బాలీవుడ్‌లో ‘ఆట’ ఎలా ఆడాలో ఇప్పుడు తెలిసింది!
న్యూఢిల్లీ: హిందీ సినీ పరిశ్రమలో తాను అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ‘ఆట’ ఎలా ఆడాలో తెలియలేదని, ఇప్పుడు పట్టు దొరికినందుకు సంతోషంగా ఉంది అని అంటోంది అదితిరావు హైదరి. తన స్థానాన్ని ఇకపై ఎవరూ భర్తీ చేయలేని విధంగా ఎదగటమే తన లక్ష్యమని చెప్పుకుంది. ‘‘ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ కుదురుకుంటున్నాయి. ప్రస్తుతం నాకూ ఓ స్థానం లభించింది. సాటిలేని స్థానాన్ని సంపాదించడమే నా లక్ష్యం. ఏది నాదో... అది నాకే చెందాలి’’ అని తెలిపింది. ‘గుడ్డూ రంగీలా’, ‘ది లెజెండ్‌ఆఫ్ మైఖేల్ మిశ్రా’ చిత్రాల్లో అదితి విభిన్నమైన పాత్రలను పోషిస్తోంది. 2006లోనే బాలీవుడ్‌లో కాలుమోపినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. ‘యే సాలీ జిందగీ’, ‘ఢిల్లీ-6’ సినిమాల్లో కనిపించిన అదితి బాలీవుడ్‌లో తాను బయటి వ్యక్తిగా ఉండటమే తగిన అవకాశాలు రాకపోవడానికి కారణమని పేర్కొంది.
మన ప్రవర్తన, ఉద్దేశ్యాలను బట్టే వ్యవహారం నడుస్తుందని అభిప్రాయపడింది. ఈ రంగంలో మహిళలు ఆకర్షణీయంగా ఉంటే మగవాళ్లు అదోరకంగా చూస్తారని చెప్పింది. భార్యలను, ప్రియురాళ్లు చూడనట్లు చాలా మంది పురుషులు వింతగా ప్రవర్తిస్తారని తెలిపింది. ఇంతవరకు బాలీవుడ్ తోడేళ్ల బారిన పడకపోవటం తన అదృష్టమని తెలిపింది.