china-pakistan
-
చైనా, పాక్ సరిహద్దుల్లో హెరాన్ మార్క్–2 డ్రోన్లు మోహరింపు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయడానికి భారత వాయుసేన పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన అత్యంత శక్తిమంతమైన హెరాన్ మార్క్–2 సాయుధ డ్రోన్లు నాలుగింటిని ఉత్తర సెక్టార్ సరిహద్దు స్థావరాల్లో మోహరించింది. హెరన్ మార్క్–2 డ్రోన్లు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థం్య కలిగిన క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని మోసుకుపోగలవని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ల మోహరింపుతో సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ‘హెరాన్ మార్క్ 2 డ్రోన్లు అత్యంత శక్తిమంతమైనవి. గంటల తరబడి గాల్లో ఎగిరే సామర్థ్యం, సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో పసిగట్టే టెక్నాలజీ ఉండడం వల్ల పాక్, చైనా సరిహద్దుల్లో నిఘా మరింత పటిష్టం కానుంది’ అని డ్రోన్ స్క్వాడ్రన్ వింగ్ కమాండర్ పంకజ్ రాణా చెప్పారు. ప్రత్యేకతలు ఇవీ ► ప్రతికూల వాతావరణ పరిస్థితులు న్నప్పటికీ హెరెన్ మార్క్–2 డ్రోన్లు ఏకబిగిన 36 గంటలు ప్రయాణం చేయగలవు. అంటే ఈ డ్రోన్లు ఒకేసారి పాకిస్తాన్, చైనాలను కూడా చుట్టేసి రాగలవు. ► డ్రోన్లలో ఉండే లేజర్ సుదూర ప్రాంతంలో ఉండే శత్రు దేశాల లక్ష్యాలను గుర్తించగలవు. దీంతో మన క్షిపణులు వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ► ఎంత దూరంలోనున్న లక్ష్యాలనైనా గుర్తించడం, సుదీర్ఘంగా గాల్లో ఎగిరే సామర్థ్యం ఉండడం వల్ల ఇవి ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగలవు. ► ఈ డ్రోన్లు ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉండడం వల్ల ఎక్కడ నుంచైనా వీటిని ఆపరేట్ చేసే సదుపాయం ఉంది. -
ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)దే పైచేయిగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సంసిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చోట్లా పటిష్టంగా మోహరించినట్లు తెలిపారు. చైనాతో తూర్పు లద్దాఖ్‌లో ఐదు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న వైమానిక దళం దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నారు. లద్దాఖ్‌లో ఐఏఎఫ్ సామర్థ్యంలో భారత్‌తో పోలిస్తే చైనా వెనుకబడి ఉందనీ, అయినప్పటికీ శత్రువును తక్కువగా అంచనా వేయజాలమన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే ఎలాంటి పరిస్థితులకైనా తక్షణం, వేగంగా స్పందించేలా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఐఏఎఫ్ మోహరింపులు చేపట్టిందని చెప్పారు. అవసరమైతే ఉత్తర(చైనా), పశ్చిమ(పాక్) సరిహద్దుల వెంట ఏకకాలంలో పోరాటం జరిపే సత్తా ఐఏఎఫ్‌కు ఉందన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా నుంచి ముప్పు ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన..‘అవసరమైన అన్ని చోట్లా మోహరించాం. లద్దాఖ్ అందులో చిన్న ప్రాంతం’అని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోకి సులువుగా ప్రవేశించేందుకు వీలున్న అన్ని చోట్లా ఈ మోహరింపులు ఉన్నాయని తెలిపారు. మన ఆర్మీని, ఆయుధ సామగ్రిని శత్రువు కూడా ఊహించలేని ప్రాంతాల్లోకి సైతం వేగంగా తరలించేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల చేరికతో ఉత్తర సరిహద్దుల్లో శత్రువు కంటే మెరుగైన సామర్థ్యంతో ఉన్నామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని రఫేల్‌లను సమకూర్చుకునే విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. చైనా బలాలు చైనాకున్నాయి.. చైనా కూడా కొన్ని అంశాల్లో బలంగా ఉందన్న బదౌరియా.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను ఐఏఎఫ్ సిద్ధం చేసిందన్నారు. ‘చైనాకు సుదూర లక్ష్యాలను ఛేదించే, భూమిపై నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, ఐదో తరం జె–20 యుద్ధ విమాన దళం, అత్యాధునిక సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. సాంకేతిక, వ్యవస్థల ఏర్పాటు కోసం భారీగా వెచ్చిస్తోంది’అని తెలిపారు. -
పాక్–చైనా బస్సు సర్వీస్.. వయా పీవోకే!
బీజింగ్: ఈ నెల 3వ తేదీ నుంచి చైనా, పాక్‌ల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సు కాస్గర్– పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం లాహోర్ మధ్య ఈ బస్సు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా ఈ బస్సును నడపాలన్న నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవోకే కూడా తమదే అని పేర్కొంటున్న భారత్.. ఆ భూభాగం గుండా బస్సు సర్వీసు నడపడం తమ ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగకరమని తెలిపింది. సీపెక్ ప్రాజెక్టు చైనా–పాక్ దేశాల ఆర్థిక సహకారానికి సంబంధించింది మాత్రమేననీ, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టు కాదని చైనా తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటి చైనా పర్యటన ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా బస్సు సర్వీసు నిర్ణయం వెలువడటం గమనార్హం. -
నవాజ్ షరీఫ్‌కు ఝలక్ ఇచ్చిన జిన్‌పింగ్!
భారత ప్రధాని మోదీతో భేటీ.. పాక్ ప్రధానికి చుక్కెదురు కజికిస్థాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సమితి సదస్సు సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్.. దాయాది పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు మాత్రం షాక్ ఇచ్చారు. ఈ సదస్సులో జిన్‌పింగ్-షరీఫ్ భేటీ అయి చర్చలు జరుపుతారని భావించారు. అందుకు భిన్నంగా ఈ ఇద్దరు నేతలు భేటీ కాలేదు. భారత ప్రధాని మోదీతోపాటు తజికిస్థాన్, తుర్కమెనిస్తాన్, స్పెయిన్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన జిన్‌పింగ్ షరీఫ్‌తో కలువడానికి నిరాకరించారు. భారత్‌తో సరిహద్దు విభేదాలు ఉన్న చైనా.. పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా సన్నిహిత మిత్రదేశంగా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. చాలా విషయాల్లో పాక్‌ను గుడ్డిగా వెనకేసుకొస్తున్న డ్రాగన్.. అనూహ్యంగా అంతర్జాతీయ వేదికపై భారత్‌తో దౌత్యచర్చలు జరిపిన సమయంలోనే పాక్‌ను దూరం పెట్టడం గమనార్హం. కల్లోలిత బలూచిస్థాన్‌లో ఇద్దరు చైనా జాతీయులను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటనను చైనా తీవ్రంగా పరిగణించింది. చైనా పౌరుల హత్యకు ఐఎస్ఐఎస్సే కారణమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆగ్రహంతోనే జిన్‌పింగ్, షరీఫ్‌తో భేటీకాకుండా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
‘చైనా, పాక్ మమ్మల్ని బానిసల్ని చేద్దామనా..’
గిల్గిత్: పాకిస్థాన్, చైనాకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. వన్ బెల్ట్ వన్ రోడ్డు(ఓబీఓఆర్) అంశంపై బీజింగ్‌లో సోమవారం సీరియస్‌గా సమావేశాలు మొదలుకాగా దానిని వ్యతిరేకిస్తూ పాక్‌లోని గిల్గిత్-బాల్తిస్థాన్కు చెందిన యువత, ఇతర పౌరులు ఆందోళన బాటపట్టారు. ఓబీఓఆర్‌ను తమ ప్రాంతంలో ఏ మాత్రం అనుమతించబోమంటూ పెద్ద పెట్టున నినాదాలు తీస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా ఇదే స్థాయిలో నిరసలను బయలుదేరాయి. చైనా తొన తొలి భారీ విదేశాంగ విధానంగా పేర్కొంటూ ఆసియా ప్రాంతంలో తన వాణిజ్య విస్తరణలో భాగంగా ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టు పేరిట భారీ నిర్మాణానానికి తెర లేపింది. రైల్వే, రోడ్డు, వైమానిక రవాణా మార్గాలను అనుసంధానం చేసేలా అతి పెద్ద రోడ్డు నిర్మాణం చేయనుంది. దీనికి సంబంధించి నిర్వహిస్తున్న వన్ బెల్ట్ వన్ రోడ్డు సమావేశానికి మొత్తం 23 దేశాలను ఆహ్వానించగా భారత్ గైర్హాజరైంది. పాక్, అమెరికా, జపాన్, రష్యావంటి దేశాలు హాజరయ్యాయి. అయితే, ఈ కారిడార్‌ను పాక్ అక్రమిత కశ్మీర్ గుండా నిర్మించాలని చైనా చూస్తోంది. దీంతోపాటు గిల్గిత్-బాల్తిస్థాన్‌లో చైనాకు చెందిన సైనిక శిబిరాలు ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ అజమాయిషీని భరించడం కష్టంగా భావిస్తున్న ఈ ప్రాంతాల వాసులు తాజాగా జరిగే ఒప్పందంతో చైనా అధికారాన్ని కూడా భరించాల్సి వస్తుందనే ఆగ్రహంతో తాజా సమావేశాన్ని నిరసిస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన లేవనెత్తారు. ప్లకార్డులు, బ్యానర్లుపట్టుకొని చైనా సామ్రాజ్యవాద ఆలోచనను ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమను మరింత బానిసలుగా మార్చే ప్రయత్నం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ సహాయంతో తమ ప్రాంతాల్లోకి చైనా ప్రవేశించాలని చూస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చైనాతో మైత్రి.. అమెరికా గండం
అమెరికాకు మన పాలకులపై ‘గుర్రు’ పుట్టినప్పుడల్లా చైనా-పాకిస్థాన్‌ల మైత్రిని చూపి భారత్‌ను రెచ్చగొడుతూ వచ్చింది. భారత్, చైనాకు దగ్గరవుతోందనుకున్నప్పుడల్లా పాకిస్థాన్‌ను ‘గిల్లు’తూ వచ్చింది. అలాగే చైనా-నేపాల్ సంబంధాలు మెరుగుపడినప్పుడల్లా భారత పాలకుల్ని ‘గీకి’ నేపాల్‌పైకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ‘నీకెక్కడ అనుమానమో నాకూ అక్కడే సందేహం’ అని మనవాళ్లు అంటూంటారు! సరిహద్దు సమస్య గత ఐదు దశాబ్దాలుగా భారత్-చైనాల మైత్రీ సంబంధాల పునరుద్ధరణకు పెద్ద ఆటంకంగా కొనసాగుతూ వస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. సమస్య పరిష్కారం జరగబోతున్నట్టూ, ఒప్పందం కుదరబోతున్నట్టూ ఎండమావుల్లాంటి భ్రమలే తప్ప ఆచరణలో పరిష్కారం దగ్గర కావడమే లేదు. చైనా ప్రజా రిపబ్లిక్ అధ్యక్షుడు జీ-జిన్‌పింగ్ ఇటీవల జరిపిన భారత పర్యటన సందర్భంగా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పెట్టుబడులతో గుజరాత్ వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోవటంపై చూపిన శ్రద్ధను, రెండు దేశాల మధ్య ‘పెద్దముల్లు’గా తయారైన సరిహద్దు సమస్య పరిష్కారంపై చూపలేదు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోడానికి ప్రకటనల రూపంలో ఇరువురు ఉత్సాహం కనబరిచారే తప్ప సాధించింది శూన్యం. దశాబ్దాలుగా నానుతున్న ఈ సమస్యపై ఇంత కాలంగా 50కి మించి జరిగిన అధికారుల స్థాయి సమావేశాల ఫలితమేమిటో ప్రజలకు తెలియదు. వివాద పరిష్కారానికి దూరంగా మొక్కుబడిగా ఇదే తంతు కాం గ్రెస్, యూపీఏల పాలనలోనూ, ఆ దరిమిలా వాజ్‌పేయి నాయ కత్వంలోని బీజేపీ-ఎన్డీఏ పరివార్ పాలనలోనూ కొనసాగుతూనే వచ్చింది! కాని అంతిమ పరిష్కారానికి పాలకులు ఎందుకు కూర్చో వటం లేదనేది కీలకమైన ప్రశ్న! అమెరికా పర్యటనలో రెండు ఎత్తుగడలు ప్రధాన మంత్రి హోదాలో మోదీ అమెరికా పర్యటన కొలది రోజుల్లో ఉందనగా అమెరికా ప్రభుత్వం కనుసన్నల్లో మెలిగే సీఎన్ఎన్ చానల్ మోడీని ఇంటర్వ్యూ చేసింది. ‘‘చైనాలో నియంతృత్వ పాలన ఉందికదా, దీనిని మీరు స్వాగతిస్తారా’’ అనీ, ‘‘చైనా ప్రవర్తన కారణంగా ఇరుగుపొరుగు దేశాలు ఆందోళన చెందుతున్నాయి కదా’’ అని తీగలు తీస్తూ ఆయనను రెచ్చగొడుతూ సీఎన్ఎన్ ప్రతినిధి రెండు లీడింగ్ ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలను పరిశీలిస్తే అమెరికా భారత వైఖరిని ఎటు తిప్పాలని భావిస్తోందో అంచనా వేయగలం. అమెరికా పర్యటనకు వెళ్లబోతున్న మోదీ రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్లో మైనారిటీలపై సాగిన ఊచకోత ఫలితంగా 12 ఏళ్లుగా అమెరికా ఆయనకు ‘వీసా’ను నిరాకరిస్తూ విధించిన ఆంక్షలు. ఆయన భారత ప్రధాని అయిన తరువాత మాత్రమే అమెరికా ఆ ఆంక్షలను రద్దు చేసింది. ప్రధానిగా అంది వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని రెండు చేతులా ఎడాపెడా ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడానికి మోదీకి అమెరికా కావాలి! అమెరికా భావిస్తున్నట్టే ప్రపంచ ప్రధాన శత్రువు అల్‌కాయిదా ఉగ్రవాదం కాబట్టి భారత ముస్లింలు భారతదేశం కోసం పోరాడతారు, అవసరమైతే అందుకోసం మరణిస్తారని మోడీ ప్రకటించారు. తద్వారా గురజాత్‌లో అంటుకున్న చెరపలేని మచ్చను తుడుచుకోవాలనేది ఆయన పన్నిన వ్యూహం. ఇక మరో పన్నుగడ - చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకొనకుండానే ఆ దేశంతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్న వాంఛను ప్రకటించడం. తద్వారా, భారత్, చైనా వైపు మొగ్గుతుందేమోనన్న భ్రమలోకి అమెరికాను నెట్టడం! అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రభుత్వాలు ఈ వైఖరిని అనుసరించటం వల్లనే ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోతూ వచ్చాయి! అమెరికాకు మన పాలకులపై ‘గుర్రు’ పుట్టినప్పుడల్లా చైనా-పాకిస్థాన్‌ల మైత్రిని చూపి భారత్‌ను రెచ్చగొడుతూ వచ్చింది. భారత్, చైనాకు దగ్గరవుతోందనుకున్నప్పుడల్లా పాకిస్థాన్‌ను ‘గిల్లు’తూ వచ్చింది. అలాగే చైనా-నేపాల్ సంబంధాలు మెరుగుపడినప్పుడల్లా భారత పాలకుల్ని ’గీకి‘ నేపాల్‌పైకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది. కలసి అడుగు వేయడంలో వెనుకబాటే ఒకప్పుడు ప్రధానిగా వాజ్‌పేయి, ఆయన మంత్రివర్గ సహచరునిగా ఫెర్నాండెజ్ కూడా తమ ప్రభుత్వం చైనాతో సంబంధాలు పెంచుకుంటోందని భావించ రాదనీ, తాము చైనాకు వ్యతిరేకమేననీ అమెరికా పాలకుడికి రహస్యంగా ఉత్తరాలు రాసిన విషయం రాజకీయ పరిశీలకులకందరికీ తెలిసిందే! అందుకే సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో మోడీ ఒక వైపున ‘‘ఈ శకం భారత్-చైనాలదేనని’’ అంటూనే, మరోవైపున ‘నియంతల పాలనలో ఉన్న చైనాకన్నా ప్రజాస్వామ్య దేశాలే అభివృద్ధి సాధిస్తాయ’ని, చైనా కూడా ఇతర దేశాలతో కలసి అడుగులు వేయక తప్పదని అన్నారు. కానీ ‘ఇరుగుపొరుగు దేశాలతో కలసి అడుగులు’ వేయడంలో మన పాలకులు చైనా కంటే వెనకబడిపోయారని చెప్పి తీరాలి! ఎందుకంటే, అది దానికీ, మనకూ కూడా పొరుగు దేశాలైన మయన్మార్ (బర్మా), శ్రీలంక, పాకిస్థాన్, సోవియట్ యూనియన్లతో సరిహద్దు వివాదాలను ఏనాడో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంది. భారత్-చైనా సరిహద్దు వివాదం మాత్రమే పరిష్కారం కాలేదు. వివాదం వలసవాద అవశేషం భారత్-చైనాల మధ్య సరిహద్దులు వలస పాలకులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా గీసిన కత్రిమ సరిహద్దులు, అనధికారికమైన గీతలేనన్న గుర్తింపు భారత్-చైనాల పాలకుల స్పృహలో ఉండాలి. ఆ గుర్తింపు ఉంటేనే పరిష్కారం సులువు. బ్రిటిష్ వాళ్లు ఇటు వైపు నుంచి, రష్యా అటు వైపు నుంచి 18-19 శతాబ్దాల్లో తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా టిబెట్‌ను ఆక్రమించుకునే దశలో భారత్-చైనాల మధ్య ‘మెక్ మోహన్’ రేఖ వెలసింది. అదీ ఉజ్జాయింపుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గీయించిన ఊహా సరిహద్దు రేఖలే గాని వాస్తవాధీన రేఖలు కావు. ఈ సత్యాన్ని తొలి భారత పంచవర్ష ప్రణాళికకు అనుబంధంగా వెలువడిన దేశ పటంలో సహితం అక్షర సత్యంగా పేర్కొన్నారు! స్వతంత్ర చైనా పాలకులు కూడా అదే విషయాన్ని పేర్కొంటూ అనిర్వచనీయ స్థితిలో ఉన్న సుదీర్ఘ సరిహద్దులకు భూమ్మీద స్పష్టమైన రూపం ఇద్దామని అప్పట్లోనే చెప్పారు. మధ్యలో టిబెట్ నుంచి పారిపోయి మన దేశానికి చేరిన దలైలామాను మన పాలకులు సాదరంగా ఆహ్వానించి కొత్త ‘కుంపటిని‘ నెత్తి మీద పెట్టుకున్నారు. దీంతో సరిహద్దు సమస్య మరింత జటిలమైపోయింది. శ్రీలంక ప్రధాని బండారు నాయకే, ఇండోనేసియా, ఈజిప్టు అధినేతలు సుకర్నో, నాజర్‌లు సహా బాండుంగ్ అలీన దేశాల శిఖరాగ్ర సభకు వచ్చిన నేతలంతా భారత్-చైనా సరిహద్దు సమస్యను ‘వలస పాలనావశేషంగా’ భావించి చర్చల ద్వారా పరిష్కరించు కోవలసిందిగా హితవు చెప్పారు. ఇచ్చి పుచ్చుకుంటేనే పూర్వ వైభవం చివరికి గాంధీజీ ప్రధాన శిష్యులలో ఒకరైన పండిట్ సుందర్‌లాల్ సహితం చైనా నాయకులతో ముఖాముఖి సంభాషణలు జరిపారు. ఇటు ‘నేఫా’ రంగంలోగానీ, అటు లడఖ్‌ను ఆనుకుని ఉన్న వ్యూహాత్మక సరిహద్దులలో గాని పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే రెండు ప్రాంతాలలోనూ సరిహద్దులు నిర్ణయమవుతాయని చెప్పారు. ‘నేఫా’ (ఈశాన్య సరిహద్దు) రంగంలో 80 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా వదులుకోడానికి సిద్ధంగా ఉందని కూడా సుందర్‌లాల్ ప్రకటించారు! అమెరికా ఒత్తిళ్లకు, సత్తరకాయగా శకుని పాత్రలో ఉన్న దలైలామా ఒత్తిళ్లకూ లోనవడం వల్లనే ఉభయదేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు పెరిగాయి. ఈ పరిస్థితి శాశ్వతంగా చక్కబడాలంటే - ఎలాంటి ఆలస్యం లేకుండా బేషరతుగా అగ్రస్థాయిలో ముఖాముఖి చర్చలు సాగితే ఉభయత్రా సాంస్కృతిక, వర్తక వాణిజ్య సంబంధాలు మూడు పూవులూ ఆరు కాయలుగా పూర్వ వైభవంతో వర్ధిల్లగలవు! మూడో శక్తికి మన సంబంధాలలో జోక్యానికి అవకాశం ఇవ్వరాదు. విశ్వాసం తప్పిన పీనుగు మోసిన వాడినే పట్టిందట! భారత్-చైనాల మైత్రి ఆసియాకే కాదు, ప్రపంచానికే రక్షరేక! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఏబీకే ప్రసాద్