చైనాతో మైత్రి.. అమెరికా గండం | The danger of reconciliation with China | Sakshi
Sakshi News home page

చైనాతో మైత్రి.. అమెరికా గండం

Published Mon, Sep 22 2014 11:46 PM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

చైనాతో మైత్రి.. అమెరికా గండం - Sakshi

చైనాతో మైత్రి.. అమెరికా గండం

అమెరికాకు మన పాలకులపై ‘గుర్రు’ పుట్టినప్పుడల్లా చైనా-పాకిస్థాన్‌ల మైత్రిని చూపి భారత్‌ను రెచ్చగొడుతూ వచ్చింది. భారత్, చైనాకు దగ్గరవుతోందనుకున్నప్పుడల్లా పాకిస్థాన్‌ను ‘గిల్లు’తూ వచ్చింది. అలాగే చైనా-నేపాల్ సంబంధాలు మెరుగుపడినప్పుడల్లా భారత పాలకుల్ని ‘గీకి’ నేపాల్‌పైకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది.  
 
 ‘నీకెక్కడ అనుమానమో నాకూ అక్కడే సందేహం’ అని మనవాళ్లు అంటూంటారు! సరిహద్దు సమస్య గత ఐదు దశాబ్దాలుగా భారత్-చైనాల మైత్రీ సంబంధాల పునరుద్ధరణకు పెద్ద ఆటంకంగా కొనసాగుతూ వస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. సమస్య పరిష్కారం జరగబోతున్నట్టూ, ఒప్పందం కుదరబోతున్నట్టూ ఎండమావుల్లాంటి భ్రమలే తప్ప ఆచరణలో పరిష్కారం దగ్గర కావడమే లేదు. చైనా ప్రజా రిపబ్లిక్ అధ్యక్షుడు జీ-జిన్‌పింగ్ ఇటీవల జరిపిన భారత పర్యటన సందర్భంగా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పెట్టుబడులతో గుజరాత్ వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోవటంపై చూపిన శ్రద్ధను, రెండు దేశాల మధ్య ‘పెద్దముల్లు’గా తయారైన సరిహద్దు సమస్య పరిష్కారంపై చూపలేదు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోడానికి ప్రకటనల రూపంలో ఇరువురు ఉత్సాహం కనబరిచారే తప్ప సాధించింది శూన్యం. దశాబ్దాలుగా నానుతున్న ఈ సమస్యపై ఇంత కాలంగా 50కి మించి జరిగిన అధికారుల స్థాయి సమావేశాల ఫలితమేమిటో ప్రజలకు తెలియదు.  వివాద పరిష్కారానికి దూరంగా మొక్కుబడిగా  ఇదే తంతు కాం గ్రెస్, యూపీఏల పాలనలోనూ, ఆ దరిమిలా వాజ్‌పేయి నాయ కత్వంలోని బీజేపీ-ఎన్డీఏ పరివార్ పాలనలోనూ కొనసాగుతూనే వచ్చింది! కాని అంతిమ పరిష్కారానికి పాలకులు ఎందుకు కూర్చో వటం లేదనేది కీలకమైన ప్రశ్న!

అమెరికా పర్యటనలో రెండు ఎత్తుగడలు

ప్రధాన మంత్రి హోదాలో  మోదీ అమెరికా పర్యటన కొలది రోజుల్లో ఉందనగా అమెరికా ప్రభుత్వం కనుసన్నల్లో మెలిగే సీఎన్‌ఎన్ చానల్ మోడీని ఇంటర్వ్యూ చేసింది. ‘‘చైనాలో నియంతృత్వ పాలన ఉందికదా, దీనిని మీరు స్వాగతిస్తారా’’ అనీ, ‘‘చైనా ప్రవర్తన కారణంగా ఇరుగుపొరుగు దేశాలు ఆందోళన చెందుతున్నాయి కదా’’ అని తీగలు తీస్తూ ఆయనను రెచ్చగొడుతూ సీఎన్‌ఎన్ ప్రతినిధి రెండు లీడింగ్ ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలను పరిశీలిస్తే అమెరికా భారత వైఖరిని ఎటు తిప్పాలని భావిస్తోందో అంచనా వేయగలం. అమెరికా పర్యటనకు వెళ్లబోతున్న మోదీ రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లో మైనారిటీలపై సాగిన ఊచకోత ఫలితంగా 12 ఏళ్లుగా అమెరికా ఆయనకు ‘వీసా’ను నిరాకరిస్తూ విధించిన ఆంక్షలు. ఆయన భారత ప్రధాని అయిన తరువాత మాత్రమే అమెరికా ఆ ఆంక్షలను రద్దు చేసింది. ప్రధానిగా అంది వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని రెండు చేతులా ఎడాపెడా ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడానికి మోదీకి అమెరికా కావాలి! అమెరికా భావిస్తున్నట్టే ప్రపంచ ప్రధాన శత్రువు అల్‌కాయిదా ఉగ్రవాదం కాబట్టి భారత ముస్లింలు భారతదేశం కోసం పోరాడతారు, అవసరమైతే అందుకోసం మరణిస్తారని మోడీ ప్రకటించారు. తద్వారా గురజాత్‌లో అంటుకున్న చెరపలేని మచ్చను తుడుచుకోవాలనేది ఆయన పన్నిన వ్యూహం. ఇక మరో పన్నుగడ - చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకొనకుండానే ఆ దేశంతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్న వాంఛను ప్రకటించడం. తద్వారా, భారత్, చైనా వైపు మొగ్గుతుందేమోనన్న భ్రమలోకి అమెరికాను నెట్టడం! అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రభుత్వాలు ఈ వైఖరిని అనుసరించటం వల్లనే ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోతూ వచ్చాయి! అమెరికాకు మన పాలకులపై ‘గుర్రు’ పుట్టినప్పుడల్లా చైనా-పాకిస్థాన్‌ల మైత్రిని చూపి భారత్‌ను రెచ్చగొడుతూ వచ్చింది. భారత్, చైనాకు దగ్గరవుతోందనుకున్నప్పుడల్లా పాకిస్థాన్‌ను ‘గిల్లు’తూ వచ్చింది. అలాగే చైనా-నేపాల్ సంబంధాలు మెరుగుపడినప్పుడల్లా భారత పాలకుల్ని ’గీకి‘ నేపాల్‌పైకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది.  

కలసి అడుగు వేయడంలో వెనుకబాటే  

ఒకప్పుడు ప్రధానిగా వాజ్‌పేయి, ఆయన మంత్రివర్గ సహచరునిగా ఫెర్నాండెజ్ కూడా తమ ప్రభుత్వం చైనాతో సంబంధాలు పెంచుకుంటోందని భావించ రాదనీ, తాము చైనాకు వ్యతిరేకమేననీ అమెరికా పాలకుడికి రహస్యంగా ఉత్తరాలు రాసిన విషయం రాజకీయ పరిశీలకులకందరికీ తెలిసిందే! అందుకే సీఎన్‌ఎన్ ఇంటర్వ్యూలో మోడీ ఒక వైపున ‘‘ఈ శకం భారత్-చైనాలదేనని’’ అంటూనే, మరోవైపున ‘నియంతల పాలనలో ఉన్న చైనాకన్నా ప్రజాస్వామ్య దేశాలే అభివృద్ధి సాధిస్తాయ’ని, చైనా కూడా ఇతర దేశాలతో కలసి అడుగులు వేయక తప్పదని అన్నారు. కానీ ‘ఇరుగుపొరుగు దేశాలతో కలసి అడుగులు’ వేయడంలో మన పాలకులు  చైనా కంటే వెనకబడిపోయారని చెప్పి తీరాలి! ఎందుకంటే, అది దానికీ, మనకూ కూడా పొరుగు దేశాలైన మయన్మార్ (బర్మా), శ్రీలంక, పాకిస్థాన్, సోవియట్ యూనియన్‌లతో సరిహద్దు వివాదాలను ఏనాడో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంది. భారత్-చైనా సరిహద్దు వివాదం మాత్రమే పరిష్కారం కాలేదు.

వివాదం వలసవాద అవశేషం

భారత్-చైనాల మధ్య సరిహద్దులు వలస పాలకులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా గీసిన కత్రిమ సరిహద్దులు, అనధికారికమైన గీతలేనన్న గుర్తింపు భారత్-చైనాల పాలకుల స్పృహలో ఉండాలి. ఆ గుర్తింపు ఉంటేనే పరిష్కారం సులువు. బ్రిటిష్ వాళ్లు ఇటు వైపు నుంచి, రష్యా అటు వైపు నుంచి 18-19 శతాబ్దాల్లో తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా టిబెట్‌ను ఆక్రమించుకునే దశలో భారత్-చైనాల మధ్య ‘మెక్ మోహన్’ రేఖ వెలసింది. అదీ ఉజ్జాయింపుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గీయించిన ఊహా సరిహద్దు రేఖలే గాని వాస్తవాధీన రేఖలు కావు. ఈ సత్యాన్ని తొలి భారత పంచవర్ష ప్రణాళికకు అనుబంధంగా వెలువడిన దేశ పటంలో సహితం అక్షర సత్యంగా పేర్కొన్నారు! స్వతంత్ర చైనా పాలకులు కూడా అదే విషయాన్ని పేర్కొంటూ అనిర్వచనీయ స్థితిలో ఉన్న సుదీర్ఘ సరిహద్దులకు భూమ్మీద స్పష్టమైన రూపం ఇద్దామని అప్పట్లోనే చెప్పారు. మధ్యలో టిబెట్ నుంచి పారిపోయి మన దేశానికి చేరిన దలైలామాను మన పాలకులు సాదరంగా ఆహ్వానించి కొత్త ‘కుంపటిని‘ నెత్తి మీద పెట్టుకున్నారు. దీంతో సరిహద్దు సమస్య మరింత జటిలమైపోయింది. శ్రీలంక ప్రధాని బండారు నాయకే, ఇండోనేసియా, ఈజిప్టు అధినేతలు సుకర్నో, నాజర్‌లు సహా బాండుంగ్ అలీన దేశాల శిఖరాగ్ర సభకు వచ్చిన నేతలంతా భారత్-చైనా సరిహద్దు సమస్యను ‘వలస పాలనావశేషంగా’ భావించి చర్చల ద్వారా పరిష్కరించు కోవలసిందిగా హితవు చెప్పారు.

ఇచ్చి పుచ్చుకుంటేనే పూర్వ వైభవం

చివరికి గాంధీజీ ప్రధాన శిష్యులలో ఒకరైన పండిట్ సుందర్‌లాల్ సహితం చైనా నాయకులతో ముఖాముఖి సంభాషణలు జరిపారు. ఇటు ‘నేఫా’ రంగంలోగానీ, అటు లడఖ్‌ను ఆనుకుని ఉన్న వ్యూహాత్మక సరిహద్దులలో గాని పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే రెండు ప్రాంతాలలోనూ సరిహద్దులు నిర్ణయమవుతాయని చెప్పారు. ‘నేఫా’ (ఈశాన్య సరిహద్దు) రంగంలో 80 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా వదులుకోడానికి సిద్ధంగా ఉందని కూడా సుందర్‌లాల్ ప్రకటించారు! అమెరికా ఒత్తిళ్లకు, సత్తరకాయగా శకుని పాత్రలో ఉన్న దలైలామా ఒత్తిళ్లకూ లోనవడం వల్లనే ఉభయదేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు పెరిగాయి. ఈ పరిస్థితి శాశ్వతంగా చక్కబడాలంటే - ఎలాంటి ఆలస్యం లేకుండా  బేషరతుగా అగ్రస్థాయిలో ముఖాముఖి చర్చలు సాగితే ఉభయత్రా సాంస్కృతిక, వర్తక వాణిజ్య సంబంధాలు మూడు పూవులూ ఆరు కాయలుగా పూర్వ వైభవంతో వర్ధిల్లగలవు! మూడో శక్తికి మన సంబంధాలలో జోక్యానికి అవకాశం ఇవ్వరాదు. విశ్వాసం తప్పిన పీనుగు మోసిన వాడినే పట్టిందట! భారత్-చైనాల మైత్రి ఆసియాకే కాదు, ప్రపంచానికే రక్షరేక!

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -    ఏబీకే ప్రసాద్

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement