
యశ్వంత్ వర్మ , అగ్ని ప్రమాదం నాటి దృశ్యం
అభిప్రాయం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికారిక నివాస ప్రాంగణంలోని ఔట్ హౌస్‌లో డబ్బుల బస్తాలు కాలిన విషయంపై అన్ని వర్గాలవారూ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాథ్యూస్ జె నెడుంపరాతో పాటు మిగతా వారూ బుధవారం (మార్చి 26) సుప్రీం కోర్టులో ఈ విషయమై ఫిర్యాదును నమోదు చేసి, దర్యాప్తును చేపట్టమని ఢిల్లీ పోలీసులను వెంటనే ఆదే శించాలని వాదించారు. అయితే అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.
మార్చి14 నాడు న్యాయమూర్తి వర్మ నివాస ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన నోట్ల వ్యవహారం బయటపడినా ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం, ఈ సంఘటనపై పోలీసు అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడిన మాటల మధ్య పొంతనలేక పోవడం వంటి కారణాలతో న్యాయవ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం మార్చి 24 సోమవారం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అ
లాగే కొలీజియం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేయడానికి నియమించింది. అయితే ఈ కమిటీకి దర్యాప్తు చేయడానికి ఎటువంటి అధికారమూ లేదని నెడుంపారా వాదించారు. భారీగా నగదు నోట్లు కాలిపోయాయి కాబట్టి ఇది భారతీయ న్యాయ సంహిత ప్రకారం కాగ్నిజన్ ్స నేరం కిందకు వస్తుందనేది ఆయన వాదన. నిజానికి ఇది ప్రతి ఒక్కరి వాదన కూడా. కొలీజియం ఆ కమిటీకి విచారణ అధికారాన్ని ఇవ్వడం చెల్లదన్న వాదనా సరైనదే.
పార్లమెంట్ లేదా రాజ్యాంగం స్వయంగా ఆ అధికారం కల్పించకపోతే, కొలీజియం తనంతట తానే విచారణ చేయించుకునే అధి కారం కల్పించుకోలేదు. జస్టిస్ వర్మ తన నివాస ప్రాంగణంలో కాలిపోయిన డబ్బు తనది కాదనీ, దీనివెనుక ఏదో కుట్ర ఉందనీ అంటున్న మాటలనూ అనుమానించవలసి వస్తోంది. ఆ డబ్బు తనది కాకపోతే ఆయన వెంటనే పోలీసు లకు ఫిర్యాదు చేసి, తనపై తప్పుగా కుట్ర పన్నేందుకు యత్నించిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని ఎందుకు కోరలేదన్న నెడుంపరాతో అందరూ ఏకీభవిస్తున్నారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసప్రాంగణంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద వీడియోలను సుప్రీంకోర్టు వెబ్ సైట్‌లో పెట్టారు. దేశ అత్యున్నత కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఏదీ దాచకుండా దొరికిన అన్ని దృశ్యాలకు సంబంధించిన వీడియోలను అందరికీ కనబడే పని చేశారు. ఇదే న్యాయ సమాచార హక్కు.
అనుమానాలివీ!
మూటలలో డబ్బునోట్ల కట్టలు ‘దొరికాయి’. కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకుంటారా?’ అని ఢిల్లీ పోలీసు కమిషనర్ అన్న మాటలను అర్థం చేసుకోవాలి. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ముఖ్య అధికారి అతుల్ గార్గ్ కాలిన నోట్లేమీ లేవని ముందు అన్నారు. ఆ తర్వాత తాను అలా అనలేదని మాట మార్చారు. మొత్తానికి అగ్నిమాపక శాఖ ఇచ్చిన రిపోర్టు ‘హిందీ’ భాషలో ఉంది. ఆ గదిలో మంటలు రేగినట్లు, మంటలు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో సగం కాలిన నోట్లు ఉన్నాయని అందులో ఉంది.
పోలీసులు ప్రమాదం స్థలానికి చేరిన సమ యంలో ఆ కాలిన నోట్లు కనపడ్డాయి. అప్పుడు దొరికిన నోట్లను అక్కడే ఎందుకు ఉంచలేదు? జడ్జిగారి అధికారిక ఇంట్లోనే లెక్క చూపని డబ్బు దొరికినపుడు అది కాగ్నిజబుల్ నేరం అవు తుంది కదా. పోలీసులు నేరస్థలంలో ఉన్న పరి స్థితిని ఆదే విధంగా ఉంచాలి, దాన్ని మార్చడానికి వీల్లేదు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలో స్టోర్ రూంను లాక్ చేసి ఉంచాలని డాక్యుమెంట్ చెబుతున్నది. లాక్ చేసి ఉంచాం అని సీఆర్‌పీఎఫ్ గార్డ్ రూం రిపోర్ట్ అంటున్నది.
మరి తాళం వేసి ఉంటే జస్టిస్ వర్మ అంటున్నట్లు పనివాళ్లు ఆ రూమ్‌ను ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వాడుకోగలుగుతారు? నియమాల ప్రకారం, ఏదైనా అక్రమ సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లయితే, దాన్ని పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి, తర్వాత కోర్టుకు సమర్పించాలి. అదే విధంగా నేర సంఘటన జరిగినట్లయితే, పంచనామా కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పాటించారా లేదా అనేది తెలియడం లేదు.
సీజేఐ చర్యలు అద్భుతంగా ఉన్నాయని ఉప రాష్ట్రపతి మెచ్చుకుంటున్నారని అంటున్నారు. అదే సందర్భంలో మన దేశం 2010లో ప్రవేశపెట్టిన ‘న్యాయ ప్రమాణాలు–జవాబు దారీ బిల్లు‘ (జుడీషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్–2010)ను మళ్లీ చట్టంగా తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు. సుప్రీంకోర్టును కూడా ఇదేవిధంగా ఆదేశించమని కూడా కోరారు.
ఇది న్యాయవ్యవస్థలో అవినీతిని తగ్గించడానికి కీలకంగా ఉపయోగపడుతుందని న్యాయవాది నెడుంపరా వివరించారు. ఇదైనా విని న్యాయం చెబుతారని నమ్మకతప్పదు. ఏం జరగబోతున్నది? ఈ దెబ్బతో 2010 బిల్లు తెచ్చి న్యాయ వ్యవస్థను సైతం కేంద్రం చేతిలోకి తీసుకునే కుట్ర ఏదో నడు స్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగనున్నది సామీ?
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ
‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్