తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది.
ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు.
ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.
కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్‌నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది.
తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి.
ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది.
ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది.
80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment