
అభిప్రాయం
ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది.
సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. అమ్రిక్ సింగ్ అనే వాచ్‌మన్ ఆ పార్సెల్ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్ తెచ్చిన ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు.
పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సంజీవ్ బన్సాల్ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రవీందర్ సింగ్ తనకు పంపి, జస్టిస్ నిర్మల్ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్ నిర్మల్ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్ నిర్మల్‌జిత్ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్ నిర్మల్ యాదవ్ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది.
జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్ బన్సాల్, రాజీవ్ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్ నిర్మల్ యాదవ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది.
అది మాత్రమే కాక, జస్టిస్ నిర్మల్ యాదవ్ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్ ఫోన్ కార్డ్ కూడా సంజీవ్ బన్సాల్ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్ నిర్మల్ యాదవ్ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది.
ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు.
కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్‌కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు.
ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్ టైమ్స్ 2009 జూన్ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు.
అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్ అభిప్రాయాన్నే ప్రకటించారు.
దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్ రిపోర్ట్) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది.
దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట.
అప్పుడు సీబీఐ చార్జిషీట్ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్ నిర్మల్ యాదవ్ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్ యాదవ్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది.
కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్ ఫ్రేమ్ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్ ఫ్రేమ్ అయి విచారణ మొదలయింది.
ఈలోగా జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ జరిగింది. సంజీవ్ బన్సాల్ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్