సినీ పునర్జన్మలు | All cinemas will make with reablement stories | Sakshi
Sakshi News home page

సినీ పునర్జన్మలు

Published Sun, Jun 22 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

సినీ పునర్జన్మలు

సినీ పునర్జన్మలు

వివరం: పునర్జన్మ! అనాది నుంచీ మనిషికి ఓ ఆసక్తి.
 తర్కానికి అందకుండా తప్పించుకుంటున్న ఓ ఆశ్చర్యం.
 మనిషి సాధించిన జ్ఞానాన్ని సవాల్ చేస్తున్న ఓ అద్భుతం.
 మనిషి ప్రగాఢంగా వాంఛిస్తున్న ఓ సంభవం.
 మనిషిని నిత్యం జాగృతం చేస్తున్న ఓ భయం.
 మనిషి ఛేదించలేకపోతున్న ఓ మార్మిక రహస్యం.

 
 పునర్జన్మల చుట్టూ అల్లుకున్న ఉత్సుకత, కుతూహలం ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ స్క్రీన్‌పై రకరకాలుగా వ్యక్తమయింది.  ఇటీవల వచ్చిన ‘మనం’... పునర్జన్మ చిత్రాలపై తాజాగా చర్చను లేవనెత్తింది. వెండితెరపై పునర్జన్మ చేస్తున్న విన్యాసాలపై ఆసక్తిని రేపింది. సక్సెస్ సూత్రంగానే కాక, ప్రపంచ సినీ ప్రస్థానంలో పునర్జన్మ సినిమాలు ఒక ‘జానర్’గా స్థిరపడ్డ తీరుకు అద్దం పట్టింది.
 
 ‘మహల్’తో శ్రీకారం
 కమల్ ఆమ్రోహి తొలి దర్శకత్వంలో అశోక్‌కుమార్, మధుబాల జంటగా 1949లో వచ్చిన హిందీచిత్రం ‘మహల్’ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో మధుబాల, లతామంగేష్కర్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నారు. ఇందులోని ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ ఇప్పటికీ వెంటాడే గీతం!
 హరిశంకర్ (అశోక్‌కుమార్) అనే యువ న్యాయవాది తన తాతల నాటి ఆస్తి అయిన షబ్మమ్ మహల్‌కు  వెళ్లినప్పుడు జరిగే కథ మహల్. భవనం గోడలపై అతడికి తనలాంటి పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ భవనంలో సేదతీరుతున్న హీరోకి ఓ స్త్రీ ఆత్మ పాటపాడుతూ, కారిడార్‌లలో తిరుగుతూ, లాన్‌లోని ఊయలలో ఊగుతూ కనిపిస్తుంటుంది. అసలు ఆమె ఎవరు? ఆమెకు, యువలాయర్‌కు, ఆ పెయింటింగ్‌కు సంబంధం ఏమిటి  అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో హీరో గతజన్మను, ఆ జన్మలో హీరోహీరోయిన్‌ల ప్రేమను, హీరో పునర్జన్మను ఈ సినిమా ఆవిష్కరించింది.  
 
 ‘మధుమతి’ సంచలనం
 ‘మహల్’కు ఎడిటర్ బిమల్‌రాయ్. ఆ సినిమాకు ఎడిట్ చేస్తున్నప్పుడే ఆ కథకు ఆయన ఆకర్షితుడయ్యాడు. తను దర్శకుడైన తర్వాత అదే కథాంశంతో 1958లో మరో సూపర్‌హిట్ తీశాడు. అదే ‘మధుమతి’. వైజయంతిమాల, దిలీప్‌కుమార్  నటించగా, సలీల్ ఛౌదరి సంగీతాన్ని అందించారు. బిమల్‌రాయ్ చెప్పిన లైన్‌ను మరో ప్రఖ్యాత దర్శకుడు రిత్విక్ ఘటక్, రాజేంద్రసింగ్ బేడీ కథగా రాశారు. తర్వాతి కాలంలో ప్రముఖ దర్శకుడిగా ఎదిగిన హృషికేశ్‌ముఖర్జీ ఈ సినిమాకి ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇలా యాదృచ్ఛికంగానే కమల్ ఆమ్రోహి, బిమల్‌రాయ్, హృషికేష్ ముఖర్జీల మధ్య గమ్మత్తయిన అంతస్సూత్రం కొనసాగింది.
 
 ఇక కథ విషయానికొస్తే, భార్యను రిసీవ్ చేసుకుందామని రైల్వేస్టేషన్‌కు బయలుదేరిన హీరో, భారీ వర్షంలో చిక్కుకుపోయి ఓ భవనంలోకి ప్రవేశిస్తాడు. ఆ భవనం అంతా తనకు తెలిసినట్టు, తను ఇదివరలో అక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా గతజన్మ జ్ఞాపకాలు వస్తాయి. గతజన్మలో హీరో కలప తోటల ఎస్టేట్‌కి మేనేజర్. స్థానిక గిరిజన యువతిని ప్రేమిస్తాడు. కానీ యజమాని దౌర్జన్యం వల్ల ఆమె మరణిస్తుంది. నేర నిరూపణ తర్వాత హీరో కూడా మరణిస్తాడు. మళ్లీ ఈ జన్మలో హీరోహీరోయిన్‌లిద్దరూ జన్మించి భార్యాభర్తలు అవుతారు. ఈ సినిమా భారతీయ వెండితెరపై పునర్జన్మ కథల విషయంలో ఓ సిలబస్‌ని రూపొందించిందని చెప్పాలి.
 
 బాలీవుడ్‌లో పునర్జన్మ ప్రభంజనం
 1967లో సునీల్‌దత్, నూతన్ హీరోహీరోయిన్‌లుగా వచ్చిన ‘మిలన్’... ‘మూగమనసులు’కు రీమేక్. ఎల్వీ ప్రసాద్ నిర్మాత కాగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు.  తెలుగు, హిందీల్లోనూ జమునే చేయడం విశేషం. వహీదా రెహమాన్, రాజ్‌కుమార్, మనోజ్‌కుమార్ కాంబినేషన్‌లో రామ్ మహేశ్వరి దర్శకత్వంలో వచ్చిన ‘నీల్ కమల్’ (1968)...  శతృఘ్నసిన్హా, గీతారాయ్, డానీ తారాగణంతో బి.ఆర్. ఇషారా దర్శకత్వం వహించిన  ‘మిలాప్’ (1972) పునర్జన్మ కథలే. మిలాప్‌లో శతృఘ్న  ఐదు పాత్రలు పోషించాడు.1976లో శక్తిసామంతా దర్శకత్వంలో రాజేష్‌ఖన్నా, హేమమాలిని జంటగా వచ్చిన ‘మెహబూబా’ కూడా సంచలనమే.
 
 ‘కర్జ్’ టర్నింగ్ పాయింట్
 సుభాష్ ఘాయ్ 1980లో తీసిన సినిమా ‘కర్జ్’. ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి చేతిలోనే హత్యకు గురయిన ఓ ప్రేమికుడు పునర్జన్మనెత్తి ఆమె నేరాన్ని నిరూపిస్తాడు. రిషీకపూర్, టీనామునిమ్, సిమీ గెరెవాల్ నటించారు. ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డు సృష్టించింది. దీన్నే 2008లో హిమేష్ రేషమియా, ఊర్మిళలతో రీమేక్ చేశారుగానీ ప్రేక్షకాదరణ పొందలేదు. 1988లో విడుదలైన ‘బీస్ సాల్ బాద్’ కూడా పునర్జన్మ కథాంశానికి కొంత సస్పెన్స్‌నీ, హారర్‌నీ జోడించి వచ్చింది. రాజ్‌కుమార్ కోహ్లీ దర్శకత్వం, మిథున్‌చక్రవర్తి, డింపుల్ కపాడియా, మీనాక్షి శేషాద్రిలతో వచ్చిన ఈ సినిమా ప్రియుడి  మీద ప్రేమ తరగని ఓ ప్రియురాలి ఆత్మకథగా ఆకట్టుకుంది.
 
 ఇక, ఈ పునర్జన్మ కథావస్తువుతో గుల్జార్ లాంటి సెన్సిబుల్ సృజనకారుడు సినిమా తీయడం ఆశ్చర్యమే. అదే ‘లేకిన్’ (1991). తనదైన ఈస్థటిక్స్‌నే ఆర్ట్‌ఫిలిమ్ తరహాలోనే ప్రెజెంట్ చేశారు. రాజస్థాన్ ఎడారులు, రాజ్‌మహల్ నేపథ్యంలో ఓ ఆర్కియాలజిస్ట్ కథగా వచ్చిన ఈ సినిమాలో డింపుల్ కపాడియా, వినోద్ ఖన్నా నటించారు. దీనికి రవీంద్రనాథ్ టాగూర్ కథానికను మాతృకగా తీసుకోవడం, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ నిర్మించడం, ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతాన్ని అందించడం విశేషాలుగా చెప్పుకోవాలి. ‘యారా సిలీ సిలీ’ పాటకు లతాజీ జాతీయ అవార్డు అందుకున్నారు.
 
 పునర్జన్మ కథాంశంతోనే రాకేశ్‌కుమార్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్, అమృతాసింగ్, షీబాలతో ‘సూర్యవంశీ’ (1992) సినిమా రాగా, శిబు మిత్ర దర్శకత్వంలో గోవింద, కరిష్మాకపూర్ జంటగా ‘ప్రేమ్‌శక్తి’ (1994) సినిమాలు వచ్చాయి. అలాగే రాజ్‌కుమార్, రాజేశ్‌ఖన్నా, హేమమాలిని, వినోద్ ఖన్నాలతో వచ్చిన ‘కుద్రత్’ (1981) ప్రస్తావనార్హం. చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పునర్జన్మ ఫార్ములాను మరింత బలపరిచింది.  ‘హమే తుమ్‌సే ప్యార్ కిత్‌నా.. యే హమ్ నహీ జాన్‌తే’ పాట ఆల్‌టైమ్ హిట్ స్థానాన్ని సాధించింది.
 
 కరణ్- అర్జున్ సెన్సేషన్
 రాకేష్ రోషన్ ఇద్దరు అన్నదమ్ముల పునర్జన్మ కథాంశంతో తీసిన రివెంజ్ యాక్షన్ సినిమా కరణ్ అర్జున్ (1995). సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్ సోదరులుగా, రాఖీ తల్లిగా నటించిన ఇందులో కాజల్, మమతా కలకర్ణిలు హీరోయిన్లు. మదర్ సెంటిమెంటును జత చేసి ‘ప్రేమకోసం పునర్జన్మ’ ట్రెండ్‌లో వెళ్లకుండా భిన్మమైన ప్రయోగాన్ని తెరకెక్కించింది.  1997లో కాజల్, సయీఫ్ అలీఖాన్‌లతో వచ్చిన హమేషా, రాజ్‌కన్వర్ దర్వకత్వంలో ఆర్య బబర్, అమృతారావ్ జంటగా వచ్చిన అబ్ కే బరస్ (2002) ఈ కోవలోనివే. కాగా, అంతరమాలి దర్శకత్వం వహించి నటించిన మిస్టర్ యా మిస్ (2005)  పునర్జన్మ కథా చిత్రాలలో గమ్మత్తయిన ప్రయోగం. ఒక జన్మలోని అఫ్తాబ్ శివ్‌దాసానీ, పునర్జన్మలో అంతరమాలిగా జన్మిస్తాడు. ఈ క్రాస్ జెండర్ పునర్జన్మలో జరిగే హాస్యమే ఈ సినిమా.
 
 ఓం శాంతి ఓం సృష్టించిన వండర్
 ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్  తొలి దర్శకత్వ చిత్రంగా తీసిన సినిమా ఓం శాంతి ఓం (2007). దీపికా పడుకొనేని పరిచయం చేసిన ఈ చిత్రంలో షారుఖ్‌కాన్ హీరో. సినిమా రంగం నేపథ్యంగా షారుఖ్ సిక్స్‌ప్యాక్ బాడీ సంచలనంతో వచ్చిన ఈ సినిమా పీరియడ్ డ్రామా కలెక్షన్లలో వండర్స్‌ని సృష్టించింది.  హ్యారీ బవేజా పుత్రుడు హర్మాన్ బవేజా పరిచయ చిత్రంగా ప్రియాంకా చోప్రా జోడీగా వచ్చిన ‘లవ్‌స్టోరీ 2050’ (2008) పునర్జన్మ కథకి సైన్స్ ఫిక్షన్‌నీ, టైమ్ ట్రావెల్‌నీ జోడించిందిగానీ ఆకట్టుకోవడంలో విఫలమైంది. కరిష్మా కపూర్ కమ్‌బ్యాక్ సినిమాగా 2012లో వచ్చిన ‘డేంజరస్ ఇష్క్’ కూడా అదే ఫలితాన్ని చవిచూసింది. ఇందులో కరిష్మా నాలుగు పునర్జన్మలు పొందడం విశేషం.
 
 తెలుగు సంగతేంటి?
 83 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలోకూడా పునర్జన్మ సూపర్ హిట్ సూత్రమేనని ఎన్నోసార్లు రుజవయింది. ఈ కథతో తెలుగులో వచ్చిన తొలి సినిమా ఖ్యాతిని ‘మూగ మనసులు’ (1963) సాధించింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, జమునల మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా; పెద్దింటమ్మాయి, పడవ నడుపుకునే అబ్బాయిల మధ్య ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఆత్రేయ గీతం, కె.వి.మహదేవన్ సంగీతాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచింది. గోదారి గట్టుంది, నా పాట నీ నోట పలకాల సిలకా, ముద్దబంతి పూవులూ మూగకళ్ల ఊసులు వంటి పాటలతో పాటు, అత్యధిక భాగం గోదారి అందాల మధ్య ఔట్‌డోర్‌లో తీసిన తొలి సినిమాగా కొత్త చరిత్రకు ద్వారాలు తెరిచింది. ఆ తర్వాత 1985లో బాలకృష్ణ, సిల్క్‌స్మితలతో తాతనేని ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆత్మబలం’ వచ్చింది. ఇది ‘కర్జ్’కు రీమేక్.
 
 కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, జీవిత, విజయశాంతిలతో వచ్చిన చిత్రం జానకీరాముడు (1988). ఇది మూగమనసులుని పోలి ఉంటుంది. అక్కడ పడవ అబ్బాయి అయితే ఇక్కడ గుర్రబ్బండి అబ్బాయి.  మల్లి దర్శకత్వంలో 2003లో వచ్చిన ప్రాణం కొంత వెరైటీ కథని తెరకెక్కించింది, నరేష్, సదా నటించిన ఈ సినిమా గత జన్మలో గ్రామీణ జీవనాన్ని, పునర్జన్మలో మెట్రో నగర జీవనాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చూపించింది.
 
 అరుంధతి-మగధీరల సునామీ
 తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై పునర్జన్మ కథాంశం సృష్టించిన సునామీకి 2009  సాక్షి. హీరోయిన్ ఓరియెంటెడ్ పీరియడ్ డ్రామా అరుంధ తి 45 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కోడి రామకృష్ణ దర్వకత్వం, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్‌ని విస్తృతంగా వాడుకుని, ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందించింది. అనుష్క, సోనూసూద్‌ల నటనతో ఆకట్టుకుంది. అలాగే, రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర తెలుగు సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. 69 కోట్లకు పైగా వసూలు చేసింది. రామ్‌చరణ్, కాజల్ జంటగా వచ్చిన ఈ భారీ హిస్టారికల్  పీరియడ్ సినిమాకి పునర్జన్మే ఆయువుపట్టు. ఇదే వరుసలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ (2011) ఏ స్టార్ ఇమేజ్ లేకపోయినా పునర్జన్మ సబ్జెక్టులోని దమ్ముని లోకానికి చాటింది.  
 
 హాలీవుడ్‌లో పునర్జన్మలు
 పునర్జన్మ కథని తెరకెక్కించే దిశగా ప్రపంచం మొత్తం మీద సహజంగానే హాలీవుడ్ ముందడుగు వేసింది.   1935లో నిర్మాత మేరియన్ కూపర్... లాన్సింగ్ హోల్డెన్ దర్శకత్వంలో ‘షీ’ తీశారు. అయితే, అంతగా ఆడకపోవడంతో హాలీవుడ్‌లో పునర్జన్మ కథా చిత్రాలు దాదాపు పదమూడేళ్ల వరకు రాలేదు. 1948లో ‘కారిడార్ ఆఫ్ మిర్రర్స్’తో పునర్జన్మ కథాంశం ఊపందుకుంది. ఈ కోవలో చెప్పుకోదగినవి: ది సెర్చ్ ఫర్ బ్రైడీ మర్ఫీ (1956), ది అన్‌డెడ్ (1957), ది త్రీ లైఫ్స్ ఆఫ్ తోమసీనా (1964), ది ఇన్‌కార్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్-1975- (ఇది బాలీవుడ్ సినిమా ‘మహల్’ నుండి స్ఫూర్తి పొందగా, ఈ సినిమా కథతో బాలీవుడ్‌లో ‘కర్జ్’ సినిమా వచ్చింది), ఆడ్రీ రోజ్ (1977), ఆల్ ఆఫ్ మి (1984), స్టార్ ట్రెక్ త్రీ-ది సెర్చ్ ఫర్ స్పాక్(1984), డె జావూ (1985), ఛాన్సెస్ ఆర్ (1989), మనీకా: ది గర్ల్ హూ లివ్‌డ్ టై్వస్ (1989), ఐడెంటిటీ క్రైసిస్ (1990), డిఫెండింగ్ యువర్ లైఫ్ (1991), డెడ్ ఎగైన్(1991), బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా (1992), లిటిల్ బుద్ధ (1993), ఫ్లూక్ (1995), ది మమ్మీ రిటర్న్స్ (2001), బర్త్ (2004), ది ఇన్‌కార్నేషన్(2005), ది రిటర్న్ (2006), ది ఫౌంటేన్ (2006), క్లౌడ్ అట్లాస్ (2012). ఈ కథల్లో కొత్త ఒరవడి 1964లో వచ్చిన గుడ్‌బై చార్లీ. ఇందులో హీరో పునర్జన్మలో స్త్రీగా జన్మిస్తాడు. ఇక కథానాయకుడు పునర్జన్మలో  మనిషిగా కాకుండా మరో జీవిగా పుట్టడమనే ట్రెండ్‌కు ‘కాక్రోచ్’ శ్రీకారం చుట్టింది. (‘ఈగ’కు ప్రేరణిదే).
 
 తాత్విక, మత భావనలు
 పునర్జన్మ... అన్ని తార్కిక, తాత్విక, ఆధ్యాత్మిక,  ఆలోచనలన్నింటిలోనూ కీలకం. దాదాపు అన్ని మత విశ్వాసాలూ పునర్జన్మని ఏదో రూపంలో అంగీకరించాయి. ‘జాతక కథలు’ బోధిసత్వుడి పేరిట బుద్ధుని పునర్జన్మలను కథారూపంలో వెల్లడించింది. బౌద్ధానికి దాదాపు సమకాలీన మతమైన జైనం కూడా కొన్ని పరిమితులతో దీని గురించి వ్యాఖ్యానించింది. ఈ రెండు మతాలూ మనిషి అంతిమ లక్ష్యం పునర్జన్మ రాహిత్య స్థితే అన్నాయి.  బౌద్ధం ‘నిర్యాణం’ అని చెబితే, జైనం ‘కైవల్యం’ అని పిలిచింది.  హిందూ మతం పునర్జన్మ భావనకి అగ్రశ్రేణి ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ విషయం ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను, అష్టాదశ పురాణాలను, వాటిలోని వేర్వేరు పాత్రల పుట్టుకను, వాటి ప్రవర్తనలను గమనిస్తే ఇట్టే అర్థమౌతుంది.
 
 నమ్మకమా? నిజమా?
 మనోవిజ్ఞానశాస్త్రం మనిషి ప్రవర్తనను నిర్ధారించే కారకాలు రెండని  చెబుతుంది. వారసత్వం, పరిసరాలు. ఈ సూత్రీకరణకు అతీతమైన ప్రవర్తనలూ కనిపిస్తాయి. ఈ అవసరంలోంచే సైకాలజీ మరింత విస్తరించి, అతీంద్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం (పారా సైకాలజీ) పేరిట శాస్త్రీయతను సాధించింది. అలాగే జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ వ్యక్తిలోని సమస్త ప్రవృత్తులకీ డి.ఎన్.ఎ. జన్యువులు కారణమని వివరిస్తూ, మానవ జన్యు చిత్రపటాన్ని ఆవిష్కరించే పరిశోధనలు చేస్తూ పునర్జన్మ లోతులను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన వాల్టర్ సెమ్‌కివ్ అనే వైద్యుడు పునర్జన్మలపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి ‘బోర్న్ అగైన్’ పేరిట రెండు పుస్తకాలు రాశారు. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు గత జన్మలో ఎలా జన్మించారో విశ్లేషించారు. వీరిలో అబ్దుల్ కలామ్, అమితాబ్‌బచ్చన్, షారుక్‌ఖాన్ గత జన్మల ప్రస్తావన కూడా ఉండడం విశేషం. పునర్జన్మ నమ్మకమా? నిజమా? అంటే ఓ ఆకర్షణీయమైన మిస్టరీ అని చెప్పాలి.
 
 హిట్ ఫార్ములా ఎందుకయింది?
 మొత్తం మీద పునర్జన్మ కథా చిత్రాలు హిట్ ఫార్ములా అని విషయాన్ని తాజాగా ‘మనం’ సినిమా కూడా నిరూపించింది. ఇలాంటి సినిమాలకి ఆదరణ ఉండడానికి కారణాలు విశ్లేషించుకుంటే, దీనికి మనలోని సామూహిక అచేతనం (కలెక్టివ్ అన్‌కాన్షియస్‌నెస్) ఒక కారణం అని చెప్పక తప్పదు. ప్రతి మనిషిలోనూ జీవించాలనే సహజాతం, మరణాన్ని జయించాలనే అవ్యక్త వాంఛ, ఒక జన్మలో తీరని కోరికలు, ఆకాంక్షలు తర్వాతి జన్మలోనైనా తీరకపోతాయా అనే ఆశ వంటివన్నీ కలిసి తెరమీద పాత్రలు, కథలతో ప్రేక్షకులు తాదాత్మ్యీకరణం అయ్యేలా చేస్తున్నాయని చెప్పాలి. మనుషులలోని ఏ అట్టడుగు పొరలలోనో నిద్రాణంగా ఉన్న వాంఛాసాఫల్యం అనే సహజాతం ఈ సినిమాల ద్వారా లభిస్తోందని కూడా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెబుతారు.
 - మామిడి హరికృష్ణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement