సీ)కి ఎన్నో ఫిర్యాదులు పంపారు. సీబీఎఫ్‌సీ అతివేగంగా స్పందించి, విడుదల కావాల్సిన సినిమాను ఆపేసి కొన్ని మార్పులు సూచించింది. ఎన్నో ఇబ్బందుల అనంతరం చివరికి ఏప్రిల్ 25న సినిమా విడుదలయ్యింది.
‘ఫూలే’ సినిమా ఊహాజనిత కథపై ఆధారపడి తీసింది కాదు. ఫూలే, సావిత్రిపై రాసిన ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లోని చాలా జీవిత చరిత్రలపై ఆధారపడి తీసింది. కానీ సీబీఎఫ్‌సీ బలమైన చారిత్రక ఆధారాలతో సినిమాలో పెట్టిన ఘటనలను, కొన్ని పేర్లను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా ఫూలే కాలంలో కూడా దళితులు గ్రామ వీధుల్లోకి వస్తే మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకోవలసి ఉండింది. ఈ ఘోరమైన అంటరానితనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజులైన పీష్వాలు కఠినంగా అమలుచేశారు.
ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్‌ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళ.
ఫూలే దంపతులు బ్రాహ్మణులతో తగువు పెట్టుకోలేదు. కొట్టినా, తిట్టినా ఈ దేశ రైతాంగ జీవితాన్ని, కూలీల జీవితాన్ని, వృత్తిపనివారి జీవితాన్ని, ముఖ్యంగా స్త్రీ సమాజ జీవితాన్ని మార్చిన ఏకైక ఆదర్శ భార్యాభర్తల జంట అది. ఆ జంట అహింసకు మారుపేరు.
ఈ సినిమాలో పీష్వాల కాలం నాటి ఘోర అంటరానితనం, మనుషులను జంతుప్రాయంగా చూసిన పీష్వా రాజ్య న్యాయ వ్యవస్థను ఈనాటి సమాజానికి చెప్పకుండా, సినిమా రూపంలో చూపించకుండా ఎందుకుండాలి? చుట్టూ బ్రిటిష్ పరిపాలన ఉన్నా, పీష్వా రాజులు పుష్యమిత్రశుంగుని క్రూరాతిక్రూరమైన వర్ణధర్మ రాజ్యాన్ని నడిపింది చరిత్ర కదా! మొత్తం రైతాంగాన్ని – అంటే ఇవాళ పై శూద్ర కులంగా ఉన్న మరాఠాలు, కుంబీలు (ఫూలే కులస్థులు) సైతం చదువు నేర్చుకునే హక్కు లేని కట్టుబానిసలు కదా! అందుకే ‘గులాంగిరీ’ పుస్తకంలో ఫూలే వ్యవసాయ ఉత్పత్తిదారులను బానిసత్వం నుండి విముక్తి చెయ్యకుండా దేశం అభివృద్ధి కావడం అసంభవం అని రాశారు.
ఆనాటి శూద్ర బానిసలకు తాము బానిసలమనే సోయి కూడా లేదు. ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిని పెంచలేదు. ఉన్న పంటలో అదిరించి, బెదిరించి, స్వర్గం–నరకం సిద్ధాంతం చెప్పినవాళ్లు మాత్రమే కాస్త మంచి తిండి తిన్నారు. వీళ్ళకు ఆనాడు జాతీయ భావం లేదు. కుల భావం మాత్రమే ఉంది. జాతీయ భావన సమానత్వంతో ముడిపడి ఉంది.
ఈ దేశంలో అన్ని కులాల వారికి జాతీయ భావాన్ని నేర్పిన మొట్టమొదటి దైవసమాన జంట ఫూలే–సావిత్రీబాయి. వారిని మించిన జంట ఈ భూమి మీద ఆనాటికి పుట్టలేదు. ఈనాటికీ వెతికినా దొరికే స్థితి లేదు. పిల్లలు లేని ఈ జంట... విధవలుగా జీవిస్తున్న ఇద్దరు (బ్రాహ్మణ, ఇతర కులాలకు చెందిన) స్త్రీలను... ఇంట్లో పెట్టుకొని, ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన యశ్వంత రావును పెంచుకొని, మొదటి డాక్టరును చేశారు.
ఆనాటి వరకు బ్రాహ్మణ పురుషులు కూడా అలోపతి మెడిసిన్ చదవడం లేదు. సముద్రాలు దాటడం లేదు. ఈ దంపతులను ఈనాటి బ్రాహ్మణులైనా, ఏ కులస్థులైనా ఎలా చూడాలి? ఈ భూమి మీద నడిచిన దేవ–దేవతా దంపతులుగా చూడాలి కదా! వారి జీవిత చరిత్ర చిత్రీకరణను వ్యతిరేకించడమేమిటి?
సావిత్రీబాయి ఈ దేశ మొదటి మహిళా టీచరయ్యారు నిజమే. ఆమెపై ఆనాటి సంప్రదాయ యువకులు పేడ కొట్టింది నిజమే. కొంతమంది బ్రాహ్మణులు ఆ దంపతులకు మద్దతిచ్చిందీ నిజమే. సీబీఎఫ్‌సీ పేడకొట్టే సీను సినిమాలో తీసెయ్యాలని ఎలా అన్నది? ఈ సీబీఎఫ్‌సీలో ఒక్క శూద్ర వ్యక్తిగానీ, దళిత వ్యక్తిగానీ లేకుండా ఎలా చేశారు బీసీ ప్రధానమంత్రి? ఈ సీబీఎఫ్‌సీ కశ్మీర్ మీద, గుజరాత్ మీద, కేరళ మీద ముస్లింలపై సినిమా తీసినప్పుడు వాళ్ళు ట్రైలర్లు చూసి ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఒక్క సీన్‌గానీ, ఒక్క పదంగానీ కట్ చెయ్యలేదు. ఇప్పుడు సీబీఎఫ్‌సీ అధ్యక్షుడు ప్రసూన్ జోషీ ఈ దేశ జాతీయతను ఏం చెయ్యదలచుకున్నారు?
ఆ సినిమాలు ప్రధానమంత్రి చూశారు. పొగిడారు. మరి ‘ఫూలే’ సినిమాను ప్రధానమంత్రి చూస్తారా? ఒక బీసీగా ప్రధానమంత్రి అయి, ముఖ్యంగా శూద్ర బీసీల ఓట్లతో గెలిచి ఫూలే వ్యతిరేకులను సమర్థిస్తారా అనేది చాలా ముఖ్యమైన అంశం.
ఈ సినిమా భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మలుపు. మన సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు పుస్త కాలుగా వచ్చాయి. కానీ వారిపై పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. అందులో ముఖ్యంగా ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా లేని ఒక ఫూలే జంట లాంటి జంట మీద సినిమా తీయడం, వారి జీవితాలను ఇంటింటికీ ఆదర్శవంతం చేయడం నిజానికి జాతీయ లక్షణాలు కలిగిన సినిమా ఇండస్ట్రీకి ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. ఈ సినిమాతో అది మొదలయింది.
ఒక సినిమా మంచిదా, కాదా అనేది అది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది అనే మార్కెట్ విలువను బట్టి ఈ రోజుల్లో, మార్కెట్‌లో కూడా ఈ సినిమా విలువను పెంచాల్సి ఉంది. ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను తగ్గిస్తాయా, మాఫీ చేస్తాయా అనేది అంత ముఖ్యం కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సినిమాను చూస్తారు అనేది ముఖ్యం.
అమెరికాలో రేసిజాన్ని అంతం చేసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ 1865లో ‘అవర్ అమెరికన్ కజిన్’ డ్రామాను థియేటర్‌లో చూస్తూ హత్యకు గురయ్యారు. మంచిని నేర్చుకోవడానికి ఆయన చూపిన శ్రద్ధ అది. ఈ సమాజం సమానత్వం వైపు పయనిస్తేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. లేకపోతే ఫూలేలు నేర్పిన శ్రమ గౌరవ పాఠాలు ఇసుక దిబ్బల మీద రాసిన రాతలయ్యే ప్రమాదముంది.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు