నవాజ్ షరీఫ్‌కు ఝలక్ ఇచ్చిన జిన్‌పింగ్!
నవాజ్ షరీఫ్‌కు ఝలక్ ఇచ్చిన జిన్‌పింగ్!
Published Sat, Jun 10 2017 4:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
భారత ప్రధాని మోదీతో భేటీ.. పాక్ ప్రధానికి చుక్కెదురు
కజికిస్థాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సమితి సదస్సు సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్.. దాయాది పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు మాత్రం షాక్ ఇచ్చారు. ఈ సదస్సులో జిన్‌పింగ్-షరీఫ్ భేటీ అయి చర్చలు జరుపుతారని భావించారు. అందుకు భిన్నంగా ఈ ఇద్దరు నేతలు భేటీ కాలేదు. భారత ప్రధాని మోదీతోపాటు తజికిస్థాన్, తుర్కమెనిస్తాన్, స్పెయిన్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన జిన్‌పింగ్ షరీఫ్‌తో కలువడానికి నిరాకరించారు.
భారత్‌తో సరిహద్దు విభేదాలు ఉన్న చైనా.. పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా సన్నిహిత మిత్రదేశంగా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. చాలా విషయాల్లో పాక్‌ను గుడ్డిగా వెనకేసుకొస్తున్న డ్రాగన్.. అనూహ్యంగా అంతర్జాతీయ వేదికపై భారత్‌తో దౌత్యచర్చలు జరిపిన సమయంలోనే పాక్‌ను దూరం పెట్టడం గమనార్హం. కల్లోలిత బలూచిస్థాన్‌లో ఇద్దరు చైనా జాతీయులను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటనను చైనా తీవ్రంగా పరిగణించింది. చైనా పౌరుల హత్యకు ఐఎస్‌ఐఎస్సే కారణమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆగ్రహంతోనే జిన్‌పింగ్, షరీఫ్‌తో భేటీకాకుండా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement