న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)దే పైచేయిగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సంసిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చోట్లా పటిష్టంగా మోహరించినట్లు తెలిపారు. చైనాతో తూర్పు లద్దాఖ్‌లో ఐదు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న వైమానిక దళం దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నారు. లద్దాఖ్‌లో ఐఏఎఫ్ సామర్థ్యంలో భారత్‌తో పోలిస్తే చైనా వెనుకబడి ఉందనీ, అయినప్పటికీ శత్రువును తక్కువగా అంచనా వేయజాలమన్నారు.
క్షేత్రస్థాయిలో తలెత్తే ఎలాంటి పరిస్థితులకైనా తక్షణం, వేగంగా స్పందించేలా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట ఐఏఎఫ్ మోహరింపులు చేపట్టిందని చెప్పారు. అవసరమైతే ఉత్తర(చైనా), పశ్చిమ(పాక్) సరిహద్దుల వెంట ఏకకాలంలో పోరాటం జరిపే సత్తా ఐఏఎఫ్‌కు ఉందన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా నుంచి ముప్పు ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన..‘అవసరమైన అన్ని చోట్లా మోహరించాం. లద్దాఖ్ అందులో చిన్న ప్రాంతం’అని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోకి సులువుగా ప్రవేశించేందుకు వీలున్న అన్ని చోట్లా ఈ మోహరింపులు ఉన్నాయని తెలిపారు. మన ఆర్మీని, ఆయుధ సామగ్రిని శత్రువు కూడా ఊహించలేని ప్రాంతాల్లోకి సైతం వేగంగా తరలించేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల చేరికతో ఉత్తర సరిహద్దుల్లో శత్రువు కంటే మెరుగైన సామర్థ్యంతో ఉన్నామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని రఫేల్‌లను సమకూర్చుకునే విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు.
చైనా బలాలు చైనాకున్నాయి..
చైనా కూడా కొన్ని అంశాల్లో బలంగా ఉందన్న బదౌరియా.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను ఐఏఎఫ్ సిద్ధం చేసిందన్నారు. ‘చైనాకు సుదూర లక్ష్యాలను ఛేదించే, భూమిపై నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, ఐదో తరం జె–20 యుద్ధ విమాన దళం, అత్యాధునిక సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. సాంకేతిక, వ్యవస్థల ఏర్పాటు కోసం భారీగా వెచ్చిస్తోంది’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment