F-16
-
అరుదైన ఘనత సాధించిన అభినందన్
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం నేషనల్ హీరోగా నీరాజనాలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంతోష సమయంలో అభినందన్ పేరిట మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని నేల కూల్చిన తొలి ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ అరుదైన ఘనత సాధించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చడం సాహసోపేతమైన చర్య అని ఆయన కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మిగ్-21 బైసన్ అత్యాధునిక ఫైటర్ జెట్టే అయినా.. ఎఫ్-16కు ఇది సాటిరాదు. ఎఫ్-16కు ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్‌గా పేరుంది. అయితే మిగ్-21 బైసన్ నడిపే పైలట్లు తమ నైపుణ్యం పెంచుకునేందుకు అప్పుడప్పుడూ మిరాజ్ - 2000, మిత్ర దేశాల ఎఫ్-16 విమానాలతో శిక్షణ పొందుతుంటారు. అలా అభినందన్ పొందిన శిక్షణ ఎఫ్-16ను కూల్చేందుకు పనికొచ్చింది. క్షణాల్లో జరిగిపోయే గగనతల యుద్ధ సమయంలో ప్రత్యర్థి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో మన పైలట్లు ఎల్వోసీ దాటి వెళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభినందన్.. ఎఫ్-16 జెట్‌ను కూల్చడం సాధారణ విషయమేం’ కాదని ఆయన ప్రశంసించారు. అంతేకాక ‘పాకిస్థాన్ ఎఫ్-16 విమానాల్ని పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి కొన్నది. ఐఏఎఫ్ కూడా ఎప్పట్నుంచో 100 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. కానీ, ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వంతో రక్షణ శాఖ సామాగ్రి కొనుగోలుకు చాలా ఆలస్యం అవుతోంది. అంతేకాక ఐఏఎఫ్ రెండు దశాబ్దాలుగా ఎస్‌యూ - 30 ఎమ్కేఐలను వినియోగిస్తుంది. వీటిని కూడా ఆధునికీకరించడం అవసరం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమల్లోకి రావడానికి పుష్కర కాలం పడుతుంది. అంతేకాక బడ్జెట్లో కూడా రక్షణ రంగానికి చాలా నామమాత్రంగానే కేటాయిస్తారు. ఈ అరకొర నిధులతో కొత్తవి కొనలేం. పాతవాటిని కూడా పూర్తిగా అప్‌గ్రేడ్ చేయలేం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సమయం కాదని తెలిపారు. రక్షణ వ్యవస్థల్ని ఆధునికీకరించాలని కోరారు. పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..! సరిహద్దుకు అటూ.. ఇటూ.. -
పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!
సాక్షి, న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ప్రత్యర్థి దాడులను ఐఏఎఫ్ దీటుగా తిప్పి కొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 విమానాన్ని మనోళ్లు కూల్చేశారు. పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను కూల్చడానికి అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించాడు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చింది. యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్‌ను జెనీవా ఒప్పందంలో భాగంగా శుక్రవారం రాత్రి పాకిస్తాన్ భారత్‌కు అప్పగించింది. (అభినందన్ ఆగయా..) ఆర్-73 మిస్సైల్.. లక్ష్యం గురి తప్పదు.. ఆర్-73 మిస్సైల్.. ఏ సమయంలోనైనా ప్రత్యర్థి విమానాలపై దాడి చేయగలదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. దశ దిశా మార్చుకుని కావాల్సిన లక్ష్యాన్ని ఛేదించగలదు. ఏరో డైనమిక్ సిస్టమ్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. దాంతో ఇది సమర్థవంతంగా పనిచేసి ప్రత్యర్థి యుద్ధ విమానలను నేల కూల్చగలదు. గంటకు 2500 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విమాలను.. 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ వేటాడగలదు. (ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!) 58 ఏళ్ల వయసు..అయినా భారత వైమానిక దళంలో సేవలందిస్తున్న మిగ్-21యుద్ధ విమానం వయస్సు సుమారు 58 సంవత్సరాలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రతిష్టాత్మక హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. 1961లో తొలిసారిగా భారత వైమానిక దళంలో చేరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపురేఖలు మార్చుకుంది. ఐఏఎఫ్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా అందుబాటులో ఉంది. మిగ్- 21 దెబ్బకు పేలిపోయిన ఎఫ్-16తో పోల్చుకుంటే.. దాని సత్తా తక్కువే. మిగ్ పూర్తి పేరు.. మికోయన్-గురేవిచ్. మొదట్లో రష్యా సంయుక్త రాష్ట్రాలు దీన్ని డిజైన్ చేశాయి. రష్యా నుంచి అనుమతి పొందిన హెచ్ఏఎల్ మిగ్-21 ఎఫ్ ఎల్, మిగ్-21ఎం, మిగ్-21 బైసన్ రకాలను రూపొందించింది. ఇక పాక్ వైమానిక దళంలో ఉన్న ఎఫ్-16 విమానలకు వైపర్ యుద్ధ విమానాలు అని కూడా అంటారు. 1980 ప్రాంతంలో వీటిని పాక్ దిగుమతి చేసుకుంది. -
అమెరికా రాయితీ ఇవ్వకపోతే కొనుగోలు కష్టమేః పాకిస్తాన్
వాషింగ్టన్ః ఎఫ్-16 యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని, ఎటువంటి రాయితీలు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. అవసరమైతే పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి విమానాలు కొనుగోలు చేయొచ్చని సలహా కూడ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కూడ తన నిర్ణయం మార్చుకునేట్లు కనిపిస్తోంది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా రాయితీలు ఇవ్వని పక్షంలో అంత పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి విమానాలను కొనుగోలు చేయడం కష్టమేనని పాకిస్తాన్ విదేశీ వ్యవహారల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో తాము వాడే ఎఫ్-17 థండర్ జెట్స్ స్థానంలో ప్రభావవంతమైన ఎఫ్-16 కు ప్రాధాన్యతనిచ్చామని అజీజ్ తెలిపినట్లు ఓ పాకిస్తానీ వార్తా పత్రిక తెలిపింది. చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ద్వారా అభివృద్ధి చేసిన జెఎఫ్-17 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఇకపై వెన్నెముకగా మారుతుందని కూడ ఆయన అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికానుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనేందుకు ఇంతకు ముందు పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న ప్రకారం అమెరికా రాయితీని కల్పించి ఉంటే... ఎనిమిది విమానాలకు పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి అమెరికాకు 270 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోలుకు కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ, విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్ నిధులను వినియోగించడంపై అమెరికా సెనేటర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి తారుమారైంది. -
'డబ్బంతా చెల్లిస్తేనే పాక్ ఫైటర్ జెట్స్ ఇస్తాం'
న్యూయార్క్: పాకిస్థాన్‌కు విక్రయించనున్న ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల విషయాల్లో సబ్సిడీకి అనుమతించబోమని అమెరికా స్పష్టం చేసింది. పూర్తి స్థాయి చెల్లింపులు చేస్తేనే ఆ విమానాలు అందించగలమని చెప్పింది. సోమవారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఇప్పటికీ ఆ విమానాలను కొనుక్కోవచ్చని అయితే పూర్తి స్థాయి చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. మొత్తం 699.04 మిలియన్ల డాలర్లు ఇచ్చేసి తీసుకోవచ్చని తెలిపింది. పెంటగాన్ వెల్లడించిన ఓ నోటీసు ప్రకారం 42శాతం సబ్సిడీని పాకిస్థాన్ కోరింది. తమ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ముఖ్యమంగా వాయవ్య పాకిస్థాన్ లోని ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు తమకు సహాయం చేయాల్సిందిగా అందులో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను విక్రయించాల్సిందిగా పాక్ అమెరికాను కోరగా అందుకు ఆ దేశం అనుమతించింది. అయితే, సబ్సిడీ కోరిన నేపథ్యంలో పాకిస్థాన్ అవసరం అయితే, జాతీయ స్థాయి నిధులను వెచ్చించి కొనుగోలు చేయొచ్చని సూచించినట్లు అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.