న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయడానికి భారత వాయుసేన పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన అత్యంత శక్తిమంతమైన హెరాన్ మార్క్–2 సాయుధ డ్రోన్లు నాలుగింటిని ఉత్తర సెక్టార్ సరిహద్దు స్థావరాల్లో మోహరించింది. హెరన్ మార్క్–2 డ్రోన్లు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థం్య కలిగిన క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని మోసుకుపోగలవని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ డ్రోన్ల మోహరింపుతో సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ‘హెరాన్ మార్క్ 2 డ్రోన్లు అత్యంత శక్తిమంతమైనవి. గంటల తరబడి గాల్లో ఎగిరే సామర్థ్యం, సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో పసిగట్టే టెక్నాలజీ ఉండడం వల్ల పాక్, చైనా సరిహద్దుల్లో నిఘా మరింత పటిష్టం కానుంది’ అని డ్రోన్ స్క్వాడ్రన్ వింగ్ కమాండర్ పంకజ్ రాణా చెప్పారు.
ప్రత్యేకతలు ఇవీ
► ప్రతికూల వాతావరణ పరిస్థితులు న్నప్పటికీ హెరెన్ మార్క్–2 డ్రోన్లు ఏకబిగిన 36 గంటలు ప్రయాణం చేయగలవు. అంటే ఈ డ్రోన్లు ఒకేసారి పాకిస్తాన్, చైనాలను కూడా చుట్టేసి రాగలవు.
► డ్రోన్లలో ఉండే లేజర్ సుదూర ప్రాంతంలో ఉండే శత్రు దేశాల లక్ష్యాలను గుర్తించగలవు. దీంతో మన క్షిపణులు వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది.
► ఎంత దూరంలోనున్న లక్ష్యాలనైనా గుర్తించడం, సుదీర్ఘంగా గాల్లో ఎగిరే సామర్థ్యం ఉండడం వల్ల ఇవి ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగలవు.
► ఈ డ్రోన్లు ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉండడం వల్ల ఎక్కడ నుంచైనా వీటిని ఆపరేట్ చేసే సదుపాయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment