
అభిప్రాయం
ఒక సీజనల్ పొలిటీషియన్ ఎంత ‘లోతు’ తక్కువ రాజకీయాలు చేయగలిగితే,అంతలా వేగంగా మాటలు మారుస్తూ, ఎన్నాళ్ళు అయినా ఎలాగోలా అధికా రంలో ఉండగలడు. అయితే ఒక లీడర్‌గా వారి స్థాయి ఏమిటి అనేది రేపు చరిత్ర ఎటూ రికార్డు చేస్తుంది. తమదొక ‘పొలిటికల్ ఫిలాసఫీ’ అని ఇటువంటివారు నమ్మబలికితే, ‘అదే మని’ ఎవరూ ప్రశ్నించరు. అదేమిటో చెప్పలేక పోయినా, అదేమిటో ఎవరికీ తెలియకపోయినా, అప్పటికే దాని నుంచి ఫలాలు కోసుకునే వర్గం వారి వెనుక తమ ‘టర్న్’ కోసం కనిపెట్టుకుని ఉండి గుంపుగా తయారై ఆ నాయకునికి సమర్థన కూడా మొదలవుతుంది.
విషయాల లోతులు మనకు అక్కర లేనప్పుడు, ఆ మేరకే మన ఎంపికలు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఆశించడం తప్పు. ఇటువంటి చోట – ‘నువ్వు నన్ను నమ్మనప్పుడు, నిన్ను నేను మాత్రం ఎందుకు నమ్మాలి?’ అనే లాజిక్ నాయకునికి ఎటూ ఉంటుంది. ఇలా పరస్పర విశ్వాసాలు లేకుండానే ఎన్నికయిన నాయకులకు ఈ అధి కారం, తమకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వారు అను కోరు కనుక ఇప్పటికి ఇదే ప్రస్తుతం.
బ్రిటిష్ పాలన తర్వాత కూడా యాభై–అరవై దశకాల్లో భూమి–నీరు–వ్యవసాయం కేంద్రితంగా మన రాష్ట్ర రాజకీయాలు ఉండేవి. కారణం ప్రజలు జీవన సంస్కృతి ఆ రెండింటి చుట్టూనే ఉండేది. అయితే, డెబ్బై దశకంలో వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమ రూపంగా పొడచూపిన 1972 నాటి సాంఘిక సంజ్ఞను సకాలంలో మనం అర్థం చేసుకోలేక పోయాం. అప్పుడే దాన్ని గుర్తించి దాన్ని ‘అడ్రెస్’ చేసి ఉంటే, మన పరిస్థితి మరోలా ఉండేది.
అప్పట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు మొదలైన రైతు కుటుంబాల యువత ఉపాధి వలసల తీవ్రత తగ్గేది. ఆ వలసల ఒత్తిడితో ఆ దశకం చివర 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అవసరం అయింది. రంగా రెడ్డి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ వద్ద ఆంధ్రుల రద్దీతో విషయం అర్థమయినా అప్పటికే ఇక్కడ కొత్తగా మహిళా కళాశాలలు కూడా మొదలయ్యాయి.
ఏమైంది, గుప్పిట్లోని ఇసుకలా కాలం కళ్ళముందు అలా జారిపోయింది. వెనక్కి తిరిగివచ్చి చూసుకుంటే, ఒకప్పటి తయారీ రంగం ఉపాధి అవకాశాల్ని ‘సర్వీస్ సెక్టార్’ ఆక్రమించాక, మూడు దశాబ్దాలుగా ఎక్కడా నిలకడ లేని ఉపాధిరంగం మిగిలింది. ఇప్పుడు ఉన్నది భుజానికి సంచి (షోల్డర్ బ్యాగ్‌ఎంప్లాయ్‌మెంట్) ఉపాధి. ఇక్కడ ఉద్యోగే కాదు,కంపెనీ అధిపతిది కూడా అమూర్త (రూపం తెలి యని) స్థితే. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అది ఎన్నాళ్ళో తెలియని స్థితి.
అయినా ‘లీడర్’ అంటే ప్రజలు–ప్రాంతము పక్షంగా నిలబడి, అక్కడి సామాజిక పర్యావరణానికి తగిన ‘జియో–ప్లానింగ్’తో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి. మన ప్రయోజనాలు కాపాడుకుంటూనే, మనవి కాని బయట పవనాల వేగాన్ని అతడు ఎదుర్కోవాలి. అది లేకపోగా ముప్పై ఏళ్ళుగా ఏదొచ్చినా అదంతా నా వల్లనే అని ‘క్లెయిం’ చేసుకునే పరిస్థితి.
ఇక్కడే అస్సలు ఒక నాయకుడి మూలాలు ప్రశ్న అవుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు (74) కాలం చూస్తే, 1995 నుంచి తొమ్మిదేళ్లు; మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ (78) 1993 నుంచి పదేళ్ళు, శరద్ పవార్ (84) మహరాష్ట్రలో 1988 నుంచి 1995 వరకూ కనిపిస్తారు. వీరిలో చంద్రబాబుది తప్ప మిగతా ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యం. దిగ్విజయ్ సింగ్ తండ్రి 1951లో శాసనసభ్యులు, శరద్ పవార్ తండ్రి 1937–1952 మధ్య మూడుసార్లు జిల్లా బోర్డు సభ్యుడు, ఖాదీ, సహకార చక్కెర రైతు సంఘాల రాష్ట్ర నాయకుడు.
అయితే, ఈ కాలంలో స్వయం ప్రతిభతో ఎదిగిన నాయకుడు లాలూప్రసాద్ యాదవ్. పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా చేస్తూ 1977లో 29 ఏళ్లకే ఎంపీగా పార్లమెంట్‌లోకి వెళ్ళిన అరుదైన చరిత్ర ఆయనది. బిహార్‌పై వీరి బలమైన ప్రభావం 1990–1997 వరకూ ఉంది. ఆయన సతీమణి రబ్రీదేవి ప్రభావం 2000–2005 వరకూ కనిపిస్తుంది.
స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం గురించి సమీక్ష అంటే, దాన్ని మండల్ కమీషన్ నివేదిక అమలు, పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ఈ పూర్వరంగంలో విధిగా చూడాలి. అలా ‘లాలూ– బిహార్’ లోతుల్ని కనుక వెతికితే ఏముంది? ఒక ప్పుడు ఆసియా జ్ఞాన కేంద్రాలకు నెలవైన బిహార్‌లో ‘రీ మ్యాపింగ్ ఇండియా’ మొదలై– జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ అనే మరో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
వీరితో పోల్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి సీఎంగా గత అనుభవం లేదు, అయినా ‘జై ఆంధ్ర’ ఉద్యమ 50 ఏళ్ళ చరిత్ర తర్వాత, జరిగిన రాష్ట్ర విభజన వల్ల ‘పరిపాలన–అభివృద్ధి–సంక్షేమం–ఉపాధి’ రాష్ట్రం అంచులకు చేరేలా ‘జియో–ప్లానింగ్’ చేశారు. మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి, 26 జిల్లాలతో తన వికేంద్రీకరణ పని మొదలు పెట్టారు.
ఆ పాలనలోని మంచి–చెడులు గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అది సహజం కానీ, పార్టీలకు రాజకీయా లకు బయట ఉండి రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలో చించేవారు, ఏపీకి కీలకమైన కాలంలో తాము ఎంత బాధ్యత కలిగిన పౌరసమాజంగా ఉన్నాం? అనే ప్రశ్నకు మాత్రం జవాబు వెతుక్కోవలసి ఉంటుంది.
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత