rakesh kumar singh
-
ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)దే పైచేయిగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సంసిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చోట్లా పటిష్టంగా మోహరించినట్లు తెలిపారు. చైనాతో తూర్పు లద్దాఖ్‌లో ఐదు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న వైమానిక దళం దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నారు. లద్దాఖ్‌లో ఐఏఎఫ్ సామర్థ్యంలో భారత్‌తో పోలిస్తే చైనా వెనుకబడి ఉందనీ, అయినప్పటికీ శత్రువును తక్కువగా అంచనా వేయజాలమన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే ఎలాంటి పరిస్థితులకైనా తక్షణం, వేగంగా స్పందించేలా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఐఏఎఫ్ మోహరింపులు చేపట్టిందని చెప్పారు. అవసరమైతే ఉత్తర(చైనా), పశ్చిమ(పాక్) సరిహద్దుల వెంట ఏకకాలంలో పోరాటం జరిపే సత్తా ఐఏఎఫ్‌కు ఉందన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా నుంచి ముప్పు ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన..‘అవసరమైన అన్ని చోట్లా మోహరించాం. లద్దాఖ్ అందులో చిన్న ప్రాంతం’అని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోకి సులువుగా ప్రవేశించేందుకు వీలున్న అన్ని చోట్లా ఈ మోహరింపులు ఉన్నాయని తెలిపారు. మన ఆర్మీని, ఆయుధ సామగ్రిని శత్రువు కూడా ఊహించలేని ప్రాంతాల్లోకి సైతం వేగంగా తరలించేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల చేరికతో ఉత్తర సరిహద్దుల్లో శత్రువు కంటే మెరుగైన సామర్థ్యంతో ఉన్నామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని రఫేల్‌లను సమకూర్చుకునే విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. చైనా బలాలు చైనాకున్నాయి.. చైనా కూడా కొన్ని అంశాల్లో బలంగా ఉందన్న బదౌరియా.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను ఐఏఎఫ్ సిద్ధం చేసిందన్నారు. ‘చైనాకు సుదూర లక్ష్యాలను ఛేదించే, భూమిపై నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, ఐదో తరం జె–20 యుద్ధ విమాన దళం, అత్యాధునిక సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. సాంకేతిక, వ్యవస్థల ఏర్పాటు కోసం భారీగా వెచ్చిస్తోంది’అని తెలిపారు. -
సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. డ్రోన్లతో ముప్పు సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
మరో ‘బాలాకోట్’కు రెడీ
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులపై భారత వాయు సేన(ఐఏఎఫ్) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, అవసరమైతే బాలాకోట్ తరహాలో మరో వైమానిక దాడికి దిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి ఆపరేషన్లు అయినా చేపడతామని తెలిపారు. అంతకుముందు భారత వాయు సేనలో 26వ ఎయిర్ చీఫ్ మార్షల్‌గా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందిన చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరించారు. -
పీఏసీఎల్ కేసులో సెబీ కమిటీ...
న్యూఢిల్లీ: పీఏసీఎల్ (పెరల్ ఆగ్రో) స్థలాలను విక్రయించి ఇన్వెస్టర్ల సొమ్ము వాపసు చేసే దిశగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెబీ హోల్ టైమ్ సభ్యుడు ఎస్ రామన్, చీఫ్ మేనేజర్ అమిత్ ప్రధాన్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. డిప్యుటీ జీఎం రాకేశ్ కుమార్ సింగ్ నోడల్ ఆఫీసరుగా వ్యవహరిస్తారని, స్థలాల విక్రయం ద్వారా సమీకరించే నిధులకు ఆయన ఇన్చార్జిగా ఉంటారని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. 18 ఏళ్లలో వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట ఉమ్మడి పెట్టుబడి పథకాల ద్వారా పీఏసీఎల్ దాదాపు రూ. 49,100 కోట్లు మోసపూరితంగా సమీకరించిందని సెబీ తేల్చింది. పీఏసీఎల్, దాని ప్రమోటర్లు, డెరైక్టర్ల నుంచి ఈ డబ్బును రాబట్టడానికి చర్యలు చేపట్టింది. అసలు, వడ్డీ కలిపి పీఏసీఎల్, మరో అనుబంధ సంస్థ పీజీఎఫ్‌ఎల్ దాదాపు అయిదు కోట్ల పైగా ఇన్వెస్టర్లకు రూ.60,000 కోట్ల పైగా మొత్తాలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. -
నా ఆశలే ఫలించనీ..
ఏడాది క్రితం.. 2014 మార్చి 15న చెన్నైలో ఓ యువకుడు సైకిల్ తొక్కడం మొదలుపెట్టాడు. 2015 మార్చి 15 ఆదివారం అంటే నిన్న ఆ సైకిల్‌వాలా హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ ఏడాది ప్రయాణంలో ఆ యువకుడి సైకిల్ పాండిచ్చేరిని చుట్టింది.. కేరళలో చక్కర్లు కొట్టింది.. కర్ణాటకలో కదం తొక్కి.. ఆంధ్రా మీదుగా 5,100 కిలోమీటర్లు పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. మగమహారాజు సినిమాలో హీరో.. కుటుంబం కోసం 24 గంటలు సైకిల్ తొక్కితే.. ఈ రియల్ హీరో దేశం కోసం ఏడాదిగా సైకిల్ తొక్కుతున్నాడు. లింగ వివక్షకు వ్యతిరేకంగా పదం పలుకుతూ పెడలింగ్ చేస్తున్నాడు రాకేశ్ కుమార్ సింగ్. ఆదివారం రాహ్‌గిరిలో తన గళం వినిపించడానికి వచ్చిన ఈ బీహార్‌వాసిని సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ..:: వాంకె శ్రీనివాస్ మా సొంతూరు బీహార్‌లోని తరియారని చాప్రా అనే గ్రామం. ఢిల్లీలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీలో పదేళ్లపాటు మీడియా రీసెర్చర్‌గా పనిచేశాను. తర్వాత రెండేళ్లు పలు కంపెనీలకు కార్పొరేషన్ కమ్యూనికేషన్ పీఆర్‌గా పని చేశాను. బామ్ శంకర్ టాన్ గణేశ్ (ఎథోనోగ్రఫీ ఆఫ్ ఏ నార్త్ ఇండియన్ విలేజ్) పుస్తకం రాశా. అయితే సమాజంలో వేళ్లూనుకున్న లింగవివక్ష, అమ్మాయిలపై అకృత్యాలు, గృహహింస ఇవన్నీ నా మదిని తొలుస్తుండేవి. ఓసారి ఢిల్లీలో ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ క్యాంపెయిన్ జరిగింది. పలు నగరాల నుంచి వచ్చిన యాసిడ్ దాడి బాధితులు అందులో పాల్గొన్నారు. వారితో మాట్లాడినప్పుడు నా మనసు చలించింది. తర్వాత ఆయా నగరాలకు వెళ్లి యాసిడ్ దాడి బాధితులను కలిసి మాట్లాడాను. అప్పట్లో హైదరాబాద్ కూడా వచ్చాను. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనురాధను, కూకట్‌పల్లిలో ఉంటున్న ఆరేళ్ల చిన్నారి రీనాను కలిశాను. అప్పుడే మహిళలపై దాడులకు వ్యతిరేకంగా సైకిల్ రైడ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయం ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నా. వారు ప్రోత్సహించడమే కాదు.. రూ.35 వేలు వెచ్చించి ఓ సైకిల్ కూడా కొనిచ్చారు. అలా ‘రైడ్ ఫర్ జెండర్ ఫ్రీడమ్’ మొదలుపెట్టాను. లింగవివక్షే కారణం.. చెన్నై నుంచి ప్రారంభమైన రైడ్.. పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఏపీ మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు 5,100 కిలోమీటర్లు తిరిగాను. రోజూ తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రైడ్ చేస్తున్నా. మొదట్లో ఒకే రోజు 160 కిలోమీటర్లు రైడ్ చేసేవాణ్ని. కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో రోజుకు 50 నుంచి 90 కిలోమీటర్లకు మించి వెళ్లడం లేదు. కొన్ని గ్రామాల్లో ఒకట్రెండు రోజులు ఉంటున్నా. లింగవివక్ష విడనాడినప్పుడే నేరాలకు అడ్డుపడుతుందన్న నినాదాన్ని వినిపిస్తున్నాను. విద్యా సంస్థల్లో వర్క్‌షాప్‌లు, చర్చలు, పప్పెట్ షోలు నిర్వహిస్తున్నాను. పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో ప్రజలకు జెండర్ ఈక్వాలిటీ గురించి చెబుతూ సాగుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజలు నేను చెప్పే విషయాలు ఆసక్తిగా విన్నారు.. తిండి కూడా పెట్టారు. డ బ్బులు అవసరమైతే ఫ్రెండ్స్ అకౌంట్లో వేస్తున్నారు. నాలుగైదు రోజులుంటా.. నా రైడ్ మొదలైన 365వ రోజుకి హైదరాబాద్‌లో ఉండటం ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న రాహ్‌గిరిలో పాల్గొనాల్సిందిగా పలువురు ఐటీ ఉద్యోగులు నన్ను అడిగారు. మరో నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటున్నా. వివిధ స్వచ్ఛందసేవా సంస్థలు, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు వివిధ విద్యా సంస్థల్లో ‘మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, లింగ స్వేచ్ఛ’పై ఉపన్యాసం ఇస్తా. భాగ్యనగరవాసుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నా. బాధ్యత కుటుంబానిదే.. కొడుకు, కూతురు విషయంలో తల్లిదండ్రులు చూపే వివక్షే.. జెండర్ ఇనీక్వాలిటీకి ప్రధాన కారణం. ఈ రుగ్మత నిరక్షరాస్యుల్లోనే కాదు.. అక్షరాస్యులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. నేడు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులకు కుటుంబమే ప్రధాన కారణమంటాను. ప్రతి నేరస్థుడూ ఓ కుటుంబంలో సభ్యుడే కదా. మరి ఓ మనిషి నేరస్థుడుగా మారడానికి కుటుంబం బాధ్యత లేదని ఎలా అంటాం. తల్లిదండ్రులే పిల్లలకు రోల్‌మోడల్స్. ప్రతి విషయంలో వారినే ఆదర్శంగా తీసుకుంటారు. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనే భావన చిన్నప్పుడే పిల్లల్లో కలిగితే.. పెద్దయ్యాక వారు దుర్మార్గంగానే ఆలోచిస్తారు. అందుకే ప్రతి కుటుంబంలో మార్పు రావాలన్నది నా ఆకాంక్ష. అది నెరవేరుతుందనే ఆశిస్తున్నా.