అగ్రదేశాన్ని అంటకాగొద్దు! | ABK Prasad Writes on India And America Relations | Sakshi
Sakshi News home page

అగ్రదేశాన్ని అంటకాగొద్దు!

Published Tue, Feb 27 2018 12:43 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ABK Prasad Writes on India And America Relations - Sakshi

డొనాల్డ్‌ ట్రంప్‌

రెండో మాట
అమెరికా తన ఆర్థిక సంక్షోభాలను నివారించుకోవడానికి కనిపెట్టే సాంకేతిక చిట్కాల వెంటపడితే– రోజుకొక తీరు చొప్పున వస్తువులను మార్చుతూ, నెల తిరగకుండానే నూతన ఆవిష్కరణల పేరిట పాత వస్తువుకు ఉద్వాసన చెప్పి దాని స్థానంలో కొత్త వస్తువును ‘అవ్యవధి’లో సృష్టించాల్సి వస్తుందని.. ఇది అధిక సంఖ్యలో నిరుద్యోగులు, నిరక్షరాస్యులు ఉన్న భారత్‌కు సరికాదని అమెరికాలో భారత మాజీ రాయబారి, మాజీ విదేశాంగ మంత్రి ఎం.సి. చాగ్లా తన ‘రోజెస్‌ ఇన్‌ డిసెంబర్‌’ గ్రంథంలో పేర్కొన్నారు.

‘ఏ దేశంలో అయినా, ప్రజలందరినీ సుఖసంతోషాలతో ఉంచగల అపార సహజ వనరులు ఉంటాయి. కానీ కొద్దిమంది ధనవంతుల ‘ఆబ’వల్ల ప్రజల మధ్య అసమానతలు, దారిద్య్రం తాండవిస్తున్నాయి.’
– మహాత్మాగాంధీ
‘ఈ భూమి ఏ ఒక్కడి సొత్తూ కాదు, చివరికి ఈ భూఖండంలోని యావన్మంది ప్రజలకు కూడా ఆ సొత్తును సొంతం చేసుకునే హక్కులేదు. ప్రజలు ఈ భూమినీ భూసంపదనూ భావి తరాల కోసం కాపాడే విశ్వసనీయమైన ధర్మకర్తలు మాత్రమే. ఒక కుటుంబానికి నమ్మదగిన ఇంటి పెద్దలాగా ఈ సమష్టి భూ సంపదను ఆ పెద్ద వృద్ధిలోకి తీసుకురావడమే వారి బాధ్యత.’
– కారల్‌మార్క్స్‌
‘ఒక రోజాపువ్వు దాని ప్రకాశవంతమైన శోభ, పరిమళం చెడకుండా సృష్టించడం ఎలా సాధ్యమంటే ఆ రోజా చుట్టూ ఉన్న మొగ్గలని కాస్తా తుంచి పారేయడం ద్వారానే.’
– జూనియర్‌ రాక్‌ఫెల్లర్‌ (బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో ఈ అమెరికా కోటీశ్వరుడు చేసిన ప్రసంగంలో భాగం)

అమెరికా సామ్రాజ్య విస్తరణ శక్తి మీద, ప్రపంచంలో ఆ దేశ గుత్త పెట్టుబడి సంస్థలు చూపించే శక్తి సామర్థ్యాల మీద అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విశ్వాసం సన్నగిల్లినట్టుంది. నిజానికి ఆయన ఆ భావాన్ని అధ్యక్ష ఎన్నికల సందర్భంగానే వ్యక్తం చేశారు. ‘ప్రపంచ శక్తిగా అమెరికా ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించడమే’ తన కర్తవ్యంగా ఆయన ఎన్నికల సభలలో చెప్పారు. ఆ ప్రతిష్ట ఎలాంటిదో చెప్పకుండానే, అది ప్రపంచదేశాలలో పలచబారిపోతోం దని లోపాయికారీగా అంగీకరించవలసి వచ్చింది. ఇందుకు కారకులు తనకంటే ముందు పాలించిన ట్రూమన్, రూజ్వెల్ట్, ఐసెన్‌హోవర్, నిక్సన్, బుష్‌ (సీని యర్, జూనియర్‌), క్లింటన్, ఒబామా– ఎవరు కారకులు?

అనేక పోరాటాలూ త్యాగాలూ ఫలితంగా ఇండియా సహా పెక్కు ఆఫ్రో–ఏసియన్‌ దేశాల మీద బ్రిటిష్‌ పెత్తనం తొలగిపోయింది. మళ్లీ అదే పంథాను అనుసరించింది అమెరికా. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా పెత్తనం కొనసాగుతూ వస్తోంది. సోవియెట్‌ రష్యా కూడా అనేక త్యాగాలు చేసి, అమెరికా కుట్రలకు తలొగ్గకుండా ఉన్నందుకే ఏడు దశాబ్దాలకు పైగా వ్యక్తిత్వాన్నీ, ఆర్థిక స్వాతంత్య్రాన్నీ కాపాడుకోగలిగింది. విశ్వకవి టాగోర్, గాంధీ, నెహ్రూ, డీన్‌ ఆఫ్‌ కాంటర్‌బరీ, బెర్నార్డ్‌షా వంటివారు ఈ సత్యాన్ని కీర్తించినవారే.

సోవియెట్‌ రష్యా పేదలకు, పేద దేశాలకు చెక్కుచెదరని అండదండలు అందించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత హిట్లర్‌ విజయ పరంపరలో ఉన్నప్పటికీ సోవియెట్‌ యూనియన్‌కు జయం కలగాలని టాగోర్, నెహ్రూ పదేపదే ప్రార్థించడానికి కారణం కూడా అదే. నిజానికి హిట్లర్‌ను తుత్తునియలు చేయడంలో సోవియెట్‌ రష్యాకు అండదండలు అందిస్తున్నట్టే పైకి కనిపించినా మిత్రమండలిలోని అమెరికా, బ్రిటన్‌ ఆలోచన వేరు.

నాజీలను ఓడించిన ఘనత సోవియెట్‌ సేనలకు రాకూడదనే వారి ఆశ. అందుకే సోవియెట్‌ రష్యా కోరిన విధంగా తమ సేనలను పంపించడంలో తీవ్ర జాప్యం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి క్రమంగా సోవి యెట్‌ రష్యా పలుకుబడి ప్రపంచ వ్యాప్తం కాకుండా ఉండేందుకు ఆంగ్లో–అమెరికన్‌ సామ్రాజ్యవాదులు అన్ని రకాల వ్యూహాలకు సిద్ధపడ్డారు.

ఒక శాతం ధనికుల వద్దనే అమెరికా సంపద
ఏడు దశాబ్దాల సోవియెట్‌ రష్యా ప్రస్థానంలో ఆ దేశ నాయకత్వాన్ని, అందులోని మెతక వర్గాన్ని అమెరికన్‌ సామ్రాజ్యవాద శక్తులు ప్రలోభాలతో సాకుతూనే ఉన్నాయి. చివరికి రెక్‌జావిక్‌ (ఐస్‌ల్యాండ్‌) రహస్య సమావేశం ద్వారా సోవియెట్‌ నాయకవర్గాన్ని లోబరుచుకున్నారు. ఆపై అమెరికా విజృంభణకు అదుపు లేకుండా పోయింది. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా దాదాపు 90 దేశాలలో సైనిక స్థావరాలను నెలకొల్పింది. ప్రపంచం మీద పెత్తనానికి ప్రయత్నించింది. ఇతర దేశాల సంపదలపై ఆధిపత్యం చేయడానికి ఇలాంటి స్థావరాల అవసరం అమెరికాకు ఉంది.

సరిగ్గా ఆ కుట్రలు పన్నుతున్న సమయంలోనే ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఆర్థిక సంక్షోభానికి (గ్రేట్‌ డిప్రెషన్‌) అమెరికా కారణమైంది. అలా 70 ఏళ్లుగా అనేక ఆర్థిక సంక్షోభాలకు ‘పురుడు’ పోసి స్వతంత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ఆ కుట్రలోకి లాగి తేరుకోలేకుండా చేస్తోంది. అటు రాజకీయ పెత్తనం, ఇటు ఆర్థిక సంక్షోభాల సృష్టికి తామే కారకులమన్న సత్యాన్ని అమెరికా కాదనలేని దశకు చేరింది.

ఈ సంక్షోభంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వర్ధమాన, బడుగు దేశాలను అమెరికా తనకు తోడుగా సంపాదించుకుంది. సరిగ్గా ఈ నేపథ్యం లోనే అమెరికా వర్తక, గుత్త వ్యాపార కేంద్రమైన పెట్టుబడిదారీ ‘వాల్‌స్ట్రీట్‌’ మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ ప్రకంపనలు ఇప్పటికీ చల్లారలేదు. ఈ సమయంలోనే అసలు రహస్యాన్ని బయట పెడుతూ ప్రపంచ బ్యాంకు అనుబంధ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్‌.) అమెరికాలోని 1 శాతం అతి సంపన్నులు మాత్రమే 99 శాతం ప్రజల్ని దోచుకు తింటున్నారని నిరూపించింది.

ఈ 99 శాతం ప్రజల తరఫున వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం సాగవలసి వచ్చిందని ఆందోళనకారులు చెప్పవలసి వచ్చింది కూడా. ఈ పరిణామాలను తాజాగా చర్చిస్తూ ఈ ప్రపంచ అనుభవాల తర్వాత ‘మానవజాతి లేదా మానవులు బతికి బట్టకట్టాలంటే సోషలిజం అనివార్యమ’ని ప్రసిద్ధ అమెరికన్‌ మాసపత్రిక ‘మంత్లీ రివ్యూ’సంపాదకుడు జాన్‌ బెలామీ పోస్టర్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ జరిపినవారు జిప్పన్‌ జాన్, జితేష్‌ పి.ఎం. (జనవరి 19, ఫిబ్రవరి 02, 2018).

అమెరికాను అనుసరిస్తే ఎలా?
శతాబ్దాలుగా ప్రయాణించిన పెట్టుబడిదారీ వ్యవస్థ నేడు ఈ దశకు చేరుకుంది. తానెదుర్కొంటున్న పలు ఆర్థిక సంక్షోభాలను, శ్రేయోదాయకమైన ప్రజాతంత్ర ప్రజా ప్రయోజనాలను కాపాడే దిశగా పరిష్కరించే మార్గాలు విడిచి కేవలం సాంకేతిక పరిజ్ఞానం చాటున దాగుతూ సమస్యను తాత్కాలికంగా దాటవేస్తూ వస్తోంది. అందుకే అమెరికాలో భారత మాజీ రాయబారి, మాజీ విదేశాంగ మంత్రి ఎం.సి. చాగ్లా రాసిన ‘రోజెస్‌ ఇన్‌ డిసెంబర్‌’ గ్రంథంలో భారతీయ అనుకరణ విద్యను విమర్శించాల్సి వచ్చింది.

అమెరికా తన ఆర్థిక సంక్షోభాలను నివారించుకోవడానికి కనిపెట్టే సాంకేతిక చిట్కాల వెంటపడితే– రోజుకొక తీరు చొప్పున వస్తువులను మార్చుతూ, నెల తిరగకుండానే నూతన ఆవిష్కరణల పేరిట పాత వస్తువుకు ఉద్వాసన చెప్పి దాని స్థానంలో కొత్త వస్తువును ‘అవ్యవధి’లో సృష్టించడం అనేది అధిక సంఖ్యలో నిరుద్యోగులు, నిరక్షరాస్యులు ఉన్న భారత్‌కు సరికాదని చెప్పారు చాగ్లా.

ఈ భావాన్నే ఇప్పుడు విస్తృత స్థాయిలో చర్చించిన బెలామీ పాస్టర్, ‘అనేక ప్రపంచదేశాలలో, ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోతున్న ప్రాంతాలలో నేడు తిరుగుబాటు బీజాలు పడ్డాయి’ అన్నాడు. ఎందుకంటే, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఈ నిరంతర సంక్షోభం పెట్టుబడిదారీ వ్యవస్థ చంచలమైన దాని చలన సూత్రాలలోనే దాగి ఉందని మరవరాదన్నాడు. అంతేగాదు, నేడు మనకి ముంచుకొచ్చిన పర్యావరణ కాలుష్య సమస్యలు కూడా పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థలో అంతర్భాగమేనని గుర్తించాలంటాడు బెలామీ.

పెట్టుబడి వ్యవస్థలో అంతర్భాగంగా కొత్తగా వెలసిన ‘నూతన ఉదారవాదం’ (నియోలిబరిజం) కూడా ఆర్థిక సంక్షోభాలకు మౌలిక కారణాలను ప్రజలు గుర్తించకుండా చేసే ‘మాయజలతారే’నని గ్రహించవలసిన రోజు వచ్చిందంటాడు పాస్టర్‌. అంటే అంతంతమాత్రపు ఆ ‘నవీన ఉదారవాదా’నికి కూడా కాలం చెల్లిపోయే సుదినాలు వచ్చాయని బెలామీ పాస్టర్‌ ఒక ఆశావాదిగా భావిస్తున్నాడు.

ఇందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాపితంగా ఇప్పటిదాకా ఎదురులేకుండా ‘నటిస్తున్న’ అమెరికన్‌ సామ్రాజ్యవాద పాలనా వ్యవస్థ, అతి చిన్న దేశమైన వియత్నాం తిరగబడినంతనే కుప్పకూలిపోయి ధన, సైనిక, నైతిక రంగాలలో వరసగా రాజకీయ, సైనికపరమైన ఓటమి పరంపరను ఎదుర్కొన్నది. నికరాగ్వా, హోండురాస్, క్యూబా, బ్రెజిల్‌ వగైరా స్వతంత్ర దేశాలు తమ మనుగడను చాటుకునే దేశాలలో అమెరికాకు పట్టిన గతీ ఇదే. ఈ పరిణామాలన్నీ గడచిన 25–30 సంవత్సరాలలోనే జరిగాయి.

సాంకేతిక విద్య సమరానికి కాదు
సాంకేతిక పరిజ్ఞానం మానవుడి అవసరాలను తీర్చగల ఒక సాధనమేగానీ అతని ప్రగతిని యుద్ధాల బాటలోకి నెట్టే సాధనం కాదు. ట్రంప్, మోదీ లాంటి ఆయన అనుచరులూ గుర్తించవలసిన మొదటి షరతు అది. దీనికి తోడు ‘కృత్రిమ మేధ’ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను రంగంలోకి దించే పెద్దలు ఆ కృత్రిమ రోబోటిక్‌ పరికరం మానవుడు సృష్టించిందేనని, అతని శ్రమశక్తి వినియోగించకుండా ఆ పరికరం వెలుగులోకి రాలేదని గ్రహించాలి.

ట్రంప్‌ ఎన్నికలో ప్రధాన పాత్ర వహించిన అతని క్యాబినెట్‌ అనుయాయులుగా కన్జర్వేటివ్స్‌గా ఉన్న స్టీవ్‌ బన్నన్, జాన్‌ కెల్లీ, జాత్యహంకారి రాయ్‌ మూర్‌ సహితం ట్రంప్‌ టీమ్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అంతేగాదు, మధ్యాసియా రిపబ్లిక్స్‌లోనూ, అదను చూసుకుని అఫ్ఘానిస్తాన్‌లో తన యుద్ధ స్థావరాలు ఆధారంగా క్రమంగా కశ్మీర్‌లోకి పాకాలని చూస్తూ, భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య, భారత్‌–చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడకుండా వ్యూహ రచన చేస్తున్న సమయంలో ట్రంప్‌ ఆశలు ఆవిరైపోక తప్పదు.

యూరప్‌లో కూడా తన ఆధిపత్యం చేజారకుండా ఉండేందుకు అమెరికా ఆధ్వర్యాన నడుస్తున్న ‘నాటో’ సైనిక కూటమి సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. అందుకే మార్క్స్‌ ‘ప్రపంచంలో అత్యంత కీలకమైన ఉత్పాదక శక్తులు మానవమాత్రులేగానీ మరొకరు కాజాలరు. మానవశక్తి, ఉత్పత్తి శక్తులయిన ఆ మానవుల అభివృద్ధే–శ్రమ విభజనే అసలు సిసలు అభివృద్ధికి చిహ్నం’ అన్నాడు.

షెల్లీ మహాకవి మాటల్ని వినండి: ‘‘నీవు విత్తనం చల్లుతావు, ఆ పంటను మరొకడు కోసుకుంటాడు/ నీవు సంపద సృష్టిస్తావు, మరొకడు అనుభవిస్తాడు/ బట్ట నేసేది నీవు ధరించేది మరొకడు/ ఆయుధాల తయారీ నీవు– వాటిని ఉపయోగించేది మరొకడు/ అయితే– నీవు విత్తనం చల్లు, కానీ ఏ నియంతనూ  పంటను కోసుకోనివ్వకు/ సంపద సృష్టించు, కానీ మరొకణ్ని కూడబెట్టనివ్వకు/ నీవు బట్టనెయ్యి కానీ సోమరిపోతుకు దాన్ని దక్కనివ్వకు/ ఆయుధాలు తయారుచేసుకో, కానీ నీ రక్షణ కోసమే తయారు చేసుకో’’.

సీనియర్‌ సంపాదకులు
ఏబీకే ప్రసాద్‌
abkprasad2006@yahoo.co.in  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement