Yashwanth Varma
-
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది. సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. అమ్రిక్ సింగ్ అనే వాచ్‌మన్ ఆ పార్సెల్ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్ తెచ్చిన ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సంజీవ్ బన్సాల్ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రవీందర్ సింగ్ తనకు పంపి, జస్టిస్ నిర్మల్ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్ నిర్మల్ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్ నిర్మల్ యాదవ్ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది. జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్ బన్సాల్, రాజీవ్ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్ నిర్మల్ యాదవ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది. అది మాత్రమే కాక, జస్టిస్ నిర్మల్ యాదవ్ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్ ఫోన్ కార్డ్ కూడా సంజీవ్ బన్సాల్ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్ నిర్మల్ యాదవ్ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది. ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు. కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్ టైమ్స్ 2009 జూన్ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు. అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్ అభిప్రాయాన్నే ప్రకటించారు. దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్ రిపోర్ట్) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది. దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట. అప్పుడు సీబీఐ చార్జిషీట్ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్ నిర్మల్ యాదవ్ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్ యాదవ్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్ ఫ్రేమ్ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్ ఫ్రేమ్ అయి విచారణ మొదలయింది. ఈలోగా జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ జరిగింది. సంజీవ్ బన్సాల్ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వైఫల్యాల వెనుక వ్యవస్థ లోపాలు!
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో అక్రమ నగదు కనిపించినట్లు గత వారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ బయట పెట్టింది. అంతకు మునుపు, జస్టిస్ శేఖర్ యాదవ్ న్యాయవ్యవస్థ గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగిస్తూ మాట్లాడారు. భారతదేశం మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తోందని జస్టిస్ శేఖర్ యాదవ్ గత డిసెంబరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో అనడం వివాదాస్పదమయింది. అప్పుడు ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడీ రెండో కేసులో అంతటా నిరసన పెల్లుబుకటంతో ఆలస్యంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయవ్యవస్థ స్పందనలు అర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉంటున్నాయా? లేవని సమా ధానం చెప్పుకునేటట్లయితే, జ్యుడీషియరీ జవాబుదారీతనం కోసం పనిచేయాల్సిన అంతర్గత విచారణ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఇక న్యాయమూర్తుల ఎంపిక విధానం ఈ పరిస్థితికి దారి తీసిన రెండో సమస్య. హైకోర్టు స్థాయిలో జరిగే నియామకాల తీరు మరీ ఆందోళన కలిగిస్తోంది.న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని కాపాడవలసిన అంతర్గత యంత్రాంగం (ఇన్–హౌస్ మెకానిజం) గుణదోషాల్ని జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ‘రోసలిండ్ విల్సన్ స్మారక ఉపన్యాసం’లో తీవ్రాతి తీవ్రంగా విమర్శించారు. ఇది 2019 నాటిదైనా నేటి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. మొట్టమొదటగా అంతర్గత వ్యవస్థ స్వభావం మీద ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. అది అనుసరించే పద్ధతులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా, ఇష్టాగోష్ఠిలా ఉంటాయి. ‘‘ఈ ప్రొసీజర్‌కు ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేదు’’. ‘‘ న్యాయ వ్యవస్థ లోపల దానికి ఉన్న మన్నన పరిమితం’’. ‘‘ఇందుకు నిదర్శనం – కమిటీ నివేదిక వ్యతి రేకంగా వచ్చిందని చెప్పి రాజీనామాకు సిద్ధపడిన న్యాయమూర్తి ఒక్క రంటే ఒక్కరూ లేకపోవటం...’’ అని ఆయన అంటారు. ‘‘న్యాయవ్యవస్థ దానికదే ఒక చట్టం, ఒక ప్రపంచం’’ అన్నట్లు అంతర్గత యంత్రాంగం పరిగణిస్తుందని జస్టిస్ షా మరీ ముఖ్యంగా ప్రస్తావించారు. వారిని వారే నియమించుకుంటారు. తమ ప్రవర్త నను నియంత్రించే విధివిధానాలను వారే అంతర్గతంగా రూపొందించుకుంటారు. ఇది ‘‘ఒక తరహా స్వీయపాలన’’ అంటూ, ‘‘ఏలాగైతే ఉండాలో కచ్చితంగా అందుకు భిన్నంగా ఉంది..’’ అని విమర్శించారు. అంతర్గత యంత్రాంగం వాస్తవ పనితీరు ఎలా ఉంటుందో తెలిపేందుకు పలు విమర్శలు ఉన్నాయి. న్యాయమూర్తుల నడత గురించి బహిరంగంగా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నా, వారిపై ఇన్–హౌస్ విచారణలు ఏనాడూ జరగలేదు. అలాగే, జడ్జీల మీద నిర్దిష్ట ఆరోపణలు చేసిన కేసుల్లోనూ అంతర్గత విచారణకు ఆదేశాలు లేవు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కోసం తటస్థమైన, అధికా రికమైన, చట్టబద్ధ యంత్రాంగం ఒకటి ఎందుకు ఉండాలో జస్టిస్ షా తీవ్ర పదజాలంతో వివరించారు. ‘‘న్యాయపీఠం మీద కూర్చున్న క్షణం నుంచీ వారి ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశించే నైతిక వర్తన నియమావళి న్యాయమూర్తులకు మనసుల్లో పాతుకుపోయి ఉండాలి. కాని అలా ఉండదు. కచ్చితంగా చెప్పాలంటే, వారు తమ ముందుండే లాయర్లు, వాదులు, ప్రతివాదులు, నేరస్థులు, సాక్షులు, పోలీసుల మాదిరిగానే ఫక్తు సాధారణ మానవులు. వారు నిర్వహించే పదవుల స్వభావాన్ని బట్టి వారికి నైతికతను ఆపాదిస్తే అది మోసం, ప్రమాదకరం...’’ అన్నారు.న్యాయమూర్తుల నడత, ప్రవర్తన గురించి మాట్లాడుకుంటు న్నాం కాబట్టి, వారి ఎంపిక విధానం గురించిన ప్రశ్న తలెత్తక మానదు. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణంగా పనిచేయడం లేదన డంలో సందేహం లేదు. మనకు వేరొక విధానం కావాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు, ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ఎక్కడ విఫలమైందో చూద్దాం.జస్టిస్ షాతో నేను ఈ విషయం మాట్లాడినప్పుడు, ఆయన పలు అంశాలు చెప్పారు. మొదటిది – జడ్జీలను ఎంపిక చేయడానికి ఇవీ అంటూ చెప్పగలిగిన ఆమోదిత ప్రమాణాలేవీ లేవు. అంతా ‘‘అడ్ హాక్’’గా ఉన్నట్లు ఉంటుంది. నోటిమాట చెల్లుబాటు అవుతుంది. తరచూ ఇష్టులకే పెద్దపీట వేస్తారు.ఎంపికల్లో అత్యుత్తములను నిర్లక్ష్యం చేయడం కూడా పరిపాటి. ఇది మరీ ఆందోళనకరం. కొట్టొచ్చినట్లు కనబడే రెండు ఉదాహ రణలు జస్టిస్ షా చెప్పారు. జస్టిస్ అకిల్ ఖురేషీ, జస్టిస్ మురళీధర్‌లు సుప్రీం కోర్టులో స్థానం పొందలేకపోయారని, సుప్రీంలో ప్రవేశించ డానికి వారు పూర్తిగా అర్హులని ఆయన విశ్వసిస్తారు. ఎంపిక ప్రక్రియ నుంచి ప్రభుత్వాన్ని దూరం పెట్టడానికి కొలీజియం వ్యవస్థ రూపొందింది. అయినప్పటికీ ప్రభుత్వం తాను చేయగలిగినంతా చేయగలదు. పార్లమెంటులో మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కొలీజియం సిఫారసులను తొక్కిపట్టగలదు. అంటే ఏదైతే జరగకూడదన్న భావనతో కొలీజియం ఏర్పడిందో దొడ్డిదారిన అదే జరుగుతోంది. ఏమైనప్పటికీ, హైకోర్టు జడ్జీల నియామక స్థాయిలో కొలీజియం వ్యవస్థ అత్యంత బలహీనమైనదని భావించాలి. ఇది ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే, సుప్రీంకోర్టులో బహుశా 95 శాతం మంది న్యాయమూర్తులు హైకోర్టు జ్యుడీషియరీ నుంచే ఎంపిక అవుతారు. హైకోర్టు జడ్జీల నియామకాలు లోపభూయిష్ఠంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం సుప్రీం కోర్టు మీదా పడుతుంది. చివరగా, మనం చర్చించిన రెండు సమస్యలూ... అంతర్గత యంత్రాంగం, నియామక విధానం... ఏమాత్రం అలక్ష్యం చేయదగి నవి కావు. ఈ అలక్ష్యం మన న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవానికి వీటికి దేనికదిగా కాకుండా, రెంటికీ కలిపి పరిష్కారం ఆలోచించాలి. పాలక, న్యాయ వ్యవస్థల పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. మరి ఇందుకు అవి సిద్ధంగా ఉన్నాయా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
జస్టిస్ యశ్వంత్‌కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం. -
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు.. కదిలిన డొంక
తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు మొత్తం న్యాయవ్యవస్థను కుదిపేస్తున్నవి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయమూర్తి ఇంటికి పరుగున వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి దగ్ధమవుతున్నవి భిన్నంగా కనిపించాయి. తమ బాధ్యతగా మంటలు ఆపి పై అధికారులకు ఎటువంటి సమాచారం ఇచ్చారో తెలియదు! కానీ మూడు రోజుల తర్వాత గానీ మీడియాలో ఈ వార్త రాలేదు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ దగ్గరకు చేరిన వీడియోలు సుప్రీంకోర్టు వెబ్ సైట్లో అప్లోడ్ కాకపోయి వుంటే కరెన్సీ తగలబడటం అనేది బయటకు వచ్చేది కాదు. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా... జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు ప్రకటించారు. అయితే ఆ చర్యలే ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటున్నాయి. న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో లక్ష కరెన్సీ దొరికితే ఆ వివరాలను మీడియాకి ఇచ్చి, ఆ ఉద్యోగి ఫొటోలు విడుదల చేసే పోలీసులు జస్టిస్ యశ్వంత్ వర్మ పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహ రించారు? దాదాపు 15 కోట్ల విలువ ఉన్న కరెన్సీ ఒక న్యాయమూర్తి ఇంట్లో లభిస్తే న్యాయవ్యవస్థ తీసుకున్న చర్య ఆ న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేయడమా? ఒక కేసులో విచారణ సక్రమంగా జరగదని న్యాయస్థానాలు భావించినప్పుడు నిష్పక్ష విచారణకు సీబీఐకి కేసును బదిలీ చేస్తాయి కదా. మరి ఆ కరెన్సీ విషయం నిగ్గు తేల్చమని సీబీఐని ఎందుకు ఆదేశించలేదు? కరెన్సీతో కూడిన కేసు కాబట్టి ఈడీను ఆ కేసు తీసుకోమని ఎందుకు అడగలేదు? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో దర్యాప్తు చేస్తే గాని నిజాలు బయటకు రావని పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన న్యాయవ్యవస్థ ఈ విషయంలో అంతర్గత విచారణకు ఆదేశించడం ఏమిటి? ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు వస్తే మరో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ వేయడం సబబా? ఆ న్యాయమూర్తి మీడియా ముందుకు వచ్చి ‘ఆ కరెన్సీ నోట్లు నావి కావు, అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు’ అనీ నోట్ల కట్టలను చూపుతుంటే ఆయన మీద ఆంక్ష విధించలేదు. కేసు గురించి బహిరంగంగా మాట్లాడటానికి వీలు లేదనే నిబంధన సామాన్య నిందితుడి మీద విధించడం న్యాయస్థానాలు చేస్తుంటాయి. కానీ అది ఢిల్లీ న్యాయమూర్తికి వర్తింప చేయలేదు. ‘నా పరువుకు భంగం కలిగించే కుట్రలో భాగంగా ఎవరో ఆ కరెన్సీ నోట్లు (Currency Notes) తెచ్చి నా ఇంట్లో పెట్టారు’ అని సదరు న్యాయమూర్తి అంటున్నారు.మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఇటీవల చెన్నైలో చేసిన ప్రసంగంలో ‘న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సడలుతోంది’ అన్నారు. మరో సమావేశంలో మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కూడా ‘న్యాయవ్యవస్థలో అంతా సక్రమంగా ఉందనలేం’ అన్నారు. ఆ ఇద్దరు న్యాయమూర్తుల నోటి వెంట వచ్చిన మరో పదం భారతీయ న్యాయ వ్యవస్థలో ‘అంకుల్ జడ్జి సిండ్రోమ్’ నెలకొన్నది అనేది. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి పెరిగిందని, వారసులు జడ్జిలు అవుతున్నారనే విషయం ముంబైకి చెందిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర సాక్ష్యాలతో సహా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఆయన పరిశోధనలో హైకోర్టు స్థాయిలో 50 శాతం న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు స్థాయిలో 33 శాతం న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి దగ్గర బంధువులు. కొలీజియం ఉండటం సబబా?న్యాయవ్యవస్థలో బంధు ప్రీతి పెరగడానికి కారణం ప్రపంచంలో మరే దేశంలో లేనటువంటి కొలీజియం వ్యవస్థ. ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో న్యాయమూర్తులు నియామకం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేస్తాయి. మనదేశంలో కూడా రాజ్యాంగం ఆ విధానాన్ని అనుసరించింది. అయితే మధ్యలో న్యాయమూర్తులు ఆ విధానాన్ని హైజాక్ చేశారు. కొలీజియం వ్యవస్థను స్థాపించారు. ఈ కొలీజీయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మరో నలుగురు న్యాయమూర్తులు సభ్యులు. హైకోర్టు స్థాయిలోనూ అటువంటి కొలీజియం ఉంటుంది. ఈ కొలీజియం న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుంది. వారు సిఫార్సు చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం నియమించాలి.ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ సంస్కరణ కోసం రాజ్యాంగాన్ని సవరించి ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్’ (ఎన్‌జేఏసీ) చట్టం చేసింది. దీని ద్వారా న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం ద్వారా జరిగేందుకు వీలు కల్పించింది. అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, కొలీజియం (Collegium) ద్వారానే నియామకాల విధానం కొనసాగిస్తామన్నది. న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించే విధానం మరెక్కడా లేదు. ఆ హక్కును ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు ఇస్తుందా? ప్రతి వ్యవస్థలో సీనియర్స్ తమ తర్వాతి స్థానాల వారిని నియమించడం సబబా! న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?గతంలో కొలీజియం వ్యవస్థను సవాలు చేసిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర. ఆయన తన పిటీషన్లో వేసిన ప్రశ్నలు – ఇంతవరకు ఆ కరెన్సీని ఎందుకు భద్రపరచి, తగలబడిన వస్తువుల జాబితా తయారు చేయలేదు? ఎవరిని అరెస్టు ఎందుకు చేయలేదు? క్రిమినల్ చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదు? ఈ కేసు వివరాలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు? ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్ ఎన్‌జేఏసీ చట్టాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం గురించి ప్రతిపక్ష నేతలతో చర్చించారు. ఇకముందైనా కొలీజియం వ్యవస్థలోని లోపాలను సుప్రీంకోర్టు వదులుకుంటుందా? పారదర్శకత, జవాబుదారీతనం న్యాయవ్యవస్థ ప్రదర్శిస్తుందా?- పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు pvg2020@gmail.com -
జస్టిస్ యశ్వంత్ వివాదంపై ఏం చేద్దాం..? వారితో సీజేఐ ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: ఒకవైపు ఢిల్లీ హైకోర్టులో బాధ్యతలు ఏమీ అప్పగించడం లేదు.. మరొకవైపు అలహాబాద్ హైకోర్టేమో వద్దంటోంది. ఇది జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రస్తుత పరిస్థితి. ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయన ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడానికి పూనుకున్న సుప్రీంకోర్టు.. ముగ్గురు ప్రధాన న్యాయమూర్తలతో కూడిన కమిటీని ఇప్పటికే నియమించింది.అయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. #WATCH | Presidents of Bar Associations of High Court of Allahabad, Lucknow bench, Gujarat, Karnataka, and Jabalpur bench of Madhya Pradesh have come to Supreme Court to meet Chief Justice of India Sanjiv Khanna and other senior judges on the issue of Justice Yashwant Varma.… pic.twitter.com/JuX6sLgsl3— ANI (@ANI) March 27, 2025 ఢిల్లీ హైకోర్టు ‘ దూరం’ పెట్టేసింది..!జస్టిస్ యశ్వంత్ వర్మపై అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ,, అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనం. అయినా మళ్లీ అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ అంటూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. అక్కడ బార్ అసోసియేషన్ ఖండించింది. జస్టిస్ యశ్వంత్ గతంలో ఇచ్చిన తీర్పులన్నీ రివ్యూ చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరమని, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. ఈ తరుణంలో జస్టిస్ యశ్వంత్ పై సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజనమా అనే కోణంలో సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. -
ఏం జరుగనున్నది సామీ?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికారిక నివాస ప్రాంగణంలోని ఔట్ హౌస్‌లో డబ్బుల బస్తాలు కాలిన విషయంపై అన్ని వర్గాలవారూ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాథ్యూస్ జె నెడుంపరాతో పాటు మిగతా వారూ బుధవారం (మార్చి 26) సుప్రీం కోర్టులో ఈ విషయమై ఫిర్యాదును నమోదు చేసి, దర్యాప్తును చేపట్టమని ఢిల్లీ పోలీసులను వెంటనే ఆదే శించాలని వాదించారు. అయితే అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.మార్చి14 నాడు న్యాయమూర్తి వర్మ నివాస ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన నోట్ల వ్యవహారం బయటపడినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, ఈ సంఘటనపై పోలీసు అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడిన మాటల మధ్య పొంతనలేక పోవడం వంటి కారణాలతో న్యాయవ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం మార్చి 24 సోమవారం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే కొలీజియం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేయడానికి నియమించింది. అయితే ఈ కమిటీకి దర్యాప్తు చేయడానికి ఎటువంటి అధికారమూ లేదని నెడుంపారా వాదించారు. భారీగా నగదు నోట్లు కాలిపోయాయి కాబట్టి ఇది భారతీయ న్యాయ సంహిత ప్రకారం కాగ్నిజన్ ్స నేరం కిందకు వస్తుందనేది ఆయన వాదన. నిజానికి ఇది ప్రతి ఒక్కరి వాదన కూడా. కొలీజియం ఆ కమిటీకి విచారణ అధికారాన్ని ఇవ్వడం చెల్లదన్న వాదనా సరైనదే. పార్లమెంట్ లేదా రాజ్యాంగం స్వయంగా ఆ అధికారం కల్పించకపోతే, కొలీజియం తనంతట తానే విచారణ చేయించుకునే అధి కారం కల్పించుకోలేదు. జస్టిస్ వర్మ తన నివాస ప్రాంగణంలో కాలిపోయిన డబ్బు తనది కాదనీ, దీనివెనుక ఏదో కుట్ర ఉందనీ అంటున్న మాటలనూ అనుమానించవలసి వస్తోంది. ఆ డబ్బు తనది కాకపోతే ఆయన వెంటనే పోలీసు లకు ఫిర్యాదు చేసి, తనపై తప్పుగా కుట్ర పన్నేందుకు యత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని ఎందుకు కోరలేదన్న నెడుంపరాతో అందరూ ఏకీభవిస్తున్నారు.జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసప్రాంగణంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద వీడియోలను సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పెట్టారు. దేశ అత్యున్నత కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఏదీ దాచకుండా దొరికిన అన్ని దృశ్యాలకు సంబంధించిన వీడియోలను అందరికీ కనబడే పని చేశారు. ఇదే న్యాయ సమాచార హక్కు.అనుమానాలివీ!మూటలలో డబ్బునోట్ల కట్టలు ‘దొరికాయి’. కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకుంటారా?’ అని ఢిల్లీ పోలీసు కమిషనర్ అన్న మాటలను అర్థం చేసుకోవాలి. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ముఖ్య అధికారి అతుల్ గార్గ్ కాలిన నోట్లేమీ లేవని ముందు అన్నారు. ఆ తర్వాత తాను అలా అనలేదని మాట మార్చారు. మొత్తానికి అగ్నిమాపక శాఖ ఇచ్చిన రిపోర్టు ‘హిందీ’ భాషలో ఉంది. ఆ గదిలో మంటలు రేగినట్లు, మంటలు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో సగం కాలిన నోట్లు ఉన్నాయని అందులో ఉంది. పోలీసులు ప్రమాదం స్థలానికి చేరిన సమ యంలో ఆ కాలిన నోట్లు కనపడ్డాయి. అప్పుడు దొరికిన నోట్లను అక్కడే ఎందుకు ఉంచలేదు? జడ్జిగారి అధికారిక ఇంట్లోనే లెక్క చూపని డబ్బు దొరికినపుడు అది కాగ్నిజబుల్ నేరం అవు తుంది కదా. పోలీసులు నేరస్థలంలో ఉన్న పరి స్థితిని ఆదే విధంగా ఉంచాలి, దాన్ని మార్చడానికి వీల్లేదు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలో స్టోర్ రూంను లాక్ చేసి ఉంచాలని డాక్యుమెంట్ చెబుతున్నది. లాక్ చేసి ఉంచాం అని సీఆర్పీఎఫ్ గార్డ్ రూం రిపోర్ట్ అంటున్నది. మరి తాళం వేసి ఉంటే జస్టిస్ వర్మ అంటున్నట్లు పనివాళ్లు ఆ రూమ్‌ను ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వాడుకోగలుగుతారు? నియమాల ప్రకారం, ఏదైనా అక్రమ సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లయితే, దాన్ని పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి, తర్వాత కోర్టుకు సమర్పించాలి. అదే విధంగా నేర సంఘటన జరిగినట్లయితే, పంచనామా కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పాటించారా లేదా అనేది తెలియడం లేదు.సీజేఐ చర్యలు అద్భుతంగా ఉన్నాయని ఉప రాష్ట్రపతి మెచ్చుకుంటున్నారని అంటున్నారు. అదే సందర్భంలో మన దేశం 2010లో ప్రవేశపెట్టిన ‘న్యాయ ప్రమాణాలు–జవాబు దారీ బిల్లు‘ (జుడీషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్–2010)ను మళ్లీ చట్టంగా తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు. సుప్రీంకోర్టును కూడా ఇదేవిధంగా ఆదేశించమని కూడా కోరారు. ఇది న్యాయవ్యవస్థలో అవినీతిని తగ్గించడానికి కీలకంగా ఉపయోగపడుతుందని న్యాయవాది నెడుంపరా వివరించారు. ఇదైనా విని న్యాయం చెబుతారని నమ్మకతప్పదు. ఏం జరగబోతున్నది? ఈ దెబ్బతో 2010 బిల్లు తెచ్చి న్యాయ వ్యవస్థను సైతం కేంద్రం చేతిలోకి తీసుకునే కుట్ర ఏదో నడు స్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగనున్నది సామీ?మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు : జస్టిస్ వర్మ ఇంటికి ‘సుప్రీం’ కమిటీ
ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ ఇవాళ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్లింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బయపడ్డ నోట్ల కట్టల గురించి దర్యాప్తు చేపట్టనుంది.మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి.#WATCH | Delhi | Three-member Judge committee to probe allegations against Justice Yashwant Varma leaves from his residence pic.twitter.com/A3Fw8N12X9— ANI (@ANI) March 25, 2025 ఇదే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు..పలు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని నియమించింది. ఆ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. కాలిన నోట్ల కట్టల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా అంటూ పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చింది. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అల్హదాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది.నోట్ల కట్టల విషయంలో స్పష్టత వచ్చే వరకు న్యాయపరమైన పనులు కేటాయించవద్దని సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర ఉపాధ్యాయకు ఆదేశాలు జారీ చేసింది. -
ఇంతకూ ఆ కరెన్సీ ఎక్కడ?
దేశంలో అవినీతి సర్వాంతర్యామి అని, ఏ వ్యవస్థా అందుకు అతీతం కాదని గ్రహించినవారిని సైతం దిగ్భ్రాంతిపరిచేలా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఆ ఘటనలో భారీ మొత్తంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలున్న సంచులు బయటపడ్డాయని గుప్పుమంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో సైతం అందుకు సంబంధించిన వీడియో ఉంది. కానీ నోట్ల కట్టల సంగతి అబద్ధమని, కుట్రపూరితమని అంటున్నారు న్యాయమూర్తి. పైగా తానుంటున్న నివాసానికి విడిగా, అందరూ వచ్చిపోగలిగేలా ఉండే ఆ స్టోర్ రూమ్‌కు తాళం కూడా ఉండదని, అలాంటిచోట అంత డబ్బు ఎవరైనా దాస్తారా అన్నది ఆయన ప్రశ్న. కానీ, సామాన్యుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయ నొక్కరే కాదు... బాధ్యతాయుత స్థానాల్లోవున్న చాలామంది సంజాయిషీ ఇవ్వకతప్పని ప్రశ్నలవి. ఈ నెల 14 అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగితే 21వ తేదీన మీడియా బయటపెట్టేవరకూ అధికారికంగా ఎందుకు వెల్లడించలేదు? న్యాయవ్యవస్థ, పోలీస్, అగ్నిమాపక విభాగాలు మౌనంగా ఎందుకు ఉండిపోయాయి? న్యాయమూర్తిపై అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని ఈ ఉదంతం వెల్లడైన వెంటనే సుప్రీంకోర్టు తెలిపింది. కానీ ఆయన విధులకు దూరంగా వుంటారని ఆ మర్నాడు ప్రకటించింది. బదిలీ చేశామని తాజాగా చెబుతోంది. మంచిదే. కానీ ఘటన తర్వాత వారంపాటు ఆయన విధులు ఎలా నిర్వర్తించగలిగారు? స్టోర్‌రూమ్‌కు తాళం లేదని జస్టిస్ వర్మ చెబుతున్నారు. ఘటన సంగతి తెలిశాక తానిచ్చిన ఆదేశాలతో అక్కడికెళ్లిన హైకోర్టు రిజిస్ట్రార్ సైతం ఆ మాటే అన్నారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ అంటున్నారు. మరి తాళంవున్న గదిలోనే మంటలు రేగాయని పోలీసులు ఎలా చెబుతున్నారు? అసలు అగ్నిమాపక విభాగం తనకున్న నిబంధనల మేరకు నిర్వహించాల్సిన పంచనామా పూర్తిచేసిందా? అక్కడ గుర్తించదగిన లేదా సగం కాలిన సరుకు గురించిన వివరాలు నమోదు చేసిందా? ఇద్దరు సాక్షులతో ఆ పంచ నామాపై సంతకం చేయించిందా? మంటలు ఆర్పిన సందర్భంలో తమకు నోట్ల కట్టలున్న సంచు లేమీ కనబడలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం చీఫ్ అతుల్ గార్గ్ శనివారం చెప్పారు. అలాంటి ప్రకటనేమీ తానీయలేదని ఆ మర్నాడు ఖండించారు. మళ్లీ గొంతు సవరించుకుని కరెన్సీ నోట్లు దొరకలేదని ఇప్పుడంటున్నారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టిన వీడియోలో కాలిపోయిన, సగంకాలిన నోట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడా నోట్లు మాయమ య్యాయి. పోలీస్ కమిషనర్ సైతం తన ప్రెస్‌నోట్‌లో పనికిరాని స్టేషనరీ సామాను కాలిపోయిందని తెలియజేశారు తప్ప కరెన్సీ నోట్ల సంగతి ప్రస్తావించలేదు. 14వ తేదీ రాత్రి జరిగిన ప్రమాదంలో కాలిబూడిదైన సామానంతా ఆ మర్నాడు ఉదయం అక్కడి నుంచి తొలగించారు. ఈ పనంతా చేసిందెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. న్యాయమూర్తితోపాటు అగ్నిమాపక విభాగం, పోలీసులు కరెన్సీ లేదని చెబుతుండగా, ఆ నివాసానికి సమీపంలోనే పారిశుద్ధ్య సిబ్బందికి ఒకటి రెండు కాలిన నోట్లు కంటబడ్డాయి. అంటే... ఇందులో నిగూఢంగా ఏదో జరుగుతున్నట్టే కదా!ఈ ఉదంతంలో పారదర్శకంగా వ్యవహరించటానికి సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించటం అసాధారణమైంది, అభినందించదగ్గది కూడా. మంటల్లో బుగ్గి అయిన కరెన్సీ నోట్ల వీడియోనూ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ప్రాథమిక నివేదికనూ తన వెబ్ సైట్లో ఉంచింది. గతంలో న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాలున్నా ఎన్నడూ ఇలా జరగ లేదు. అంతేగాక పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగూ, హిమా చల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంథావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామ న్లతో ఈ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అయితే అంతమాత్రాన అంతా సక్రమంగా సాగుతోందని భావించనక్కరలేదు. కాలిబుగ్గయిన కరెన్సీ నోట్ల సంచులు మాయమవటం, ఎవరూ నోట్ల సంగతి ధ్రువీకరించకపోవటం సందేహాలకు తావిస్తోంది. రాజ్యానికి సంబంధించిన మూడు ప్రధాన అంగాల్లో ఒక్క న్యాయవ్యవస్థకు మాత్రమే ఆ మూడింటి పరిధులనూ నిర్ణయించగల గొప్ప అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ బరువు బాధ్యతలకు తగ్గట్టుగా న్యాయవ్యవస్థ జవాబుదారీతనంతో ఉంటున్నదా? గత అనుభవాలు గమనిస్తే లేదన్న సమాధానమే వస్తుంది. కొలీజియం వ్యవస్థను మార్చాలని నిశ్చయించుకుని ఎన్డీయే సర్కారు బిల్లు తెచ్చినప్పుడు పార్లమెంటులో అనేకులు న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిద్దరు న్యాయమూర్తులపై అభిశంసన వరకూ వెళ్లింది. కానీ విధాన సంబంధమైన సంక్లిష్టత వల్ల అవి వీగిపోయాయి. కొందరు రాజీనామా చేశారు. మరికొందరిపై చేసిన దర్యాప్తు అతీగతీ లేదు. న్యాయాన్యాయాలను విశ్లేషించి తీర్పులివ్వాల్సిన స్థానంలో ఉన్నందువల్ల న్యాయమూర్తులకు పటిష్ఠమైన రక్షణ కవచం ఉండాల్సిందే. దురుద్దేశంతో, కుయుక్తులతో వారిపై నీలాపనిందలు వేసే ధోరణులను అడ్డుకోవాల్సిందే. కానీ అది అవినీతి మకిలి అంటినవారికి ఆలంబన కారాదు. ఈ రెండింటి మధ్యా సమతౌల్యం సాధించటానికి ఇంతవరకూ ఎలాంటి ప్రయ త్నమూ జరగకపోవటమే సమస్యకు మూలం. ఇప్పుడున్న కొలీజియం బదులు మరొకటి వస్తే అంతా మారిపోతుందనుకోవటానికి లేదు. స్వయంప్రక్షాళనకు నడుంబిగించి జవాబుదారీతనం పెంపొందించే పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనంతవరకూ ఈ పరిస్థితి మారదు. -
‘జస్టిస్ యశ్వంత్ తీర్పులన్నీ రివ్యూ చేయాలి’
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల అనంతరం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న తాజా నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తోంది. ప్రధానంగా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు(న్యాయవాదులు) తమ నిరసన స్వరం పెంచారు. ఆ జడ్జి మాకొద్దంటూ ఇప్పటికే సీజేఐకి లేఖ రాసిన బార్ సభ్యులు.. మరోమారి అదే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతున్నారు.‘ ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు విషయాన్ని క్లియర్ గా లేఖ ద్వారా తెలియజేశాం. ఆయన్ని ఇక్కడకు(అలహాబాద్ హైకోర్టు) బదిలీ చేయవద్దని కోరాం. ఎందుకంటే ఏ కోర్టు అయినా చెత్త పడేసి ప్లేస్ కాదు కదా. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిగి క్లీన్ చీట్ వచ్చే వరకూ జస్టిస్ వర్మ అక్కడే ఉండాలి. జస్టిస్ వర్మ అక్కడే ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆయనపై విచారణను చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పటివరకూ ఇచ్చిన తీర్పులు అన్నింటిపై రివ్యూ చేయాలి. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరం. సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలి’ అని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు. మాకొద్దంటున్నా.. అలహాబాద్ హైకోర్టకే జస్టిస్ వర్మ -
మాకొద్దంటున్నా... అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ!
ఢిల్లీ : అవినీతి మరక అంటుకుని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మరోమారు నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి గురువారం, సోమవారాల్లో ప్రత్యేకంగా రెండు సార్లు సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం చివరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాల్సి ఉంటుంది.ఢిల్లీ హైకోర్టులో నో వర్క్..!అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనంకాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. 2021లో అలహాబాద్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు..ఈ నేపథ్యంలో యశ్వంత్ ను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయడం, ఆపై తమకు ఆ జడ్జి వద్దని అక్కడ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులోనే యశ్వంత్ కొనసాగుతారని భావించారు. కానీ అక్కడ ఆయన చేదు అనుభవం ఎదురుకావడంతో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. 2021 లో అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్.. మళ్లీ అక్కడికే వెళ్లడానికి దాదాపు రంగం సిద్ధం కావడంతో అలహాబాద్ హైకోర్టులో ఆయనకు ఏ పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సిందే.సుప్రీంకోర్టులో పిల్..యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగుచూసిన నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్0 దాఖలైంది. ముందు భారీగా నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై ముందుగా ఎప్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు. -
అప్పుడు కూడా జడ్జి యశ్వంత్ ఇంట్లో నోట్ల కట్టల కుప్ప!
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. భారీ అవినీతి ఆరోపణ నడుమ యశ్వంత్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయని ఒకవైపు ఆరోపణలు.. వీటి విలువ కోట్ల రూపాయిలు ఉంటుందని మరొవైపు అంచనాలు. ఒకవైపు జస్టిస్ ఇంట్లో ఏమీ నగదు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక చీఫ్ అన్నట్లు ఒకవైపు, తాను అనలేదని మళ్లీ మరొకవైపు. ఇవే వార్తలు గత రెండు రోజుల నుంచి. చక్కర్లు కొడుతున్నాయి.అంటే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు విషయం బయటకురాదు. న్యాయవవస్థలో ఉన్న ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ‘లెక్క సరిచేసుకునే’ బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. ఇప్పటివరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ నుంచి ఒక్క మాట పెదవి దాటలేదు. మరి ఆయన మౌనం పాటిస్తున్నారా.. వెనుక ఉండి ఏమైనా ‘ కథ’ నడిపిస్తున్నారా అనేది కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.2018లోనే వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్..!తాజాగా జరిగింది ఒకటైతే,. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి సుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ పై కేసు ఫైల్ చేసింది సీబీఐ. దానికి ఆ సమయంలో యశ్వంత్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరకడంతో సీబీఐ ఎప్ఐఆర్ నమోదు చేసింది. అయితే 2012 సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కి సింభోలి షుగర్ మిల్స్ వందల కోట్లలో టోకరా వేసి ఘటన అప్పట్లో సంచలనమైంది.. సదరు బ్యాంకును మోసం సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింభోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5వేలు మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణానికి వెళ్లి, ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు(కేవైసీ) సృష్టించి మోసానికి తెరలేపారు సింభోలి షుగర్ మిల్స్.2015లో అసలు విషయం వెలుగులోకి..అయితే సింభోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయాన్ని ఓబీసీ బ్యాంకు 2015లో గ్రహించింది. ఆ షుగర్ మిల్స్ తీసుకున్న రుణం మోసం చేసి తీసుకున్నదిగా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం రుణం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది.అలహాబాద్ హైకోర్టు జోక్యంతో 2023లో మళ్లీ కొత్తగా..ఈ భారీ అవినీతిని సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవవస్థను కుదిపేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు కచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి ఏడు బ్యాంకులను లింక్ చేసింది హైకోర్టు. సుమారు ఏడు బ్యాంకులు కలిపి బయారూ. 900 కోట్లు సింభోలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించిన హైకోర్టు.. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది. -
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదంతా లెక్కల్లో చూపని అక్రమ నగదేనని అధికారులు చెబుతున్నారు. సాక్షాత్తూ న్యాయమూర్తి ఇంట్లో భారీగా సొమ్ము లభించడం రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు.యశ్వంత్ వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అవినీతికి పాల్పడి అక్రమంగా నగదు కూడబెట్టినట్లు విచారణలో తేలితే యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆయన ఇంట్లో ఎంత నగదు దొరికిందనే సంగతి అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ నెల 14వ తేదీన నగదు లభించగా, ఈ నెల 20దాకా ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గమనార్హం. వారం రోజులదాకా విషయం బయటకు రాలేదు. అగ్నిప్రమాదంతో బయటపడ్డ నగదు ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన రాత్రి సమయంలో ఆ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11.30 గంటల సమయంలో యశ్వంత్ వర్మ కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఢిల్లీ ఫైర్ సర్విసు సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అర్పివేశారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు. మంటలను ఆర్విన తర్వాత గదులను తనిఖీ చేస్తుండగా, ఓ గదిలో భారీగా నోట్లకట్టలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ హోంశాఖకు తెలియజేశారు. నగదు వివరాలను తెలియజేస్తూ ఒక రిపోర్టు అందజేశారు.హోంశాఖ ఈ రిపోర్టును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభించడాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా పరిగణించారు. ఆయన నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమైంది. యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. వాస్తవానికి యశ్వంత్ వర్మ 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజా వివాదం నేపథ్యంలో యశ్వంత్ వర్మ శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఆయనపై సుప్రీంకోర్టు కొలీజియం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.కేవలం బదిలీతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొలీజియంలోని కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. యశ్వంత్ వర్మ వ్యవహార శైలిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కొలీజియం వివరణ కోరింది. తాజా వివాదంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం విచారణ ప్రారంభించారు. యశ్వంత్ వర్మ విషయంలో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారంలోకి వస్తున్నా యని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నామని, విచారణతో దీనికి సంబంధం లేదని స్పష్టంచేసింది. పూర్తి విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పదవి నుంచి తొలగించవచ్చా? న్యాయమూర్తులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలంటూ 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు అందితే తొలుత ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభించాలి. సదరు జడ్జి నుంచి వివరణ కోరాలి. జడ్జి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా లేక లోతైన దర్యాప్తు అవసరమని భావించినా అందుకోసం అంతర్గత కమిటీని నియమించాలి. ఆరోపణలు నిజమేనని కమిటీ దర్యాప్తులో తేలితే.. పదవికి రాజీనామా చేయాలంటూ జడ్జిని ఆదేశించాలి. శాశ్వతంగా పదవి నుంచి తొలగించడానికి అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ పార్లమెంట్‌కు సిఫా ర్సు చేయాలి. అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే జడ్జి పదవి ఊడినట్లే. ఫైర్ సిబ్బందికి నగదు దొరకలేదు: డీఎఫ్ఎస్ చీఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో తమ సిబ్బందికి ఎలాంటి నగదు దొరకలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) చీఫ్ అతుల్ గార్గ్ శుక్రవారం చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ నెల 14న రాత్రి 11.35 గంటలకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిందని, తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్వివేశారని అన్నారు. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసిందన్నారు. వారికి నగదేమీ దొరకలేదన్నారు. పార్లమెంట్లో అభిశంసించాలి జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడం పట్ల పలువురు సీనియర్ న్యాయవాదులు విస్మయం వ్యక్తంచేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని మరో కోర్టుకు బదిలీ చేయడం ఏమిటని అడ్వొకేట్ వికాస్ సింగ్ ప్రశ్నించారు. ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కఠినంగా వ్యవహరించాల్సిన వృత్తిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏమిటని అన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, పూర్తి నిజాలు బయటపెట్టాలని మరో అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది చెప్పారు. యశ్వంత్ వర్మ తప్పు చేసినట్లు రుజువైతే చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వెల్లడించారు. ఈ నెల 14న నోట్ల కట్టలు దొరికితే ఈ నెల 21న విషయం బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.పనికిరాని చెత్త మాకొద్దుయశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వ్యతిరేకించింది. తమ హైకోర్టు చెత్తకుండీ కాదని తేల్చిచెప్పింది. పనికిరాని చెత్తను ఇక్కడికి తరలిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఒక తీర్మానం ఆమోదించింది. ఎవరీ యశ్వంత్ వర్మ? వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్ కాలేజీలో బీకాం(ఆనర్స్), మధ్యప్రదేశ్‌లోని రేవా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేశారు. 1992 ఆగస్టు 8న అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తి ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1న అదే కోర్టులో శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. జడ్జిల నియామకం పారదర్శకంగా జరగాలి: కపిల్ సిబల్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యం కావడం నిజంగా ఆందోళనకరమైన అంశమని సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదని చెప్పారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా న్యాయమూర్తుల నియామకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. జడ్జిలను చాలాచాలా జాగ్రత్తగా నియమించాలని పేర్కొన్నారు. అవినీతి అనేది మొత్తం సమాజానికే కీడు చేస్తుందని హెచ్చరించారు. దేశంలో అవినీతి తగ్గుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి పెరిగిపోతోందని కపిల్ సిబల్ స్పష్టంచేశారు. మరొకరైతే పెద్ద వివాదం అయ్యేది: ధన్‌ఖడ్ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము దొరకడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకోసం చట్టసభలు చొరవ తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కోరారు.ఈ వ్యవహారంపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగడానికి ఒక విధానం రూపొందించే విషయం ఆలోచిస్తానని ధన్‌ఖడ్ చెప్పారు. జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యమైన వెంటనే ఆ విషయం బయటకు రాకపోవడం తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ అధికారి లేదా పారిశ్రామికవేత్త ఇంట్లో డబ్బులు దొరికి ఉంటే వెంటనే పెద్ద వివాదం అయ్యేదని అన్నారు.బదిలీతో చేతులు దులుపుకోవద్దు: కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను కేవలం బదిలీ చేసి, చేతు లు దులుపుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖే రా శుక్రవారం పేర్కొన్నారు. ఆ డబ్బు ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈడీ, సీబీఐల కంటే అగ్నిమాపక శాఖే అద్భుతంగా పనిచేస్తోందని పవన్ ఖేరా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసులో బిగ్ ట్విస్ట్
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ పెద్ద ఎత్తున కలకలం రేగిన గంటల వ్యవధిలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లోలేని సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో అగ్ని మాపక సిబ్బందికి భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయని జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగింది.అయితే యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. తాము అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారంతో జడ్జి వర్మ ఇంటికి వెళ్లినమాట వాస్తవమేనని కానీ అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదంటూ స్పష్టం చేశారు.‘ మా కంట్రోల్ రూమ్ కు మార్చి 14వ తేదీ రాత్రి గం. 11. 30 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేది దాని సారాంశం. దాంతో మా అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో అక్కడికి వెళ్లారు. మేము సరిగ్గా 11.45 నిమిషాలకు అక్కడ వెళ్లారు మా సిబ్బంది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాం. అగ్ని ప్రమాదాన్ని నివారించిన తర్వాత మా టీమ్ అక్కడ నుండి వెళ్లిపోయింది. మా ఆపరేషన్ లో ఎటువంటి నగదు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లభించలేదు’ అని స్పష్టం చేశారు. -
‘ఇదేమీ చెత్త బుట్ట కాదు.. మాకెందుకు ఆ జడ్జి?’
న్యూఢిల్లీ: భారీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ((Justice Yaswant Varma) ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజీయం((Supreme Court Collegium) ) తీసుకున్న నిర్ణయంపై సదరు హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక హైకోర్టులో అవినీతిని చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.‘సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయం చాలా సీరియస్ అంశం. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా.. ప్రస్తుతం యశ్వంత్ వర్మ అంశం చాలా తీవ్రమైనది. ప్రస్తుత పరిస్థితిపై విచారణ జరగాలి. అసలే అలహాబాద్ హైకోర్టుకు జడ్జిలు తక్కువగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి అలహాలబాద్ హైకోర్టులో జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో అవినీతి మరకలు అంటుకున్న యశ్వంత్ సిన్హా మాకెందుకు? అంటూ సీజేఐకి రాసిన లేఖలో పేర్కొంది.రూ. 15 కోట్లు పైమాటే..?అయితే అగ్ని ప్రమాదంతో బయటపడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కరెన్సీ కట్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నోట్ల కట్టలు విలువ ఎంత ఉంటుందని ఇప్పటివరకూ అధికారంగా ప్రకటించకపోయినా, వాటి విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఒకవేళ ఆ నోట్ల కట్టల విలువ భారీ స్థాయిలో ఉంటే జడ్జి యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడినట్లే. ఈ అంశంపై సీజేఐ సంజీవ్ ఖన్నా తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం.మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు అందించారు. ఈ వ్యహహారం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న యశ్వంత్ వర్మ.. బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజాగా నోట్ల కట్టల వ్యవహారం బయటపడటంతో వర్మ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ యశ్వంత్ వర్మ స్పందించకపోవడంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చున్నట్లే అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.బదిలీకి దర్యాప్తునకు సంబంధం లేదుజస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. దర్యాప్తునకు, బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు. ఈ రెండు అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. -
జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు.. సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ఆయనొక న్యాయమూర్తి. హోలీ పండుగ కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై బదిలీ వేటు వేసింది!.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yaswant Varma) ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీం కోర్టు కొలిజీయం(Supreme Court Collegium) ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీం కోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు.జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి.. అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు.యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.తొలగింపు ఎలాగంటే..అవినీతి, అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. తొలుత భార త ప్రధాన న్యాయమూర్తి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే ఫర్వాలేదు. అలాకాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఉంటారు.ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే ఫర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో.. ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంట్‌కు ఉంది.