నా ఆశలే ఫలించనీ.. | let my wishes fulfill | Sakshi
Sakshi News home page

నా ఆశలే ఫలించనీ..

Published Sun, Mar 15 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

నా ఆశలే ఫలించనీ..

నా ఆశలే ఫలించనీ..

ఏడాది క్రితం.. 2014 మార్చి 15న చెన్నైలో ఓ యువకుడు సైకిల్ తొక్కడం మొదలుపెట్టాడు. 2015 మార్చి 15 ఆదివారం అంటే నిన్న ఆ సైకిల్‌వాలా హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ ఏడాది ప్రయాణంలో ఆ యువకుడి సైకిల్ పాండిచ్చేరిని చుట్టింది.. కేరళలో చక్కర్లు కొట్టింది.. కర్ణాటకలో కదం తొక్కి.. ఆంధ్రా మీదుగా 5,100 కిలోమీటర్లు పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. మగమహారాజు సినిమాలో హీరో.. కుటుంబం కోసం 24 గంటలు సైకిల్ తొక్కితే.. ఈ రియల్ హీరో దేశం కోసం ఏడాదిగా సైకిల్ తొక్కుతున్నాడు. లింగ వివక్షకు వ్యతిరేకంగా పదం పలుకుతూ పెడలింగ్ చేస్తున్నాడు రాకేశ్ కుమార్ సింగ్. ఆదివారం రాహ్‌గిరిలో తన గళం వినిపించడానికి వచ్చిన ఈ బీహార్‌వాసిని సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
 ..:: వాంకె శ్రీనివాస్
 
మా సొంతూరు బీహార్‌లోని
తరియారని చాప్రా అనే గ్రామం. ఢిల్లీలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్‌మెంట్ సొసైటీలో పదేళ్లపాటు మీడియా రీసెర్చర్‌గా పనిచేశాను. తర్వాత రెండేళ్లు పలు కంపెనీలకు కార్పొరేషన్ కమ్యూనికేషన్ పీఆర్‌గా పని చేశాను. బామ్ శంకర్ టాన్ గణేశ్ (ఎథోనోగ్రఫీ ఆఫ్ ఏ నార్త్ ఇండియన్ విలేజ్) పుస్తకం రాశా. అయితే సమాజంలో వేళ్లూనుకున్న లింగవివక్ష, అమ్మాయిలపై అకృత్యాలు, గృహహింస ఇవన్నీ నా మదిని తొలుస్తుండేవి. ఓసారి ఢిల్లీలో ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ క్యాంపెయిన్ జరిగింది. పలు నగరాల నుంచి వచ్చిన యాసిడ్ దాడి బాధితులు అందులో పాల్గొన్నారు.

వారితో మాట్లాడినప్పుడు నా మనసు చలించింది. తర్వాత ఆయా నగరాలకు వెళ్లి యాసిడ్ దాడి బాధితులను కలిసి మాట్లాడాను. అప్పట్లో హైదరాబాద్ కూడా వచ్చాను. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనురాధను, కూకట్‌పల్లిలో ఉంటున్న ఆరేళ్ల చిన్నారి రీనాను కలిశాను. అప్పుడే మహిళలపై దాడులకు వ్యతిరేకంగా సైకిల్ రైడ్ చేయాలని
 
నిర్ణయించుకున్నా. ఇదే విషయం ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నా. వారు ప్రోత్సహించడమే కాదు.. రూ.35 వేలు వెచ్చించి ఓ సైకిల్ కూడా కొనిచ్చారు. అలా ‘రైడ్ ఫర్ జెండర్ ఫ్రీడమ్’ మొదలుపెట్టాను.
 
లింగవివక్షే కారణం..
చెన్నై నుంచి ప్రారంభమైన రైడ్.. పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఏపీ మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు 5,100 కిలోమీటర్లు తిరిగాను. రోజూ తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రైడ్ చేస్తున్నా. మొదట్లో ఒకే రోజు 160 కిలోమీటర్లు రైడ్ చేసేవాణ్ని. కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో రోజుకు 50 నుంచి 90 కిలోమీటర్లకు మించి వెళ్లడం లేదు. కొన్ని గ్రామాల్లో ఒకట్రెండు రోజులు ఉంటున్నా. లింగవివక్ష విడనాడినప్పుడే నేరాలకు అడ్డుపడుతుందన్న నినాదాన్ని వినిపిస్తున్నాను. విద్యా సంస్థల్లో వర్క్‌షాప్‌లు, చర్చలు, పప్పెట్ షోలు నిర్వహిస్తున్నాను. పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో ప్రజలకు జెండర్ ఈక్వాలిటీ గురించి చెబుతూ సాగుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజలు నేను చెప్పే విషయాలు ఆసక్తిగా విన్నారు.. తిండి కూడా పెట్టారు. డ బ్బులు అవసరమైతే ఫ్రెండ్స్ అకౌంట్లో వేస్తున్నారు.
 
నాలుగైదు రోజులుంటా..
నా రైడ్ మొదలైన 365వ రోజుకి హైదరాబాద్‌లో ఉండటం ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న రాహ్‌గిరిలో పాల్గొనాల్సిందిగా పలువురు ఐటీ ఉద్యోగులు నన్ను అడిగారు. మరో నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటున్నా. వివిధ స్వచ్ఛందసేవా సంస్థలు, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు వివిధ విద్యా సంస్థల్లో ‘మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, లింగ స్వేచ్ఛ’పై ఉపన్యాసం ఇస్తా. భాగ్యనగరవాసుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నా.
 
బాధ్యత కుటుంబానిదే..
కొడుకు, కూతురు విషయంలో తల్లిదండ్రులు చూపే వివక్షే.. జెండర్ ఇనీక్వాలిటీకి ప్రధాన కారణం. ఈ రుగ్మత నిరక్షరాస్యుల్లోనే కాదు.. అక్షరాస్యులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. నేడు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులకు కుటుంబమే ప్రధాన కారణమంటాను. ప్రతి నేరస్థుడూ ఓ కుటుంబంలో సభ్యుడే కదా.

మరి ఓ మనిషి నేరస్థుడుగా మారడానికి కుటుంబం బాధ్యత లేదని ఎలా అంటాం. తల్లిదండ్రులే పిల్లలకు రోల్‌మోడల్స్. ప్రతి విషయంలో వారినే ఆదర్శంగా తీసుకుంటారు. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనే భావన చిన్నప్పుడే పిల్లల్లో కలిగితే.. పెద్దయ్యాక వారు దుర్మార్గంగానే ఆలోచిస్తారు. అందుకే ప్రతి కుటుంబంలో మార్పు రావాలన్నది నా ఆకాంక్ష. అది నెరవేరుతుందనే ఆశిస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement