‘చైనా, పాక్ మమ్మల్ని బానిసల్ని చేద్దామనా..’
గిల్గిత్: పాకిస్థాన్, చైనాకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. వన్ బెల్ట్ వన్ రోడ్డు(ఓబీఓఆర్) అంశంపై బీజింగ్‌లో సోమవారం సీరియస్‌గా సమావేశాలు మొదలుకాగా దానిని వ్యతిరేకిస్తూ పాక్‌లోని గిల్గిత్-బాల్తిస్థాన్‌కు చెందిన యువత, ఇతర పౌరులు ఆందోళన బాటపట్టారు. ఓబీఓఆర్‌ను తమ ప్రాంతంలో ఏ మాత్రం అనుమతించబోమంటూ పెద్ద పెట్టున నినాదాలు తీస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా ఇదే స్థాయిలో నిరసలను బయలుదేరాయి. చైనా తొన తొలి భారీ విదేశాంగ విధానంగా పేర్కొంటూ ఆసియా ప్రాంతంలో తన వాణిజ్య విస్తరణలో భాగంగా ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టు పేరిట భారీ నిర్మాణానానికి తెర లేపింది.
రైల్వే, రోడ్డు, వైమానిక రవాణా మార్గాలను అనుసంధానం చేసేలా అతి పెద్ద రోడ్డు నిర్మాణం చేయనుంది. దీనికి సంబంధించి నిర్వహిస్తున్న వన్ బెల్ట్ వన్ రోడ్డు సమావేశానికి మొత్తం 23 దేశాలను ఆహ్వానించగా భారత్ గైర్హాజరైంది. పాక్, అమెరికా, జపాన్, రష్యావంటి దేశాలు హాజరయ్యాయి. అయితే, ఈ కారిడార్‌ను పాక్ అక్రమిత కశ్మీర్ గుండా నిర్మించాలని చైనా చూస్తోంది. దీంతోపాటు గిల్గిత్-బాల్తిస్థాన్‌లో చైనాకు చెందిన సైనిక శిబిరాలు ఏర్పాటుచేయాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ అజమాయిషీని భరించడం కష్టంగా భావిస్తున్న ఈ ప్రాంతాల వాసులు తాజాగా జరిగే ఒప్పందంతో చైనా అధికారాన్ని కూడా భరించాల్సి వస్తుందనే ఆగ్రహంతో తాజా సమావేశాన్ని నిరసిస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన లేవనెత్తారు. ప్లకార్డులు, బ్యానర్లుపట్టుకొని చైనా సామ్రాజ్యవాద ఆలోచనను ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమను మరింత బానిసలుగా మార్చే ప్రయత్నం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ సహాయంతో తమ ప్రాంతాల్లోకి చైనా ప్రవేశించాలని చూస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.