
న్యూఢిల్లీ: ఆయనొక న్యాయమూర్తి. హోలీ పండుగ కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై బదిలీ వేటు వేసింది!.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yaswant Varma) ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీం కోర్టు కొలిజీయం(Supreme Court Collegium) ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీం కోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు.

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి.. అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు.
యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తొలగింపు ఎలాగంటే..
అవినీతి, అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. తొలుత భార త ప్రధాన న్యాయమూర్తి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే ఫర్వాలేదు. అలాకాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఉంటారు.
ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే ఫర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో.. ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంట్‌కు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment