air chief marshal
-
Indian Air Force Day: ఐఏఎఫ్ అత్యుత్తమమైందిగా ఉండాలి
ప్రయాగ్‌రాజ్: ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి పిలుపునిచ్చారు. దేశ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు, శత్రువులను దీటుగా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ కట్టుబడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ఎయిర్ ఫోర్స్‌డేను పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఏఎఫ్ అవతరించి 2032 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుందని చెబుతూ ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా ఐఏఎఫ్ అవతరించాలని అన్నారు. వ్యూహాలను మెరుగుపరుచుకోవడం, సామర్థ్యాలను సమకూర్చుకోవడం వంటివి భవిష్యత్ యుద్ధాల్లో పైచేయి సాధించడంలో ఐఏఎఫ్‌కు ఎంతో కీలకమన్నారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధ వీరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి నిరుపమాన సేవలు, త్యాగాల వల్లే మన గగనతలం సురక్షితంగా ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)దే పైచేయిగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సంసిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చోట్లా పటిష్టంగా మోహరించినట్లు తెలిపారు. చైనాతో తూర్పు లద్దాఖ్‌లో ఐదు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న వైమానిక దళం దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నారు. లద్దాఖ్‌లో ఐఏఎఫ్ సామర్థ్యంలో భారత్‌తో పోలిస్తే చైనా వెనుకబడి ఉందనీ, అయినప్పటికీ శత్రువును తక్కువగా అంచనా వేయజాలమన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే ఎలాంటి పరిస్థితులకైనా తక్షణం, వేగంగా స్పందించేలా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఐఏఎఫ్ మోహరింపులు చేపట్టిందని చెప్పారు. అవసరమైతే ఉత్తర(చైనా), పశ్చిమ(పాక్) సరిహద్దుల వెంట ఏకకాలంలో పోరాటం జరిపే సత్తా ఐఏఎఫ్‌కు ఉందన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా నుంచి ముప్పు ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన..‘అవసరమైన అన్ని చోట్లా మోహరించాం. లద్దాఖ్ అందులో చిన్న ప్రాంతం’అని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోకి సులువుగా ప్రవేశించేందుకు వీలున్న అన్ని చోట్లా ఈ మోహరింపులు ఉన్నాయని తెలిపారు. మన ఆర్మీని, ఆయుధ సామగ్రిని శత్రువు కూడా ఊహించలేని ప్రాంతాల్లోకి సైతం వేగంగా తరలించేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల చేరికతో ఉత్తర సరిహద్దుల్లో శత్రువు కంటే మెరుగైన సామర్థ్యంతో ఉన్నామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని రఫేల్‌లను సమకూర్చుకునే విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. చైనా బలాలు చైనాకున్నాయి.. చైనా కూడా కొన్ని అంశాల్లో బలంగా ఉందన్న బదౌరియా.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను ఐఏఎఫ్ సిద్ధం చేసిందన్నారు. ‘చైనాకు సుదూర లక్ష్యాలను ఛేదించే, భూమిపై నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, ఐదో తరం జె–20 యుద్ధ విమాన దళం, అత్యాధునిక సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. సాంకేతిక, వ్యవస్థల ఏర్పాటు కోసం భారీగా వెచ్చిస్తోంది’అని తెలిపారు. -
చైనా, పాక్‌లతో యుద్ధానికి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆయుధ శ్రేణిలో రఫేల్ యుద్ధ విమానాలు చేరడంతో ప్రత్యర్ధులపై మనం పైచేయి సాధించామని, తొలిసారిగా ప్రభావవంతంగా దాడిచేసే సామర్థ్యం అందివచ్చిందని వైమానిక దళం చీఫ్ ఆర్కేఎస్ భదూరియా అన్నారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్లతో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేసేందుకు సిద్థమని ఆయన స్ప్టష్టం చేశారు. లడఖ్‌లో చైనా దూకుడును ఈ ఏడాది మేలోనే తాము గుర్తించామని, అప్పటినుంచి మన సైనం, వైమానిక దళం వేగంగా స్పందిస్తున్నాయని భదూరియా పేర్కొన్నారు. చదవండి : రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా సేనలు మోహరించి విస్తృతంగా సైనిక విన్యాసాలు చేపడుతున్నాయని చెప్పారు. పలు అంశాల్లో పాకిస్తాన్ చైనాపై ఆధారపడుతోందని చెప్పుకొచ్చారు. యుద్ధం వస్తే భారత్‌పై చైనా పైచేయి సాధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లడఖ్ సహా కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించిందని, పాక్-చైనాలతో తలపడేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు భారీగా సేనలను మోహరించామని వెల్లడించారు. కాగా ఐదు రాఫేల్ యుద్ధవిమానాలు సెప్టెంబర్ 10న భారత వాయుసేన అమ్ములపొదిలో చేరిన సంగతి తెలిసిందే. -
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం
సాక్షి, హైదరాబాద్: చైనాతో సరిహద్దు వెంబడి ఎదురయ్యే ఎలాంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా, తగిన విధంగా మోహరించి ఉన్నామని ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. చైనా వాయుసేన సామర్థ్యం, దాని వైమానిక కేంద్రాలు, కార్యకలాపాల స్థావరాలు, సరి హద్దులో బలగాల మోహరింపు గురించి తమకు తెలుసని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో అధికారుల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను సమీక్షించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పూర్తి పరిస్థితితో పాటు ఎల్ఏసీ ఆవల మోహరింపుల గురించి కూడా మాకు తెలుసు. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ లో వీర జవాన్లు చేసిన అత్యున్నత త్యాగాన్ని వృథా కానివ్వబోమన్న కృతనిశ్చయం తో ఉన్నాం’అని భదౌరియా తెలిపారు. శనివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం యువ అధికారుల సంబరం అయితే అదే సమయంలో తాజా పరిస్థితిని శాంతియుతం గా పరిష్కరించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. సరిహద్దులో చైనా ఏటా బలగాలను మోహరించి వైమానిక విన్యాసాలు చేపడుతున్నప్పటికీ ఈసారి మాత్రం ఆ కార్యకలాపాలు పెరిగాయన్నారు. ‘ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా మన సాయుధ దళాలు అన్ని సమయాల్లో సర్వసన్నద్ధంగా, అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎల్ఏసీ వద్ద చోటుచేసుకున్న పరిణామం మేం అతితక్కువ సమయంలో ఏం చేయాల్సిన అవసరం ఉందో చెప్పే చిన్న ఉదాహరణ’అని భదౌరి యా వ్యాఖ్యానించారు. అంతకుముందు జరిగిన పరేడ్‌లో 123 మంది ఫ్లయిట్ కేడెట్లకు ‘ప్రెసిడెం ట్స్ కమిషన్’ను, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్స్‌కు చెందిన 11 మంది అధికారులకు ‘వింగ్స్’ ను ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా అందజేశారు. 123 మంది అధికారుల్లో 61 మంది ఫ్లయింగ్ బ్రాంచీలో, 62 మంది గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీలో చేరారు. వారిలో 19 మహిళా అధికారులున్నారు. వియత్నాం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు ఫ్లయింగ్ కేడెట్లు కూడా శిక్షణను పూర్తిచేసుకున్నారు. ప్రతిభావంతులకు అవార్డులు పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతి భ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ బ్రాంచ్ ఫ్లయింగ్ ఆఫీసర్ అనురాగ్ నయన్‌కు ‘స్వార్డ్ ఆఫ్ హానర్’తోపాటు రాష్ట్రపతి ఫలకాన్ని (ప్రెసిడెంట్స్ ప్లేక్) అందజేశారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీలో ప్రథ మ స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆంచల్ గంగ్వాల్‌కు రాష్ట్రపతి ఫలకాన్ని (ప్రెసిడెంట్స్ ప్లేక్) అందించారు. కలలు నెరవేర్చుకోండి.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సందర్భంగా ఎయిర్‌ఛీఫ్ మార్షల్ భదౌరియాకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలా, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ జె. చలపతి సాదర స్వాగతం పలికారు. కోవిడ్ ప్రొటోకాల్‌కు అనుగుణంగా జనరల్ సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ తాము ఎన్నుకున్న రంగంలో మేటిగా నిరూపించుకునేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వాయుసేన సేవల్లో చేరుతున్న సందర్భంగా చేసిన ప్రతిజ్ఞ మేరకు తమ బాధ్యతలు, విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. సైనికదళాల్లో చేరాలనే తమ పిల్లల నిర్ణయానికి మద్దతు తెలిపి సహకరించిన తల్లితండ్రులు, వారి బంధువులకు భదౌరియా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత వాయుసేనలో చేరడం ద్వారా తమ కలలు, అభిరుచులను సాధించుకోవాలని యువతీ యువకులకు పిలుపునిచ్చారు. -
‘రఫేల్ జెట్స్’ సరిపోవు: ఐఏఎఫ్ చీఫ్
న్యూఢిల్లీ: పెరుగుతున్న వైమానిక దళ అవసరాలకు త్వరలో దళంలో చేరనున్న రఫేల్ యుద్ధవిమానాలు సరిపోవని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా పేర్కొన్నారు. దేశీయంగా యుద్ధ విమానాలు ఇతర ఆధునిక ఆయుధాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలు త్వరలో వైమానిక దళంలో సేవలందించనున్న విషయం తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడుల తరువాత వైమానిక దళం అందించగల సేవలపై ఉన్న అభిప్రాయంలో కీలక మార్పు వచ్చిందన్నారు. సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ శుక్రవారం నిర్వహించిన ‘ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో’ సదస్సులో బదౌరియా ప్రసంగించారు. ‘36 రఫేల్ యుద్ధ విమానాలు మన అవసరాలకు సరిపోవు. మనం దేశీయంగా తయారు చేసిన అస్త్ర క్షిపణిని ఎస్‌యూ 30, మిగ్ 29 వంటి ఇతర ఫైటర్ జెట్‌పై ఉపయోగించగలగాలి. అప్పుడే మన వైమానిక శక్తి మరింత పెరుగుతుంది’ అన్నారు. అయితే, ఇతర క్షిపణులను ప్రయోగించగల యుద్ధ విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడాలన్న ప్రభుత్వ నిర్ణయం సాహసోపేతమైందన్నారు. మన వైమానిక దళం లక్ష్యాలను కచ్చితంగా చేధించిందన్నారు. మన దాడిపై స్పందించేందుకు పాకిస్తాన్ వైమానిక దళానికి 30 గంటల సమయం పట్టిందని బదౌరియా వ్యాఖ్యానించారు. -
వాయుసేన చీఫ్‌కు తప్పిన ముప్పు
హోనోలులు: అమెరికా పర్యటనలో ఉన్న భారత్ ఎయిర్‌చీఫ్ మార్షల్ రాకేష్ భదౌరియాకు ముప్పు తప్పింది. హవాయి దీవుల్లోని పెరల్ హార్బర్లో బుధవారం ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతపై వివిధ దేశాల వైమానిక దళ మార్షల్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో ఒక నావికుడు పెరల్ హార్బర్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అమెరికన్లు మృతి చెందారు. కాల్పులు జరిపాక ఆ నావికుడు తనను షూట్‌చేసుకుని చనిపోయాడు. కాగా, భదౌరియా సురక్షితంగా ఉన్నారని భారత వైమానిక దళం వెల్లడించింది. పెరల్ హార్బర్లో అమెరికా వైమానిక దళ కేంద్రంలో ఈ సదస్సు జరిగే సమయంలో దగ్గర్లోని నావికాదళ కేంద్రంలో కాల్పుల ఘటన జరిగిందని వాయుసేన అధికారి చెప్పారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉందని హవాయి ప్రాంత నావికా దళ కమాండర్ అడ్మిన్ రాబర్ట్ చెప్పారు. 1941 డిసెంబర్ 7న జపాన్ పెరల్ హార్బర్‌పై జరిపిన దాడికి 78ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అక్కడ నివాళులరి్పంచడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ కాల్పుల ఘటన జరగడంతో అమెరికాలోనూ కలకలం రేగింది. -
భారత ఎయిర్ చీఫ్ ‘సేఫ్’ : ఐఏఎఫ్
హవాయి : ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ రాకేశ్‌కుమార్ సింగ్ బదౌరియా క్షేమంగా ఉన్నారని వైమానిక దళ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. వివరాలు.. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో భద్రతపై చర్చించడానికి అమెరికా మిలిటరీ స్థావరమైన హవాయిలోని పెర్ల్ హార్బర్లో వివిధ దేశాల వాయుసేనాధ్యక్షులతో ఓ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి బదౌరియా అక్కడికి వెళ్లారు. అయితే బుధవారం పెర్ల్ హార్బర్ నౌకాశ్రయంలో ఓ సెయిలర్ ముగ్గురిని కాల్చి చంపేసి అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోబదౌరియా పెర్ల్‌హార్బర్‌లోని ఎయిర్ బేస్‌లో ఉన్నారని, కాల్పుల ఘటన నౌకాశ్రయంలో జరిగిందని అధికార ప్రతినిధి వివరించారు. -
‘ఎంఐ 17 వీ5 హెలికాఫ్టర్ కూల్చివేత తప్పిదమే’
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం ఫిబ్రవరి 27న ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్‌ను కూల్చడం భారీ తప్పిదమని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అన్నారు. ఎల్ఓసీ వద్ద భారత్, పాకిస్తాన్ యుద్ధ విమానాలు కాల్పులు జరిపిన రోజు జరిగిన ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బంది, ఓ పౌరుడు మరణించిన సంగతి తెలిసిందే. ఇది తమ పొరపాటేనని, దీన్ని తాము అంగీకరించామని ఎయిర్ చీఫ్ స్పష్టం చేశారు. మన క్షిపణే యుద్ధ విమానాన్ని ఢీ కొందని, ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారులపై చర్యలు చేపడతామని చెప్పారు. గత వారంలో ఈ ఘటనపై విచారణ జరిగిందని, దీనిపై నిర్వహణపరమైన క్రమశిక్షనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. బాలాకోట్‌లో ఐఎఎఫ్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించిన మరుసటి రోజు శ్రీనగర్ సమీపంలోని బుద్గాం వద్ద ఎంఐ17 వీ5 హెలికాఫ్టర్ కూలిన సంగతి తెలిసిందే. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పర్యవేక్షించిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన పది నిమిషాలకే కుప్పకూలింది. రెండు ముక్కలైన ఎంఐ-17 హెలికాఫ్టర్ వెనువెంటనే మంటల్లో చిక్కుకుంది. కాగా, బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడి దృశ్యాల వీడియోను ఎయిర్ చీప్ భదౌరియా విడుదల చేశారు. -
‘మెర్సిడెస్ నడిపినట్టే ఉంది’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాన్ని నడపటం తనను థ్రిల్‌కు గురిచేసిందని చెబుతూ ఇది మెర్సిడెస్ కారును నడిపినట్టే ఉందని భారత వైమానిక దళం చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. మారుతి కారును నడిపే వ్యక్తికి మెర్సిడెస్ అందిస్తే అతను హ్యాపీగా ఫీలవతాడని రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తనకూ అదే అనుభవం ఎదురైందని ఇండియా టుడే కాంక్లేవ్‌లో నేపథ్యంలో ఆయన చెప్పుకొచ్చారు. ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ నుంచి రఫేల్‌ను ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ ఏడాది జులైలో నడిపి దానిపై పట్టు పెంచుకున్నారు. భారత వైమానిక దళానికి రాఫేల్ శక్తివంతమైన వనరుగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత వాయుసేన విమానాలు పురాతనమైనవన్న ఆందోళనపై స్పందిస్తూ వాయుసేనను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాఫేల్‌తో మన వైమానిక సాధనాసంపత్తిలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఏవియానిక్స్, మిసైల్, డేటా సహా పలు అంశాల్లో మనం చాలా ముందున్నామని పేర్కొన్నారు. బాలాకోట్ తరహా వైమానిక దాడుల గురించి ప్రశ్నించగా ఎలాంటి దాడులకైనా వాయుసేన సిద్ధంగా ఉందని, ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తాము సైనికేతర లక్ష్యాన్ని ఢీ కొట్టడం ద్వారా భారత్‌లో ఉగ్రవాదం ప్రేరేపిస్తే మీరు పీఓకే లేదా ఎక్కడ ఉన్నా మిమ్నల్ని లక్ష్యంగా చేసుకుంటామనే సంకేతాలను ఉగ్ర సంస్ధలకు పంపామని చెప్పారు. -
‘మరో కార్గిల్ వార్‌కు రెఢీ’
సాక్షి, న్యూఢిల్లీ : మన సైనిక బలగాలు అవసరమైతే మరో కార్గిల్ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయని భారత వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. చివరి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, మరోసారి కార్గిల్ యుద్ధం వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కార్గిల్ యుద్ధం జరిగి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా మాట్లాడారు. ఎలాంటి వాతావరణంలోనైనా శత్రు దేశంపై బాంబులతో విరుచుకుపడగల సామర్ధ్యం వైమానిక దళం సొంతమని చెప్పారు. గురితప్పకుండా లక్ష్యాన్ని ఢీ కొట్టగలిగే మన సామర్ధ్యం బాలాకోట్ వైమానిక దాడుల్లో మనం చూశామని చెప్పుకొచ్చారు. -
అరుదైన ఘనత సాధించిన అభినందన్
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం నేషనల్ హీరోగా నీరాజనాలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంతోష సమయంలో అభినందన్ పేరిట మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని నేల కూల్చిన తొలి ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ అరుదైన ఘనత సాధించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చడం సాహసోపేతమైన చర్య అని ఆయన కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మిగ్-21 బైసన్ అత్యాధునిక ఫైటర్ జెట్టే అయినా.. ఎఫ్-16కు ఇది సాటిరాదు. ఎఫ్-16కు ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్‌గా పేరుంది. అయితే మిగ్-21 బైసన్ నడిపే పైలట్లు తమ నైపుణ్యం పెంచుకునేందుకు అప్పుడప్పుడూ మిరాజ్ - 2000, మిత్ర దేశాల ఎఫ్-16 విమానాలతో శిక్షణ పొందుతుంటారు. అలా అభినందన్ పొందిన శిక్షణ ఎఫ్-16ను కూల్చేందుకు పనికొచ్చింది. క్షణాల్లో జరిగిపోయే గగనతల యుద్ధ సమయంలో ప్రత్యర్థి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో మన పైలట్లు ఎల్వోసీ దాటి వెళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభినందన్.. ఎఫ్-16 జెట్‌ను కూల్చడం సాధారణ విషయమేం’ కాదని ఆయన ప్రశంసించారు. అంతేకాక ‘పాకిస్థాన్ ఎఫ్-16 విమానాల్ని పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి కొన్నది. ఐఏఎఫ్ కూడా ఎప్పట్నుంచో 100 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. కానీ, ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వంతో రక్షణ శాఖ సామాగ్రి కొనుగోలుకు చాలా ఆలస్యం అవుతోంది. అంతేకాక ఐఏఎఫ్ రెండు దశాబ్దాలుగా ఎస్‌యూ - 30 ఎమ్కేఐలను వినియోగిస్తుంది. వీటిని కూడా ఆధునికీకరించడం అవసరం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమల్లోకి రావడానికి పుష్కర కాలం పడుతుంది. అంతేకాక బడ్జెట్లో కూడా రక్షణ రంగానికి చాలా నామమాత్రంగానే కేటాయిస్తారు. ఈ అరకొర నిధులతో కొత్తవి కొనలేం. పాతవాటిని కూడా పూర్తిగా అప్‌గ్రేడ్ చేయలేం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సమయం కాదని తెలిపారు. రక్షణ వ్యవస్థల్ని ఆధునికీకరించాలని కోరారు. పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..! సరిహద్దుకు అటూ.. ఇటూ.. -
ప్రతీకారానికి సిద్ధమే
పోఖ్రాన్: ప్రభుత్వం ఆదేశించినట్లుగా ఉగ్ర ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ప్రకటించారు. పాకిస్తాన్, పుల్వామా దాడి గురించి నేరుగా మాట్లాడకుండా ఆయన ఇస్లామాబాద్ ప్రేరణతో పెచ్చరిల్లుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో శనివారం ‘వాయుశక్తి ఎక్సర్సైజ్’పేరిట ఒకరోజు వైమానిక దళ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధనోవా మాట్లాడుతూ ‘తన మిషన్లను సాకారం చేసుకోవడంలో వైమానిక దళం ఎప్పుడూ ముందుంటుంది. జాతీయ భద్రత, సార్వభౌమ పరిరక్షణలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు వైమానిక దళానికి ఉన్నాయని హామీ ఇస్తున్నా. యుద్ధాలు అరుదుగానే జరుగుతాయి. సంప్రదాయ యుద్ధంలో మనల్ని ఓడించలేమని శత్రువుకు తెలుసు. కాబట్టి మనకు ఊహించని, కొత్త రకపు ముప్పు ఎప్పుడూ ఉంటుంది. శత్రు భూభాగాల్లో మన సైనికుల్ని జారవిడవడం, విడిపించటం, ముష్కరులను శిక్షించడం కోసం ఈరోజు మన శక్తి, సామర్థ్యాల్ని ప్రదర్శిస్తున్నాం’ అని ధనోవా అన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పుల్వామా దాడి చోటుచేసుకున్న రెండు రోజుల తరువాత జరగడం గమనార్హం. వాయుశక్తి ఎక్సర్సైజ్కు ప్రణాళికలను ఇంతకుముందే రూపొందించామని, పుల్వామా దాడితో సంబంధంలేదని వైమానిక దళ వర్గాలు తెలిపాయి. అబ్బురపరచిన విన్యాసాలు.. ఉదయం నుంచి చీకటి పడే వరకు వైమానిక దళ విన్యాసాల ప్రదర్శన కొనసాగింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో పాటు మొత్తం 140 యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణి ప్రతిభాపాటవాల్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తమ ముందు నిర్దేశించిన లక్ష్యాల్ని కచ్చితత్వంతో ఢీకొట్టాయి. మిలిటరీ కసరత్తులో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, ఆకాశ్ క్షిపణిని మోహరించడం ఇదే తొలిసారి. అప్‌గ్రేడ్ చేసిన మిగ్–29 అనే యుద్ధ విమానాన్ని కూడా ఈసారి పరీక్షించారు. సుకోయ్–30, మిరేజ్–2000, జాగ్వార్, మిగ్–21 బైసన్, మిగ్–27, మిగ్–29, హెర్క్యూల్స్, ఏఎన్–32 విమానం తదితరాలు కూడా ఈ విన్యాసాల్లో కనువిందు చేశాయి. ముఖ్యంగా చీకటి పడిన తరువాత అంతిమ ఘట్టంలో ఏఎన్–32, సీ–132జె హర్క్యూల్స్ విమానాలు ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక దళ గౌరవ గ్రూప్ కెప్టెన్, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం!
-
పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం!
సర్వసన్నద్ధంగా ఉండాలని కమాండర్లకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆదేశం న్యూఢిల్లీ: మిలిటరీ అవసరాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్‌తో 10 రోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం చేసేందుకు వీలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) తన కమాండర్లను ఆదేశించింది. గతవారం న్యూఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా ఈ మేరకు కమాండర్లకు సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ‘ఒకవేళ పాకిస్థాన్‌తో పదిరోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం వస్తే సత్వరమే ఎదుర్కొనడానికి వీలుగా ఐఏఎఫ్ కమాండర్లు స్వరసన్నద్ధంగా ఉండాలని ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆదేశించారు. అత్యంత చురుకైన సన్నద్ధతతో, పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు’ అని ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి. తన అన్ని విభాగాల సన్నద్ధత ఎలా ఉందో తెలుపాలంటూ ఇప్పటికే డైరక్టరేట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్‌ఫెక్షన్‌కు ఆదేశాలు అందాయి. ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని, యుద్ధవిమానాలను పూర్తిస్థాయిలో ఆయుధాలు, క్షిపణులు, అలర్ట్ రాడర్ వ్యవస్థతో సర్వసన్నద్ధంగా ఉంచాలని సూచనలు అందాయి. -
ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం!
ఆయన భారత వైమానిక దళంలోనే అత్యున్నత అధికారి. విమానాలు నడిపించాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ, మన వైమానిక దళంలో అత్యంత పురాతనమైన విమానాలుగా పేరుపొందిన మిగ్-21 ఫైటర్ జెట్ నడిపి చూపించారు. అవును.. భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస్ ధనోవా స్వయంగా మిగ్-21 నడిపించారు. రాజస్థాన్‌లోని ఉత్తర్లాయ్ అనే ప్రాంతంలో ఈ తరహా విమానాన్ని ఆయన నడిపించారు. ఆ ప్రాంతంలో ఆయన మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. వైమానిక దళం చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆపరేషనల్ బేస్‌కు ఆయన వెళ్లడం ఇదే మొదటిసారి. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ధనోవా మిగ్ విమానాలు నడిపించారు. రాత్రిపూట చాలా సార్లు ఆయన ఈ విమానంలో వెళ్లి శత్రువుల మీద విరుచుకుపడ్డారు. దాంతో ఆయన వీరత్వానికి గాను ఆయనకు యుద్ధ సేవా మెడల్ కూడా లభించింది. ధనోవా కంటే ముందు ఎయిర్ చీఫ్ మార్షల్స్గా పనిచేసిన ఏవై టిప్నిస్, దిల్బాగ్ సింగ్ కూడా వీటిని నడిపించారు. -
ప్రధాని మోడీ వద్దకు ఎయిర్‌ఫోర్స్ చీఫ్
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరూప్ రాహా సోమవారం నాడు కలిశారు. ప్రధానిగా ఎవరు కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా త్రివిధ దళాల అధినేతలు ఆయనను కలవడం సంప్రదాయం. అందులో భాగంగానే నరేంద్రమోడీ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆయన వద్దకు వెళ్లారు. సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఈ సమావేశం జరిగింది. భారత వైమానిక దళం ఎంత సన్నద్ధంగా ఉంటుందన్న విషయాన్ని ప్రధానమంత్రితో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. తమకు ఏవేం అవసరాలున్నయన్న విషయాన్ని కొత్త ప్రధానికి వివరించేందుకు ముందుగానే వైమానిక దళం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకుని ఉంది. వివిధ రకాల యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కొత్తగా తీసుకోవాల్సి ఉండటం, ఇప్పటికి ఉన్నవి బాగా పాతబడిపోయి ఉండటంతో ఈ అవసరాలన్నింటినీ మోడీకి వివరించినట్లు సమాచారం. -
యువ సైనికులపైనే దేశరక్షణ
వాయుసేనాధిపతి బ్రౌన్ ఉద్ఘాటన దుండిగల్ వాయుసేన అకాడమీలో ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్ దేశరక్షణ వ్యవస్థ యువ సైనికులపైనే ఆధారపడి ఉందని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బ్రౌన్ అన్నారు. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఉదయం జరిగింది. ఇదే అకాడమీలో శిక్షణ పొంది 1972, జూన్14న బయటకు వచ్చిన బ్రౌన్ తాజా పాసింగ్ అవుట్ పరేడ్‌కు వాయుసేన చీఫ్‌గా హాజరు కావడం విశేషం. కింది ఉద్యోగుల పట్ల, వాయుసేన పతాకం పట్ల, దేశం పట్ల నిజాయతీగా ఉండాలని యువ అధికారులకు బ్రౌన్ సూచించారు. దేశరక్షణలో భాగస్వాములై.. తమ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయిం చారు. మొత్తం 202 మంది శిక్షణ పూర్తి చేసుకోగా ఇందులో 37 మంది మహిళలున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా.. బ్రౌన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి ఫ్లాగ్‌లను బహూకరించారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవీణ్‌కుమార్‌ను ‘స్వార్డ్ ఆఫ్ హానర్’గా గుర్తించి అతనికి ఖడ్గధారణ చేశారు. గ్రౌండ్ డ్యూటీలో ప్రతిభ చూపిన విపిన్‌కుమార్ , నావిగేషన్ కోర్సులో ప్రతిభ కనబరిచిన ఫిర్దోస్ అహ్మద్‌దార్‌లకుజ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వాయుసేనలో శిక్షణ పొందిన అధికారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో చేసిన సాహసోపేత ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ పరమ్‌జిత్ సింగ్ గిల్, ఎయిర్ మార్షల్ ఆర్జీ బుర్లీతోపాటు వాయుసేన అకాడమీ అధికారులు, కేడెట్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.