
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం నేషనల్ హీరోగా నీరాజనాలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంతోష సమయంలో అభినందన్ పేరిట మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని నేల కూల్చిన తొలి ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ అరుదైన ఘనత సాధించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చడం సాహసోపేతమైన చర్య అని ఆయన కితాబునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మిగ్-21 బైసన్ అత్యాధునిక ఫైటర్ జెట్టే అయినా.. ఎఫ్-16కు ఇది సాటిరాదు. ఎఫ్-16కు ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్‌గా పేరుంది. అయితే మిగ్-21 బైసన్ నడిపే పైలట్లు తమ నైపుణ్యం పెంచుకునేందుకు అప్పుడప్పుడూ మిరాజ్ - 2000, మిత్ర దేశాల ఎఫ్-16 విమానాలతో శిక్షణ పొందుతుంటారు. అలా అభినందన్ పొందిన శిక్షణ ఎఫ్-16ను కూల్చేందుకు పనికొచ్చింది. క్షణాల్లో జరిగిపోయే గగనతల యుద్ధ సమయంలో ప్రత్యర్థి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో మన పైలట్లు ఎల్వోసీ దాటి వెళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభినందన్.. ఎఫ్-16 జెట్‌ను కూల్చడం సాధారణ విషయమేం’ కాదని ఆయన ప్రశంసించారు.
అంతేకాక ‘పాకిస్థాన్ ఎఫ్-16 విమానాల్ని పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి కొన్నది. ఐఏఎఫ్ కూడా ఎప్పట్నుంచో 100 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. కానీ, ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వంతో రక్షణ శాఖ సామాగ్రి కొనుగోలుకు చాలా ఆలస్యం అవుతోంది. అంతేకాక ఐఏఎఫ్ రెండు దశాబ్దాలుగా ఎస్‌యూ - 30 ఎమ్‌కేఐలను వినియోగిస్తుంది. వీటిని కూడా ఆధునికీకరించడం అవసరం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమల్లోకి రావడానికి పుష్కర కాలం పడుతుంది. అంతేకాక బడ్జెట్‌లో కూడా రక్షణ రంగానికి చాలా నామమాత్రంగానే కేటాయిస్తారు. ఈ అరకొర నిధులతో కొత్తవి కొనలేం. పాతవాటిని కూడా పూర్తిగా అప్‌గ్రేడ్ చేయలేం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సమయం కాదని తెలిపారు. రక్షణ వ్యవస్థల్ని ఆధునికీకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment