వరల్డ్ రికార్డ్
విల్కాక్స్ ‘సైకిల్ సెటప్’పై ఒక లుక్కు వేస్తే... ‘ఈ సైకిల్‌పై కొన్ని ఊళ్లు చుట్టి రావచ్చు’ అనిపిస్తుంది. ఇంకాస్త ఉత్సాహ పడితే... ‘జిల్లాలు చుట్టి రావచ్చు’ అనిపించవచ్చు. ‘ఈ సైకిల్‌తో ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు’ అని మాత్రం అనిపించదు. మనం అనుకోవడం, అనుకోక పోవడం మాట ఎలా ఉన్నా ఈ సైకిల్ పైనే విల్కాక్స్ ఎన్నో దేశాలు చుట్టి వచ్చి ప్రపంచ రికార్డును సృష్టించింది.
మే 26న షికాగోలోని గ్రాంట్ ΄ార్క్ నుండి బయలుదేరిన లాయెల్ విల్కాక్స్ నాలుగు ఖండాలు, 21 దేశాల మీదుగా 29,169 కిలోమీటర్‌ల సైకిల్ యాత్రను పూర్తి చేసింది. యాత్ర పూర్తి చేయడానికి పట్టిన కాలం... 108 రోజులు, 12 గంటల 12 నిమిషాలు.
ఎన్నో దేశాలు చుట్టి వచ్చి తిరిగి షికాగోకు వచ్చిన విల్కాక్స్‌కు కుటుంబసభ్యులు, స్నేహితులు, షికాగో సైకిల్ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు.
తన లేటెస్ట్ రికార్డ్‌తో స్కాట్‌లాండ్‌కు చెందిన జెన్నీ గ్రాహం గత రికార్ట్ (124 రోజుల 10 గంటల 50 నిమిషాలు)ను విల్కాక్స్ బ్రేక్ చేసింది.
‘ఇదొక అద్భుత రికార్డ్’ అనడంతో΄ాటు ‘ఇప్పుడు నేను విల్కాక్స్ కు అభిమానిగా మారి΄ోయాను’ అంటుంది జెన్నీ గ్రాహం.
విల్కాక్స్ ‘ప్రపంచ సైకిల్ యాత్ర’ విషయానికి వస్తే...రోజుకు 14 గంటల ΄ాటు రైడ్ చేసేది. ప్రయాణానికి ముందు రకరకాల జాగ్రత్తలు తీసుకుంది. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి.
‘ఈ యాత్రలో ఆహ్లాదమే తప్ప కష్టమని ఎప్పుడూ అనిపించలేదు’ అంటుంది విల్కాక్స్.
‘ఆహ్లాదంగా అనిపించింది’ అనేది ఆమె మనసు మాట అయినప్పటికీ భౌతిక పరిస్థితులు వేరు. ఎన్నోసార్లు ప్రతికూల వాతావరణం వల్ల విల్కాక్స్ ఇబ్బంది పడింది. ప్రయాణం మొదలు పెట్టిన 4వ రోజే వర్షంలో చిక్కుకు΄ోయింది. సైకిల్ టైర్ ఎన్నోసార్లు పంక్చర్ అయింది. కొన్నిసార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ అంతలోనే కోలుకొని సైకిల్ చేతిలోకి తీసుకునేది. తాను ఏ రోజు ఎక్కడ ప్రయాణిస్తున్నాను అనేది సోషల్ మీడియా ద్వారా ప్రకటించేది. దీనివల్ల వందలాది మంది ఆమెను అనుసరిస్తూ
ఉత్సాహపరిచేవారు. ఇది తనని ఒంటరితనం నుంచి దూరం చేసేది.
‘అద్భుతమైన శారీరక, మానసిక దృఢత్వం ఆమె సొంతం’ అంటూ సైక్లింగ్ వీక్లి మ్యాగజైన్ ఎడిటర్ మారిజ్ రూక్ విల్కాక్స్‌ను ప్రశంసించారు.
ఒక లక్ష్యం నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడే మరో కల కనడం విల్కాక్స్ అలవాటు. మరి నెక్ట్స్ ఏమిటి? అనే విషయానికి వస్తే... ఆమె ట్రాక్ రికార్డ్‌ను బట్టి చూస్తే అది పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు.
ఎవరీ వేదంగి కులకర్ణి?
విల్కాక్స్ తాజా రికార్డ్ సందర్భంగా బాగా వినిపిస్తున్న పేరు వేదంగి కులకర్ణి. మన దేశానికి చెందిన ఆల్ట్రా సైకిలిస్ట్ వేదంగి కులకర్ణి ఇరవై ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. పుణెకు చెందిన కులకర్ణీ యూకేలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ చదువుకుంది. దాదాపు ఆరేళ్ల తరువాత కులకర్ణీ మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి కారణం...ఆమె ప్రపంచ సైకిల్ యాత్ర. కులకర్ణీ కూడా తన రైడ్‌ను 108 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె గత రికార్డ్ చూస్తే అదేమీ అసాధ్యం కాదు అనిపిస్తుంది. అందుకే విల్కాక్స్ తాజా రికార్డ్‌కు వేదంగి కులకర్ణీ నుంచి గట్టి ΄ోటీ ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment