hindi cinema
-
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
మొదటిసారి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని ప్రఖ్యాత సినిమా డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తీశారు. ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. ఆ సినిమా నిజానికి ఫూలే 198వ జయంతి అయిన 2025 ఏప్రిల్11న విడుదల కావలసి ఉంది. కానీ దేశంలోని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సినిమా విడుదలను వ్యతిరేకించి ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్’ (సీబీఎఫ్సీ)కి ఎన్నో ఫిర్యాదులు పంపారు. సీబీఎఫ్సీ అతివేగంగా స్పందించి, విడుదల కావాల్సిన సినిమాను ఆపేసి కొన్ని మార్పులు సూచించింది. ఎన్నో ఇబ్బందుల అనంతరం చివరికి ఏప్రిల్ 25న సినిమా విడుదలయ్యింది.‘ఫూలే’ సినిమా ఊహాజనిత కథపై ఆధారపడి తీసింది కాదు. ఫూలే, సావిత్రిపై రాసిన ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లోని చాలా జీవిత చరిత్రలపై ఆధారపడి తీసింది. కానీ సీబీఎఫ్సీ బలమైన చారిత్రక ఆధారాలతో సినిమాలో పెట్టిన ఘటనలను, కొన్ని పేర్లను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా ఫూలే కాలంలో కూడా దళితులు గ్రామ వీధుల్లోకి వస్తే మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకోవలసి ఉండింది. ఈ ఘోరమైన అంటరానితనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజులైన పీష్వాలు కఠినంగా అమలుచేశారు.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళ. ఫూలే దంపతులు బ్రాహ్మణులతో తగువు పెట్టుకోలేదు. కొట్టినా, తిట్టినా ఈ దేశ రైతాంగ జీవితాన్ని, కూలీల జీవితాన్ని, వృత్తిపనివారి జీవితాన్ని, ముఖ్యంగా స్త్రీ సమాజ జీవితాన్ని మార్చిన ఏకైక ఆదర్శ భార్యాభర్తల జంట అది. ఆ జంట అహింసకు మారుపేరు.ఈ సినిమాలో పీష్వాల కాలం నాటి ఘోర అంటరానితనం, మనుషులను జంతుప్రాయంగా చూసిన పీష్వా రాజ్య న్యాయ వ్యవస్థను ఈనాటి సమాజానికి చెప్పకుండా, సినిమా రూపంలో చూపించకుండా ఎందుకుండాలి? చుట్టూ బ్రిటిష్ పరిపాలన ఉన్నా, పీష్వా రాజులు పుష్యమిత్రశుంగుని క్రూరాతిక్రూరమైన వర్ణధర్మ రాజ్యాన్ని నడిపింది చరిత్ర కదా! మొత్తం రైతాంగాన్ని – అంటే ఇవాళ పై శూద్ర కులంగా ఉన్న మరాఠాలు, కుంబీలు (ఫూలే కులస్థులు) సైతం చదువు నేర్చుకునే హక్కు లేని కట్టుబానిసలు కదా! అందుకే ‘గులాంగిరీ’ పుస్తకంలో ఫూలే వ్యవసాయ ఉత్పత్తిదారులను బానిసత్వం నుండి విముక్తి చెయ్యకుండా దేశం అభివృద్ధి కావడం అసంభవం అని రాశారు.ఆనాటి శూద్ర బానిసలకు తాము బానిసలమనే సోయి కూడా లేదు. ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిని పెంచలేదు. ఉన్న పంటలో అదిరించి, బెదిరించి, స్వర్గం–నరకం సిద్ధాంతం చెప్పినవాళ్లు మాత్రమే కాస్త మంచి తిండి తిన్నారు. వీళ్ళకు ఆనాడు జాతీయ భావం లేదు. కుల భావం మాత్రమే ఉంది. జాతీయ భావన సమానత్వంతో ముడిపడి ఉంది.ఈ దేశంలో అన్ని కులాల వారికి జాతీయ భావాన్ని నేర్పిన మొట్టమొదటి దైవసమాన జంట ఫూలే–సావిత్రీబాయి. వారిని మించిన జంట ఈ భూమి మీద ఆనాటికి పుట్టలేదు. ఈనాటికీ వెతికినా దొరికే స్థితి లేదు. పిల్లలు లేని ఈ జంట... విధవలుగా జీవిస్తున్న ఇద్దరు (బ్రాహ్మణ, ఇతర కులాలకు చెందిన) స్త్రీలను... ఇంట్లో పెట్టుకొని, ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన యశ్వంత రావును పెంచుకొని, మొదటి డాక్టరును చేశారు. ఆనాటి వరకు బ్రాహ్మణ పురుషులు కూడా అలోపతి మెడిసిన్ చదవడం లేదు. సముద్రాలు దాటడం లేదు. ఈ దంపతులను ఈనాటి బ్రాహ్మణులైనా, ఏ కులస్థులైనా ఎలా చూడాలి? ఈ భూమి మీద నడిచిన దేవ–దేవతా దంపతులుగా చూడాలి కదా! వారి జీవిత చరిత్ర చిత్రీకరణను వ్యతిరేకించడమేమిటి?సావిత్రీబాయి ఈ దేశ మొదటి మహిళా టీచరయ్యారు నిజమే. ఆమెపై ఆనాటి సంప్రదాయ యువకులు పేడ కొట్టింది నిజమే. కొంతమంది బ్రాహ్మణులు ఆ దంపతులకు మద్దతిచ్చిందీ నిజమే. సీబీఎఫ్సీ పేడకొట్టే సీను సినిమాలో తీసెయ్యాలని ఎలా అన్నది? ఈ సీబీఎఫ్సీలో ఒక్క శూద్ర వ్యక్తిగానీ, దళిత వ్యక్తిగానీ లేకుండా ఎలా చేశారు బీసీ ప్రధానమంత్రి? ఈ సీబీఎఫ్సీ కశ్మీర్ మీద, గుజరాత్ మీద, కేరళ మీద ముస్లింలపై సినిమా తీసినప్పుడు వాళ్ళు ట్రైలర్లు చూసి ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఒక్క సీన్‌గానీ, ఒక్క పదంగానీ కట్ చెయ్యలేదు. ఇప్పుడు సీబీఎఫ్సీ అధ్యక్షుడు ప్రసూన్ జోషీ ఈ దేశ జాతీయతను ఏం చెయ్యదలచుకున్నారు?ఆ సినిమాలు ప్రధానమంత్రి చూశారు. పొగిడారు. మరి ‘ఫూలే’ సినిమాను ప్రధానమంత్రి చూస్తారా? ఒక బీసీగా ప్రధానమంత్రి అయి, ముఖ్యంగా శూద్ర బీసీల ఓట్లతో గెలిచి ఫూలే వ్యతిరేకులను సమర్థిస్తారా అనేది చాలా ముఖ్యమైన అంశం.ఈ సినిమా భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మలుపు. మన సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు పుస్త కాలుగా వచ్చాయి. కానీ వారిపై పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. అందులో ముఖ్యంగా ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా లేని ఒక ఫూలే జంట లాంటి జంట మీద సినిమా తీయడం, వారి జీవితాలను ఇంటింటికీ ఆదర్శవంతం చేయడం నిజానికి జాతీయ లక్షణాలు కలిగిన సినిమా ఇండస్ట్రీకి ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. ఈ సినిమాతో అది మొదలయింది.ఒక సినిమా మంచిదా, కాదా అనేది అది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది అనే మార్కెట్ విలువను బట్టి ఈ రోజుల్లో, మార్కెట్లో కూడా ఈ సినిమా విలువను పెంచాల్సి ఉంది. ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను తగ్గిస్తాయా, మాఫీ చేస్తాయా అనేది అంత ముఖ్యం కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సినిమాను చూస్తారు అనేది ముఖ్యం. అమెరికాలో రేసిజాన్ని అంతం చేసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ 1865లో ‘అవర్ అమెరికన్ కజిన్’ డ్రామాను థియేటర్లో చూస్తూ హత్యకు గురయ్యారు. మంచిని నేర్చుకోవడానికి ఆయన చూపిన శ్రద్ధ అది. ఈ సమాజం సమానత్వం వైపు పయనిస్తేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. లేకపోతే ఫూలేలు నేర్పిన శ్రమ గౌరవ పాఠాలు ఇసుక దిబ్బల మీద రాసిన రాతలయ్యే ప్రమాదముంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
'సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చా'.. విశాల్ సంచలన వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం లంచం తీసుకున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అంతే కాకుండా ట్వీట్‌తో పాటు మనీ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్స్ నంబర్లతో సహా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) విశాల్ ట్వీట్లో రాస్తూ..' వెండితెరపై సైతం అవినీతిని చూపిస్తున్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశా. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్యవర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకోస్తున్నా. నేను ఇలా చేయడం నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. #Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l — Vishal (@VishalKOfficial) September 28, 2023 -
రొమాంటిక్ హీరో.. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రచారం..
హిందీ సినిమా రంగంలో అయిదు దశాబ్దాలకు పైగా నటుడిగా కొన సాగారు దేవానంద్. ఆయన నటనే స్టైల్‌కు పర్యాయపదంగా నిలిచి పోయింది. నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ ఎంతోమంది ప్రతిభావంతుల్ని సినీతెరకు పరిచయం చేశారు. శతజయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన సినిమాలు ప్రదర్శితమయ్యాయి. హిందీ ప్రధాన స్రవంతి సినిమాల్లో దేవానంద్‌కు ముందు హుందా అయిన నటులున్నారు. ఆయన తర్వాత కాలంలో కూడా ఎంతో మంది నటులు వచ్చారు. కానీ దేవానంద్ స్టైల్, స్మైల్ విలక్షణమయినవి. ఆయన కదలిక, ఆహార్యం మొత్తంగా ఆయన నటనే స్టైల్‌కు పర్యాయ పదంగా నిలిచిపోయింది. ఆయన సినిమాల్లోని పాటలు నేటికీ జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాయి. ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలాగయా’, ‘కొయా కొయా చాంద్’, ‘గాతా రహే మేరా దిల్’ లాంటి పాటల్ని ఎవరు మరిచిపోగలరు? ఆ కాలంలో దిలీప్ కుమార్ విషాదాంత పాత్రలకు పర్యాయ పదంగా ఉండి, మధ్యతరగతి ప్రజల్ని, ఆనాటి మేధావుల్ని అలరిస్తున్నాడు. మరో వైపు చార్లీ చాప్లిన్ తరహా ట్రాంప్లా రాజ్ కపూర్ సామాన్య జన జీవితాల్లోకి చొచ్చుకు పోతున్నాడు. ఆ పరిస్థితుల్లో వారిద్దరికీ భిన్నంగా, తనదైన చేతనాత్మకమైన ధోరణితో నిలిచి గెలిచాడు దేవానంద్. సురయ్యా, మధుబాల, వైజయంతిమాల, హేమామాలిని, వహీదా రెహమాన్, నూతన్, గీతా దత్ లాంటి వాళ్ళతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. 1923లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దేవానంద్ జన్మించాడు. పంజాబ్ విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసుకుని బొంబాయి బయలుదేరాడు. అప్పటికే సినీ రంగంలో కృషి చేస్తున్న సోదరుడు చేతన్ ఆనంద్‌తో కలిసి తన భవిష్యత్తును నిర్మించుకుందామని ఆలోచన. 1946లో ప్రభాత్ వాళ్ళు నిర్మించిన ‘హామ్ ఏక్ హై’తో దేవ్ తన నట జీవితాన్ని ఆరంభించాడు. అప్పుడే గురు దత్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మిత్రులయ్యారు. తాను నిర్మాతగా మారి దర్శకుడిని చేస్తానని హామీ ఇచ్చాడు. రష్యన్ సినిమా ‘ఇన్స్పెక్టర్ జనరల్’ ప్రేరణతో చేతన్ ఆనంద్ తీసిన ‘అఫ్సర్’తో ఎస్.డి.బర్మన్ను సంగీత దర్శకుడిగా పరి చయం చేశాడు. తర్వాత బాల్ రాజ్ సహానీ స్క్రిప్ట్ ఆధారంగా ‘బాజీ’ తీశాడు. గురుదత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉర్దూ కవి సాహిర్ లుథియాన్వీ మొదటిసారిగా గీతాలు రాశాడు. ఈ సినిమాతోనే కమెడియన్‌గా జానీ వాకర్ కూడా పరిచయం అయ్యాడు. గీతా రాయ్‌ను గురుదత్, కల్పనా కార్తీక్‌ను దేవా నంద్ ఈ చిత్ర సమయంలోనే కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు జంటలయ్యారు. వహీదా రహ్మాన్‌తో దేవానంద్ అనేక విజయవంతమయిన సినిమాలు చేశాడు. వారిద్దరిదీ అప్పుడు హిందీ సినిమాల్లో గొప్ప హిట్ జంట. ‘సోల్వా సాల్’, ‘గైడ్’, ‘కాలా బాజార్’, ‘బాత్ ఏక్ రాత్ కీ’ వంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘గైడ్’ మొట్ట మొదటి ఇండో అమెరికన్ సిన్మాగా రూపొందింది. ఆర్.కె.నారాయణ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శ కుల ప్రశంసల్ని అందుకుంది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ముగ్గురు త్రిమూర్తుల్ని– అంటే దేవానంద్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్‌లను తీన్‌మూర్తి భవన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయిదు దశాబ్దాలకు పైగా హిందీ సినిమా రంగంలో తనదయిన శైలిలో నటిస్తూ, నిర్మిస్తూ... రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ... మొండితనంతో, తృష్ణతో తన నిర్మాణ సంస్థ ‘నవకేతన్’ను 52 ఏళ్ళకు పైగా సజీవంగా ఉంచుకున్నాడు దేవానంద్. 2001లో పద్మభూషణ్, 2002లో దాదా సాహెబ్ ఫాల్కే వరించాయి. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేర రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ దాన్ని ఎక్కువ కాలం నడపలేదు. దేవానంద్ జన్మశతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా 30 నగరాల్లో 55 టాకీసుల్లో ఆయన నటించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్.ఎఫ్.డి.సి. ఆర్కైవ్స్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. వారాల ఆనంద్ వ్యాసకర్త కవి, విమర్శకుడు. 94405 01281 (నేడు నటుడు దేవానంద్ శతజయంతి.) -
స్నేహితుడిని పెళ్లాడిన బాలీవుడ్ సింగర్
ముంబై: హిందీ సినీ పరిశ్రమలో మొన్ననే యువ నటుడు వరుణ్ ధావన్ వివాహం చేసుకోగా తాజాగా సినీ గాయని శిల్పారావు వివాహం చేసుకుంది. తన స్నేహితుడు రితేష్ కృష్ణన్‌ను బుధవారం సాయంత్రం శిల్పారావు పెళ్లాడారు. హిందీ సినీ పరిశ్రమలో పదేళ్లుగా గాయనిగా శిల్పారావు రాణిస్తూ అభిమానులను పెంచుకుంది. తాజాగా తన స్నేహితుడు చేసిన పెళ్లి ప్రతిపాదనను అంగీకరించి వివాహం చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో ముంబైలో అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో శిల్పారావు ఫొటోలు పంచుకుంది. మా మొదటి సెల్ఫీ అంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దాంతోపాటు రితేశ్‌తో ఉన్న తన చిన్ననాటి ఫొటోలను షేర్ చేసింది. హే దిల్ హై ముష్కిల్, లవ్ ఆజ్ కల్, బచ్నా హై హసీనా వంటి సినిమాల్లో శిల్పారావు పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. -
లవ్‌లో పడిపోయా....
ముంబై: బజరంగీ భాయిజాన్ సినిమా చూసి బాలీవుడ్ సినిమాతో లవ్‌లో పడిపోయానని ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమాను చూసిన ఆయన తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. సినిమా చాలా బావుందని, ఈ సినిమా చూశాక, హిందీ సినిమాపై ప్రేమ, అభిమానం కలిగాయని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు కబీర్ ఖాన్, హీరో సల్మాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీలకు తన అభినందనలు తెలిపారు. లెసన్స్ ఆఫ్ లవ్ పేరుతో సోషల్ మీడియాలో తన భావాలను పంచుకోవడం, ట్విట్టర్ లో తరచూ కమెంట్లు షేర్ చేయడం ఈ దర్శకుడికి అలవాటు. అయితే విభిన్న కథాంశాలతో రూపొందించిన మాసూమ్, మిస్టర్ ఇండియా, బండిట్ క్వీన్, ఎలిజబెత్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శేఖర్ కపూర్. ఇపుడు ఈ విశ్వదర్శకుడి ప్రశంసలతో బజరంగీ భాయిజాన్ ప్రతిష్ట మరింత పెరిగినట్టయింది. కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్, కరీనా జంటగా రూపొందిన బజరంగీ భాయిజాన్ చిత్రం రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఒక బిజినెస్ పరంగానే కాకుండా, అనేక కోణాల్లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ముఖ్యంగా బాలనటి హర్షాలీ మంచి మార్కులు కొట్టేస్తోంది. Fell in love with Hindi cinema all over again after watching #BajrangiBhaijaan Congratulations @BeingSalmanKhan @kabirkhankk @Nawazuddin_S — Shekhar Kapur (@shekharkapur) July 25, 2015 -
బాలీవుడ్లో ‘ఆట’ ఎలా ఆడాలో ఇప్పుడు తెలిసింది!
న్యూఢిల్లీ: హిందీ సినీ పరిశ్రమలో తాను అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ‘ఆట’ ఎలా ఆడాలో తెలియలేదని, ఇప్పుడు పట్టు దొరికినందుకు సంతోషంగా ఉంది అని అంటోంది అదితిరావు హైదరి. తన స్థానాన్ని ఇకపై ఎవరూ భర్తీ చేయలేని విధంగా ఎదగటమే తన లక్ష్యమని చెప్పుకుంది. ‘‘ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ కుదురుకుంటున్నాయి. ప్రస్తుతం నాకూ ఓ స్థానం లభించింది. సాటిలేని స్థానాన్ని సంపాదించడమే నా లక్ష్యం. ఏది నాదో... అది నాకే చెందాలి’’ అని తెలిపింది. ‘గుడ్డూ రంగీలా’, ‘ది లెజెండ్ఆఫ్ మైఖేల్ మిశ్రా’ చిత్రాల్లో అదితి విభిన్నమైన పాత్రలను పోషిస్తోంది. 2006లోనే బాలీవుడ్లో కాలుమోపినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. ‘యే సాలీ జిందగీ’, ‘ఢిల్లీ-6’ సినిమాల్లో కనిపించిన అదితి బాలీవుడ్లో తాను బయటి వ్యక్తిగా ఉండటమే తగిన అవకాశాలు రాకపోవడానికి కారణమని పేర్కొంది. మన ప్రవర్తన, ఉద్దేశ్యాలను బట్టే వ్యవహారం నడుస్తుందని అభిప్రాయపడింది. ఈ రంగంలో మహిళలు ఆకర్షణీయంగా ఉంటే మగవాళ్లు అదోరకంగా చూస్తారని చెప్పింది. భార్యలను, ప్రియురాళ్లు చూడనట్లు చాలా మంది పురుషులు వింతగా ప్రవర్తిస్తారని తెలిపింది. ఇంతవరకు బాలీవుడ్ తోడేళ్ల బారిన పడకపోవటం తన అదృష్టమని తెలిపింది. -
సినీ పునర్జన్మలు
వివరం: పునర్జన్మ! అనాది నుంచీ మనిషికి ఓ ఆసక్తి. తర్కానికి అందకుండా తప్పించుకుంటున్న ఓ ఆశ్చర్యం. మనిషి సాధించిన జ్ఞానాన్ని సవాల్ చేస్తున్న ఓ అద్భుతం. మనిషి ప్రగాఢంగా వాంఛిస్తున్న ఓ సంభవం. మనిషిని నిత్యం జాగృతం చేస్తున్న ఓ భయం. మనిషి ఛేదించలేకపోతున్న ఓ మార్మిక రహస్యం. పునర్జన్మల చుట్టూ అల్లుకున్న ఉత్సుకత, కుతూహలం ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ స్క్రీన్‌పై రకరకాలుగా వ్యక్తమయింది. ఇటీవల వచ్చిన ‘మనం’... పునర్జన్మ చిత్రాలపై తాజాగా చర్చను లేవనెత్తింది. వెండితెరపై పునర్జన్మ చేస్తున్న విన్యాసాలపై ఆసక్తిని రేపింది. సక్సెస్ సూత్రంగానే కాక, ప్రపంచ సినీ ప్రస్థానంలో పునర్జన్మ సినిమాలు ఒక ‘జానర్’గా స్థిరపడ్డ తీరుకు అద్దం పట్టింది. ‘మహల్’తో శ్రీకారం కమల్ ఆమ్రోహి తొలి దర్శకత్వంలో అశోక్‌కుమార్, మధుబాల జంటగా 1949లో వచ్చిన హిందీచిత్రం ‘మహల్’ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో మధుబాల, లతామంగేష్కర్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నారు. ఇందులోని ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ ఇప్పటికీ వెంటాడే గీతం! హరిశంకర్ (అశోక్‌కుమార్) అనే యువ న్యాయవాది తన తాతల నాటి ఆస్తి అయిన షబ్మమ్ మహల్‌కు వెళ్లినప్పుడు జరిగే కథ మహల్. భవనం గోడలపై అతడికి తనలాంటి పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ భవనంలో సేదతీరుతున్న హీరోకి ఓ స్త్రీ ఆత్మ పాటపాడుతూ, కారిడార్లలో తిరుగుతూ, లాన్లోని ఊయలలో ఊగుతూ కనిపిస్తుంటుంది. అసలు ఆమె ఎవరు? ఆమెకు, యువలాయర్‌కు, ఆ పెయింటింగ్‌కు సంబంధం ఏమిటి అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో హీరో గతజన్మను, ఆ జన్మలో హీరోహీరోయిన్ల ప్రేమను, హీరో పునర్జన్మను ఈ సినిమా ఆవిష్కరించింది. ‘మధుమతి’ సంచలనం ‘మహల్’కు ఎడిటర్ బిమల్‌రాయ్. ఆ సినిమాకు ఎడిట్ చేస్తున్నప్పుడే ఆ కథకు ఆయన ఆకర్షితుడయ్యాడు. తను దర్శకుడైన తర్వాత అదే కథాంశంతో 1958లో మరో సూపర్‌హిట్ తీశాడు. అదే ‘మధుమతి’. వైజయంతిమాల, దిలీప్‌కుమార్ నటించగా, సలీల్ ఛౌదరి సంగీతాన్ని అందించారు. బిమల్‌రాయ్ చెప్పిన లైన్‌ను మరో ప్రఖ్యాత దర్శకుడు రిత్విక్ ఘటక్, రాజేంద్రసింగ్ బేడీ కథగా రాశారు. తర్వాతి కాలంలో ప్రముఖ దర్శకుడిగా ఎదిగిన హృషికేశ్ముఖర్జీ ఈ సినిమాకి ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇలా యాదృచ్ఛికంగానే కమల్ ఆమ్రోహి, బిమల్‌రాయ్, హృషికేష్ ముఖర్జీల మధ్య గమ్మత్తయిన అంతస్సూత్రం కొనసాగింది. ఇక కథ విషయానికొస్తే, భార్యను రిసీవ్ చేసుకుందామని రైల్వేస్టేషన్‌కు బయలుదేరిన హీరో, భారీ వర్షంలో చిక్కుకుపోయి ఓ భవనంలోకి ప్రవేశిస్తాడు. ఆ భవనం అంతా తనకు తెలిసినట్టు, తను ఇదివరలో అక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా గతజన్మ జ్ఞాపకాలు వస్తాయి. గతజన్మలో హీరో కలప తోటల ఎస్టేట్‌కి మేనేజర్. స్థానిక గిరిజన యువతిని ప్రేమిస్తాడు. కానీ యజమాని దౌర్జన్యం వల్ల ఆమె మరణిస్తుంది. నేర నిరూపణ తర్వాత హీరో కూడా మరణిస్తాడు. మళ్లీ ఈ జన్మలో హీరోహీరోయిన్లిద్దరూ జన్మించి భార్యాభర్తలు అవుతారు. ఈ సినిమా భారతీయ వెండితెరపై పునర్జన్మ కథల విషయంలో ఓ సిలబస్‌ని రూపొందించిందని చెప్పాలి. బాలీవుడ్లో పునర్జన్మ ప్రభంజనం 1967లో సునీల్‌దత్, నూతన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘మిలన్’... ‘మూగమనసులు’కు రీమేక్. ఎల్వీ ప్రసాద్ నిర్మాత కాగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీల్లోనూ జమునే చేయడం విశేషం. వహీదా రెహమాన్, రాజ్‌కుమార్, మనోజ్‌కుమార్ కాంబినేషన్లో రామ్ మహేశ్వరి దర్శకత్వంలో వచ్చిన ‘నీల్ కమల్’ (1968)... శతృఘ్నసిన్హా, గీతారాయ్, డానీ తారాగణంతో బి.ఆర్. ఇషారా దర్శకత్వం వహించిన ‘మిలాప్’ (1972) పునర్జన్మ కథలే. మిలాప్‌లో శతృఘ్న ఐదు పాత్రలు పోషించాడు.1976లో శక్తిసామంతా దర్శకత్వంలో రాజేష్‌ఖన్నా, హేమమాలిని జంటగా వచ్చిన ‘మెహబూబా’ కూడా సంచలనమే. ‘కర్జ్’ టర్నింగ్ పాయింట్ సుభాష్ ఘాయ్ 1980లో తీసిన సినిమా ‘కర్జ్’. ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి చేతిలోనే హత్యకు గురయిన ఓ ప్రేమికుడు పునర్జన్మనెత్తి ఆమె నేరాన్ని నిరూపిస్తాడు. రిషీకపూర్, టీనామునిమ్, సిమీ గెరెవాల్ నటించారు. ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డు సృష్టించింది. దీన్నే 2008లో హిమేష్ రేషమియా, ఊర్మిళలతో రీమేక్ చేశారుగానీ ప్రేక్షకాదరణ పొందలేదు. 1988లో విడుదలైన ‘బీస్ సాల్ బాద్’ కూడా పునర్జన్మ కథాంశానికి కొంత సస్పెన్స్‌నీ, హారర్‌నీ జోడించి వచ్చింది. రాజ్‌కుమార్ కోహ్లీ దర్శకత్వం, మిథున్చక్రవర్తి, డింపుల్ కపాడియా, మీనాక్షి శేషాద్రిలతో వచ్చిన ఈ సినిమా ప్రియుడి మీద ప్రేమ తరగని ఓ ప్రియురాలి ఆత్మకథగా ఆకట్టుకుంది. ఇక, ఈ పునర్జన్మ కథావస్తువుతో గుల్జార్ లాంటి సెన్సిబుల్ సృజనకారుడు సినిమా తీయడం ఆశ్చర్యమే. అదే ‘లేకిన్’ (1991). తనదైన ఈస్థటిక్స్నే ఆర్ట్ఫిలిమ్ తరహాలోనే ప్రెజెంట్ చేశారు. రాజస్థాన్ ఎడారులు, రాజ్‌మహల్ నేపథ్యంలో ఓ ఆర్కియాలజిస్ట్ కథగా వచ్చిన ఈ సినిమాలో డింపుల్ కపాడియా, వినోద్ ఖన్నా నటించారు. దీనికి రవీంద్రనాథ్ టాగూర్ కథానికను మాతృకగా తీసుకోవడం, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ నిర్మించడం, ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతాన్ని అందించడం విశేషాలుగా చెప్పుకోవాలి. ‘యారా సిలీ సిలీ’ పాటకు లతాజీ జాతీయ అవార్డు అందుకున్నారు. పునర్జన్మ కథాంశంతోనే రాకేశ్‌కుమార్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్, అమృతాసింగ్, షీబాలతో ‘సూర్యవంశీ’ (1992) సినిమా రాగా, శిబు మిత్ర దర్శకత్వంలో గోవింద, కరిష్మాకపూర్ జంటగా ‘ప్రేమ్శక్తి’ (1994) సినిమాలు వచ్చాయి. అలాగే రాజ్‌కుమార్, రాజేశ్‌ఖన్నా, హేమమాలిని, వినోద్ ఖన్నాలతో వచ్చిన ‘కుద్రత్’ (1981) ప్రస్తావనార్హం. చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పునర్జన్మ ఫార్ములాను మరింత బలపరిచింది. ‘హమే తుమ్సే ప్యార్ కిత్నా.. యే హమ్ నహీ జాన్తే’ పాట ఆల్‌టైమ్ హిట్ స్థానాన్ని సాధించింది. కరణ్- అర్జున్ సెన్సేషన్ రాకేష్ రోషన్ ఇద్దరు అన్నదమ్ముల పునర్జన్మ కథాంశంతో తీసిన రివెంజ్ యాక్షన్ సినిమా కరణ్ అర్జున్ (1995). సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్ సోదరులుగా, రాఖీ తల్లిగా నటించిన ఇందులో కాజల్, మమతా కలకర్ణిలు హీరోయిన్లు. మదర్ సెంటిమెంటును జత చేసి ‘ప్రేమకోసం పునర్జన్మ’ ట్రెండ్‌లో వెళ్లకుండా భిన్మమైన ప్రయోగాన్ని తెరకెక్కించింది. 1997లో కాజల్, సయీఫ్ అలీఖాన్‌లతో వచ్చిన హమేషా, రాజ్కన్వర్ దర్వకత్వంలో ఆర్య బబర్, అమృతారావ్ జంటగా వచ్చిన అబ్ కే బరస్ (2002) ఈ కోవలోనివే. కాగా, అంతరమాలి దర్శకత్వం వహించి నటించిన మిస్టర్ యా మిస్ (2005) పునర్జన్మ కథా చిత్రాలలో గమ్మత్తయిన ప్రయోగం. ఒక జన్మలోని అఫ్తాబ్ శివ్‌దాసానీ, పునర్జన్మలో అంతరమాలిగా జన్మిస్తాడు. ఈ క్రాస్ జెండర్ పునర్జన్మలో జరిగే హాస్యమే ఈ సినిమా. ఓం శాంతి ఓం సృష్టించిన వండర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తొలి దర్శకత్వ చిత్రంగా తీసిన సినిమా ఓం శాంతి ఓం (2007). దీపికా పడుకొనేని పరిచయం చేసిన ఈ చిత్రంలో షారుఖ్‌కాన్ హీరో. సినిమా రంగం నేపథ్యంగా షారుఖ్ సిక్స్‌ప్యాక్ బాడీ సంచలనంతో వచ్చిన ఈ సినిమా పీరియడ్ డ్రామా కలెక్షన్లలో వండర్స్‌ని సృష్టించింది. హ్యారీ బవేజా పుత్రుడు హర్మాన్ బవేజా పరిచయ చిత్రంగా ప్రియాంకా చోప్రా జోడీగా వచ్చిన ‘లవ్‌స్టోరీ 2050’ (2008) పునర్జన్మ కథకి సైన్స్ ఫిక్షన్నీ, టైమ్ ట్రావెల్నీ జోడించిందిగానీ ఆకట్టుకోవడంలో విఫలమైంది. కరిష్మా కపూర్ కమ్‌బ్యాక్ సినిమాగా 2012లో వచ్చిన ‘డేంజరస్ ఇష్క్’ కూడా అదే ఫలితాన్ని చవిచూసింది. ఇందులో కరిష్మా నాలుగు పునర్జన్మలు పొందడం విశేషం. తెలుగు సంగతేంటి? 83 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలోకూడా పునర్జన్మ సూపర్ హిట్ సూత్రమేనని ఎన్నోసార్లు రుజవయింది. ఈ కథతో తెలుగులో వచ్చిన తొలి సినిమా ఖ్యాతిని ‘మూగ మనసులు’ (1963) సాధించింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, జమునల మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా; పెద్దింటమ్మాయి, పడవ నడుపుకునే అబ్బాయిల మధ్య ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఆత్రేయ గీతం, కె.వి.మహదేవన్ సంగీతాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచింది. గోదారి గట్టుంది, నా పాట నీ నోట పలకాల సిలకా, ముద్దబంతి పూవులూ మూగకళ్ల ఊసులు వంటి పాటలతో పాటు, అత్యధిక భాగం గోదారి అందాల మధ్య ఔట్‌డోర్‌లో తీసిన తొలి సినిమాగా కొత్త చరిత్రకు ద్వారాలు తెరిచింది. ఆ తర్వాత 1985లో బాలకృష్ణ, సిల్క్స్మితలతో తాతనేని ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆత్మబలం’ వచ్చింది. ఇది ‘కర్జ్’కు రీమేక్. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, జీవిత, విజయశాంతిలతో వచ్చిన చిత్రం జానకీరాముడు (1988). ఇది మూగమనసులుని పోలి ఉంటుంది. అక్కడ పడవ అబ్బాయి అయితే ఇక్కడ గుర్రబ్బండి అబ్బాయి. మల్లి దర్శకత్వంలో 2003లో వచ్చిన ప్రాణం కొంత వెరైటీ కథని తెరకెక్కించింది, నరేష్, సదా నటించిన ఈ సినిమా గత జన్మలో గ్రామీణ జీవనాన్ని, పునర్జన్మలో మెట్రో నగర జీవనాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చూపించింది. అరుంధతి-మగధీరల సునామీ తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై పునర్జన్మ కథాంశం సృష్టించిన సునామీకి 2009 సాక్షి. హీరోయిన్ ఓరియెంటెడ్ పీరియడ్ డ్రామా అరుంధ తి 45 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కోడి రామకృష్ణ దర్వకత్వం, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్‌ని విస్తృతంగా వాడుకుని, ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందించింది. అనుష్క, సోనూసూద్‌ల నటనతో ఆకట్టుకుంది. అలాగే, రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర తెలుగు సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. 69 కోట్లకు పైగా వసూలు చేసింది. రామ్‌చరణ్, కాజల్ జంటగా వచ్చిన ఈ భారీ హిస్టారికల్ పీరియడ్ సినిమాకి పునర్జన్మే ఆయువుపట్టు. ఇదే వరుసలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ (2011) ఏ స్టార్ ఇమేజ్ లేకపోయినా పునర్జన్మ సబ్జెక్టులోని దమ్ముని లోకానికి చాటింది. హాలీవుడ్లో పునర్జన్మలు పునర్జన్మ కథని తెరకెక్కించే దిశగా ప్రపంచం మొత్తం మీద సహజంగానే హాలీవుడ్ ముందడుగు వేసింది. 1935లో నిర్మాత మేరియన్ కూపర్... లాన్సింగ్ హోల్డెన్ దర్శకత్వంలో ‘షీ’ తీశారు. అయితే, అంతగా ఆడకపోవడంతో హాలీవుడ్లో పునర్జన్మ కథా చిత్రాలు దాదాపు పదమూడేళ్ల వరకు రాలేదు. 1948లో ‘కారిడార్ ఆఫ్ మిర్రర్స్’తో పునర్జన్మ కథాంశం ఊపందుకుంది. ఈ కోవలో చెప్పుకోదగినవి: ది సెర్చ్ ఫర్ బ్రైడీ మర్ఫీ (1956), ది అన్‌డెడ్ (1957), ది త్రీ లైఫ్స్ ఆఫ్ తోమసీనా (1964), ది ఇన్కార్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్-1975- (ఇది బాలీవుడ్ సినిమా ‘మహల్’ నుండి స్ఫూర్తి పొందగా, ఈ సినిమా కథతో బాలీవుడ్లో ‘కర్జ్’ సినిమా వచ్చింది), ఆడ్రీ రోజ్ (1977), ఆల్ ఆఫ్ మి (1984), స్టార్ ట్రెక్ త్రీ-ది సెర్చ్ ఫర్ స్పాక్(1984), డె జావూ (1985), ఛాన్సెస్ ఆర్ (1989), మనీకా: ది గర్ల్ హూ లివ్డ్ టై్వస్ (1989), ఐడెంటిటీ క్రైసిస్ (1990), డిఫెండింగ్ యువర్ లైఫ్ (1991), డెడ్ ఎగైన్(1991), బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా (1992), లిటిల్ బుద్ధ (1993), ఫ్లూక్ (1995), ది మమ్మీ రిటర్న్స్ (2001), బర్త్ (2004), ది ఇన్కార్నేషన్(2005), ది రిటర్న్ (2006), ది ఫౌంటేన్ (2006), క్లౌడ్ అట్లాస్ (2012). ఈ కథల్లో కొత్త ఒరవడి 1964లో వచ్చిన గుడ్‌బై చార్లీ. ఇందులో హీరో పునర్జన్మలో స్త్రీగా జన్మిస్తాడు. ఇక కథానాయకుడు పునర్జన్మలో మనిషిగా కాకుండా మరో జీవిగా పుట్టడమనే ట్రెండ్‌కు ‘కాక్రోచ్’ శ్రీకారం చుట్టింది. (‘ఈగ’కు ప్రేరణిదే). తాత్విక, మత భావనలు పునర్జన్మ... అన్ని తార్కిక, తాత్విక, ఆధ్యాత్మిక, ఆలోచనలన్నింటిలోనూ కీలకం. దాదాపు అన్ని మత విశ్వాసాలూ పునర్జన్మని ఏదో రూపంలో అంగీకరించాయి. ‘జాతక కథలు’ బోధిసత్వుడి పేరిట బుద్ధుని పునర్జన్మలను కథారూపంలో వెల్లడించింది. బౌద్ధానికి దాదాపు సమకాలీన మతమైన జైనం కూడా కొన్ని పరిమితులతో దీని గురించి వ్యాఖ్యానించింది. ఈ రెండు మతాలూ మనిషి అంతిమ లక్ష్యం పునర్జన్మ రాహిత్య స్థితే అన్నాయి. బౌద్ధం ‘నిర్యాణం’ అని చెబితే, జైనం ‘కైవల్యం’ అని పిలిచింది. హిందూ మతం పునర్జన్మ భావనకి అగ్రశ్రేణి ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ విషయం ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను, అష్టాదశ పురాణాలను, వాటిలోని వేర్వేరు పాత్రల పుట్టుకను, వాటి ప్రవర్తనలను గమనిస్తే ఇట్టే అర్థమౌతుంది. నమ్మకమా? నిజమా? మనోవిజ్ఞానశాస్త్రం మనిషి ప్రవర్తనను నిర్ధారించే కారకాలు రెండని చెబుతుంది. వారసత్వం, పరిసరాలు. ఈ సూత్రీకరణకు అతీతమైన ప్రవర్తనలూ కనిపిస్తాయి. ఈ అవసరంలోంచే సైకాలజీ మరింత విస్తరించి, అతీంద్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం (పారా సైకాలజీ) పేరిట శాస్త్రీయతను సాధించింది. అలాగే జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ వ్యక్తిలోని సమస్త ప్రవృత్తులకీ డి.ఎన్.ఎ. జన్యువులు కారణమని వివరిస్తూ, మానవ జన్యు చిత్రపటాన్ని ఆవిష్కరించే పరిశోధనలు చేస్తూ పునర్జన్మ లోతులను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన వాల్టర్ సెమ్కివ్ అనే వైద్యుడు పునర్జన్మలపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి ‘బోర్న్ అగైన్’ పేరిట రెండు పుస్తకాలు రాశారు. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు గత జన్మలో ఎలా జన్మించారో విశ్లేషించారు. వీరిలో అబ్దుల్ కలామ్, అమితాబ్‌బచ్చన్, షారుక్‌ఖాన్ గత జన్మల ప్రస్తావన కూడా ఉండడం విశేషం. పునర్జన్మ నమ్మకమా? నిజమా? అంటే ఓ ఆకర్షణీయమైన మిస్టరీ అని చెప్పాలి. హిట్ ఫార్ములా ఎందుకయింది? మొత్తం మీద పునర్జన్మ కథా చిత్రాలు హిట్ ఫార్ములా అని విషయాన్ని తాజాగా ‘మనం’ సినిమా కూడా నిరూపించింది. ఇలాంటి సినిమాలకి ఆదరణ ఉండడానికి కారణాలు విశ్లేషించుకుంటే, దీనికి మనలోని సామూహిక అచేతనం (కలెక్టివ్ అన్‌కాన్షియస్‌నెస్) ఒక కారణం అని చెప్పక తప్పదు. ప్రతి మనిషిలోనూ జీవించాలనే సహజాతం, మరణాన్ని జయించాలనే అవ్యక్త వాంఛ, ఒక జన్మలో తీరని కోరికలు, ఆకాంక్షలు తర్వాతి జన్మలోనైనా తీరకపోతాయా అనే ఆశ వంటివన్నీ కలిసి తెరమీద పాత్రలు, కథలతో ప్రేక్షకులు తాదాత్మ్యీకరణం అయ్యేలా చేస్తున్నాయని చెప్పాలి. మనుషులలోని ఏ అట్టడుగు పొరలలోనో నిద్రాణంగా ఉన్న వాంఛాసాఫల్యం అనే సహజాతం ఈ సినిమాల ద్వారా లభిస్తోందని కూడా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెబుతారు. - మామిడి హరికృష్ణ