ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో టెర్రరిస్టు దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన పడుతోంది చైనా. చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా చేపట్టిన ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)లో పని చేస్తున్న తమ దేశీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సీపెక్ ప్రాజెక్టులో పని చేస్తున్న చైనీయుల కోసం బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఇటీవల కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఘటనతో చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా కార్మికులకు భద్రత కల్పించటం డ్రాగన్‌కు తలనొప్పిగా మారింది. ప్రాజెక్టుల వద్ద భద్రత బలగాలు, దర్యాప్తు దళాలను బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు సీపెక్‌కు చెందిన 11వ జాయింట్ కోఆపరేషన్ కమిటీ(జేసీసీ) తెలిపింది. ‘ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా ఉద‍్యోగులు బయటకి పనుల కోసం వెళ్లేందుకు బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని నిర్ణయించారు.’అని వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌లో పని చేస్తున్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. బులెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించటం చైనా ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్లయిందని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment