ఉగ్రవాద బీజం అగ్రవాదమే | America, the Real Terrorist? | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద బీజం అగ్రవాదమే

Published Tue, Nov 24 2015 12:11 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఉగ్రవాద బీజం అగ్రవాదమే - Sakshi

ఉగ్రవాద బీజం అగ్రవాదమే

రెండోమాట
అఫ్ఘానిస్తాన్‌లోని సెక్యులర్ ప్రభుత్వాన్ని సోవియెట్ పలుకుబడి నుంచి తప్పించడం కోసం ముజాహిదీన్‌లకు, లాడెన్ లాంటి వారికి నిధులు సమకూర్చి తిరుగుబాట్లు నిర్వహించింది. అమెరికన్ సామ్రాజ్యవాద 'అగ్రవాదులే' ఆ మాటకొస్తే  మధ్యాసియా రిపబ్లిక్కులలో స్థావరం ఏర్పాటు చేసుకోడానికి, ఉక్రేయిన్ లాంటి పాత సోవియెట్ రిపబ్లిక్కులలో తమ అణ్వస్త్రాలను, సైన్యాన్ని తిష్ట వేయించడానికి, అమెరికా పాలకులు ఆఫ్ఘన్ తిరుగు బాటుదార్లకు శిక్షణ ఇవ్వడానికి 1980లలోనే ఒక 'టెర్రరిస్ట్ యూనివర్సటీ' నే సీఐఏ ద్వారా స్థాపించారన్న సంగతి మరచిపోరాదు!
 
 'ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం కేవలం కొన్ని ప్రాంతాలకే, దేశాలకే పరి మితం కాబోవటం లేదు. దూరప్రాంతాలకు కూడా దాని ఉధృతి విస్తరించే విధంగా ఇస్లామిక్ స్టేట్ వ్యూహాన్ని మార్చుకుంది. ఇందుకు తగిన విధంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాలకు వెలుపల కూడా తమ శక్తి యుక్తుల్ని పెంచుకున్నారని స్పష్టమైంది. ఈ నూతన బలపరాక్రమాలతో దేశాల ప్రజలపైన మెరుపుదాడుల నిర్వహణకు ఒడిగట్టవచ్చు'
 - న్యూయార్క్ టైమ్స్ న్యూస్ సర్వీస్ (21-11-2015)
 
అగ్రవాదాన్నీ, ఉగ్రవాదాన్నీ ఎవరూ సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ, మానవాళిని నేడు పీడిస్తున్న ఈ రెండు వాదాలూ ప్రపంచ దేశాల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులనుంచే పుట్టాయి; పెరుగుతున్నాయి. ఆ కారణాలు ఏవీ అన్నదే అసలు ప్రశ్న. నిప్పు లేకుండా పొగరాదు. ఇందుకు 2001 సెప్టెంబర్ 11న (9/11) అమెరికా జంట మహాసౌధాలపైన (ట్విన్ టవర్స్) జరిగిన దాడిలో గాయపడిన ఒక అమెరికన్ మహిళ వేసిన ప్రశ్నేనిదర్శనం! అది అమెరికాలోనే ఒక శేషప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటి? వారు 'మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?' ఆ ప్రశ్నను, ఆమె మాటల్ని మీడియా దేశ ప్రజలకు బట్వాడా చేసింది. ఆనాటి ప్రెసిడెంట్ జార్జి (జూనియర్) బుష్, రాజకీయ వేత్తలు, వ్యాఖ్యాతలూ కూడా అది విన్నారు.

ఆ ప్రశ్న ప్రపంచవ్యాపితమ యింది కూడా. ఆ మరుక్షణం నుంచీ సుప్రసిద్ధ అమెరికన్ రచయితలు, టెలివిజన్ ప్రొడ్యూసర్‌లు మానవ పరిణామ శాస్త్రవేత్తలు మెరిల్ డేవీస్, జియావుద్దీన్ సర్దార్‌లు పెక్కు రహస్యాలను బయటపెట్టారు. దీనికి తగ్గట్టు గానే 1,500 మంది ప్రసిద్ధ అమెరికన్ మేధావులు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, భూగర్భశాస్త్రవేత్తలు, భవన నిర్మాణ నిపుణులు 'నిజనిర్ధారణ కమిటీ'గా (ట్రూత్ కమిటీ) ఏర్పడి మరికొన్ని విషయాలు వెల్లడిస్తూ, టవర్స్‌ను కూల్చిన దుర్మార్గంపై విచారణకు అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు వగైరా మేధావులతో కూడిన ప్రత్యేక కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు.
 డెన్నిస్ చెప్పిన సత్యాలు
 ఒక మతాన్ని అవలంబించే వారంతా ఉగ్రవాదులూ కారు, ఉగ్రవాదు లందరూ మతావలంబికులూ కానక్కర్లేదు. వారిలో కూడా హేతువాదులూ, మానవతావాదులూ ఉంటారని అమెరికన్ పార్లమెంటులో క్లీవ్‌లాండ్ డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధి డెన్నిస్ కూసినిక్ ఈ దుర్ఘటన గురించి కాలిఫోర్నియా అమెరికన్ల సభలో పేర్కొంటూనే, కొన్ని సత్యాల్ని బహిర్గతం చేశాడు. అమెరికా రాజ్యాంగాన్ని, బహిరంగ విచారణకు రాజ్యాంగం కల్పిస్తున్న మాండేట్‌ను పాలకులకు గుర్తు చేస్తూ, అమెరికా ప్రజల పేరిట, వారి ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే, వారి అనుమతి లేకుండానే పాలకులు తీసుకుంటున్న తప్పుడు చర్యల్ని, నిర్ణయాలను శఠిస్తూ, ప్రజల అనుమతి లేకుండా పాలకులు చేసే నిర్ణయాలను ఒక్కటొక్కటిగా పేర్కొంటూ కడిగిపారేశాడు. ఆ 'చాకిరేవు' ఏమిటో చూడండి:


 'ఇరాక్‌పైన దాడులకు మనం (అమెరికన్లం) అనుమతి ఇవ్వలేదు; ఇరాన్‌పై మన దురాక్రమణ చర్యలకు మన అనుమతి లేదు; ఉత్తర కొరియాపై దాడికి మన అంగీకారం లేదు; అఫ్ఘానిస్తాన్‌లో పౌరులపై బాంబు దాడులకు మన అంగీకారం లేదు; ఇరాక్ పేరుతో గ్వాంటనామా అఘాతంలో కాన్సెన్‌ట్రేషన్ క్యాంపులో శాశ్వతంగా డిటెన్యూలను కుక్కమని పాలకులకు మనం అధికారం ఇవ్వలేదు. జెనీవా ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకోవడానికి మనం అనుమతి ఇవ్వలేదు; పౌరుల్ని న్యాయచట్టాల అమలులో అనుసరించాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియకు వ్యతిరేకంగా మిలటరీ ట్రిబ్యునళ్లను పెట్టడానికి గాని, డిటెన్యూలు తమ విచారణకు, విడుదలకు వీలుకల్పించే హెబియస్ కార్పస్‌ను రద్దు చేయడానికి గాని ప్రజలు అనుమతి ఇవ్వలేదు; ప్రత్యర్థులను హత్యగావించే స్క్వాడ్స్‌ను నిర్వహించేందుకు ప్రజల నుంచి అనుమతి పొందలేదు; దేశీయ గూఢచారిశాఖ (ఎఫ్‌బీకే) దేశీయ వామపక్ష, రాడికల్ సంస్థలపైన గాని భిన్నాభిప్రాయం ప్రకటించే రాజకీయ ప్రత్యర్థులపై గాని గూఢచర్యపు కార్యకలాపాలను గాని నిర్వహించడానికి పాలకులు ప్రజానుమతి పొందలేదు;

ప్రజా హక్కుల బిల్లును (బిల్ ఆఫ్ రైట్స్) రద్దు చేసేందుకు ప్రజల అనుమతి పొందలేదు. రాజ్యాంగాన్ని ఆచరణలో పక్కన పెట్టేందుకు, పాలకులు ప్రజల అనుమతినీ పొందలేదు; నగరాలలో ఏం జరుగుతుందో కూపీ లాగేందుకు కెమెరాల ద్వారా ప్రెసిడెంట్ తెలుసుకోవడానికి ప్రజలు అనుమతి ఇవ్వలేదు. 'కంటికి కన్ను' అనే గూఢచర్య కార్యకలాపాలకు ప్రజలు అనుమతి  ఇవ్వలేదు; సెప్టెంబర్ 11న దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రతీకారంగా అఫ్ఘానిస్తాన్‌లోని అమాయక గ్రామీణ ప్రజల రక్తంతో పరిహారం చెల్లించడానికి ప్రజల అనుమతి పొందలేదు; ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, తనకు ఇష్టమొచ్చిన రీతిలో యుద్ధం ప్రకటించడానికి మనం పాలక వర్గానికి అధికారం ఇవ్వలేదు; యుద్ధాన్ని అంతూ పొంతూ లేకుండా కొనసాగించడానికి మన ప్రజలు అనుమతివ్వ లేదు; అలా అని శాశ్వత యుద్ధ ఆర్థికవ్యవస్థ ఏర్పాటుకూ ప్రజలు అనుమతి ఇవ్వలేదు.'


అణచివేత నుంచే ఆగ్రహ జ్వాలలు
 అలాంటి పాలకవర్గాలు, ప్రభుత్వాలు సమాజంలో దోపిడీవ్యవస్థకు, పెట్టు బడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రజలలో అలజడికి, అశాంతికి కారణమవుతున్నం దువల్లనే నిత్యం బాధలు పడే ప్రజాబాహుళ్యం నుంచే ప్రతీకార జ్వాలలు పుట్టుకొస్తాయి. అవి కొన్నిచోట్ల తీవ్రమైన నిరసనలకు, ప్రతిఘటనలకు; మరికొన్ని చోట్ల తిరుగుబాట్లకు, ఇంకా- అట్టుడికి పోతున్న సమాజంలో ప్రత్యక్ష విప్లవాలకు, ఇంకొన్ని చోట్ల ఉగ్రవాద చర్యలకు కారణమవు తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థల రక్షణకు సామ్రాజ్యవాద ప్రభుత్వాలు అండదండలు అందిస్తూ ఉంటాయి. పెట్టుబడులపై విపరీత లాభాల కోసం ఇతరదేశాల ఆక్రమణలకు, అక్కడి సహజ వనరులను, ఆయిల్ సంపదను దోపిడీ చేసి, స్థానిక ప్రజలను బికారులుగా మార్చి తమపై ఆధారపడి బతికే స్థితికి ఆంగ్లో-అమెరికన్, బ్రిటిష్, ఫ్రెంచి సామ్రాజ్యవాద వ్యవస్థలు తీసుకువచ్చినందుననే - అగ్రవాద రాజకీయానికి సమాధానంగానే  ఉగ్రవాద రాజకీయం విజృంభించి, ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలు తమ ఉనికి కోసం రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారని గ్రహించాలి.

ఈ అగ్రవాద వ్యవస్థలకు కొన్ని నూతన స్వతంత్ర దేశాలు కూడా ఆర్థిక సాయం కోసమో సైనిక సహాయం కోసమో అర్రులు చాస్తూ తమ ఇరుగు పొరుగు దేశాలతో సహజీవన సూత్రానికి విరుద్ధమైన విదేశాంగ విధానాన్ని  అనుసరిస్తున్నాయి! ‘నేను ఫలానా వాడు ఉగ్రవాది అని ప్రకటిస్తే అందుకు తోడుగా అనుకూలంగా గొంతు విప్పని ప్రభుత్వాలను, ఉగ్రవాదులుగానే ప్రకటిస్తానని’ అమెరికా అధ్యక్షులు బెది రిస్తే చాలు లొంగి సలాము కొట్టిన నేతలు ఉన్నంత కాలం - ఇటు అగ్రవా దాన్నీ అటు ఉగ్రవాదాన్నీ అదుపులోకి తేవడం దుస్సాధ్యమవుతోందని గ్రహించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసుకోవలసిన అవసరం ఉంది.


ఆ పాపం అమెరికాదే
 ట్విన్ టవర్స్ దుర్ఘటనను సాకుగా తీసుకున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు ‘అగ్రరాజ్య దుష్టచతుష్టయం’ అండగా ఇరాక్, అఫ్ఘానిస్తాన్ సెక్యులర్ వ్యవస్థలను కూలదోశారు. సద్దాం హుస్సేన్ (ఇరాక్) గడాఫీ (లిబియా) లాంటి జాతీయవాదుల్ని, అంతకుముందు దశాబ్దాలలో మొసాదిక్, నజీబుల్లా లాంటి నాయకుల్ని  పొట్టన పెట్టుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని సెక్యులర్ ప్రభుత్వాన్ని సోవియెట్ పలుకుబడి నుంచి తప్పించడం కోసం ముజాహిదీన్‌లకు, బిన్ లాడెన్ లాంటి వారికి నిధులు సమకూర్చి తిరుగుబాట్లు నిర్వహించింది అమెరికన్ సామ్రాజ్యవాద ‘అగ్రవాదులే’. ఆ మాటకొస్తే  మధ్యాసియా రిపబ్లిక్కులలో స్థావరం ఏర్పాటు చేసుకోడానికి, ఉక్రేయిన్ లాంటి పాత సోవియెట్ రిపబ్లిక్కులలో తమ అణ్వస్త్రాలను, సైన్యాన్ని తిష్ట వేయించడానికి, అమెరికా పాలకులు ఆఫ్ఘన్ తిరుగు బాటుదార్లకు శిక్షణ ఇవ్వడానికి 1980లలోనే ఒక 'టైస్టు యూనివర్సటీ'నే సీఐఏ ద్వారా స్థాపించారన్న సంగతి మరచిపోరాదు! ఆ రోజుల్లో అమెరికా తరఫున తైనాతీలుగా వ్యవహరిస్తున్న ఒసామా బిన్ లాడెన్ అమెరికా ‘పే-రోల్’లోనే ఉన్నాడని 1998లోనే అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి విలియం కోహెన్ ప్రకటించాడు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1890లలో సౌత్ డకోటాలో నివసించే భారతీయులపై అమెరికా సాగించిన  దాడులతో, హత్యాకాండతోనే ప్రారంభమైన సంగతీ మరువలేనిది! ఒకటేమిటి, నాటి నుంచి నేటిదాకా - ప్రపంచంలోని సుమారు 80-90 దేశాలలో అమెరికా తన ప్రపంచాధిపత్యాన్ని కాపాడుకోవడానికి నౌకా, మిలిటరీ, విమాన స్థావరా లను, సైన్యాన్ని నిలిపి ఉంచింది. ఈ మందీ మార్బలం అంతా ఇటలీ, లెబనాన్, ఇండోనేసియా, వియత్నాం, గయానా, జపాన్, నేపాల్, లావోస్, బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్స్, బొలీవియా, గ్వాటమాలా, చిలీ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, క్యూబాలలో తన తైనాతీ పాలకుల్ని నిలపడం కోసం ఎన్నికలను, ప్రజాస్వామిక ప్రక్రియలను తారుమారు చేయడానికి అనేకసార్లు ప్రయత్నించింది. ఐక్యరాజ్య సమితిని ‘డమ్మీ’ సంస్థగా చూస్తోంది. ఈ అన్ని దేశాలలో లక్షల, కోట్ల మంది ప్రజాబాహుళ్యం అమెరికా పాలకుల కుట్రలకు, దాడులకు బలైపోయారని, ఉగ్రవాదులకు అగ్రవాద రాజ్య చర్యలే ఉసురు పోస్తున్నాయని గ్రహించాలి.
 అమెరికా తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పూర్తిగా ఉపసం హరించుకుని, దేశాల స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించడమే ఉగ్రవాదానికి పరిష్కారం.

http://img.sakshi.net/images/cms/2015-07/41437415774_Unknown.jpg
 abkprasad2006@yahoo.com.in
 
 సీనియర్ సంపాదకులు:ఏబీకే ప్రసాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement