వాషింగ్టన్ః ఎఫ్-16 యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని, ఎటువంటి రాయితీలు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. అవసరమైతే పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి విమానాలు కొనుగోలు చేయొచ్చని సలహా కూడ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కూడ తన నిర్ణయం మార్చుకునేట్లు కనిపిస్తోంది.
ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా రాయితీలు ఇవ్వని పక్షంలో అంత పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి విమానాలను కొనుగోలు చేయడం కష్టమేనని పాకిస్తాన్ విదేశీ వ్యవహారల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో తాము వాడే ఎఫ్-17 థండర్ జెట్స్ స్థానంలో ప్రభావవంతమైన ఎఫ్-16 కు ప్రాధాన్యతనిచ్చామని అజీజ్ తెలిపినట్లు ఓ పాకిస్తానీ వార్తా పత్రిక తెలిపింది. చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ద్వారా అభివృద్ధి చేసిన జెఎఫ్-17 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఇకపై వెన్నెముకగా మారుతుందని కూడ ఆయన అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది.
అమెరికానుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనేందుకు ఇంతకు ముందు పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న ప్రకారం అమెరికా రాయితీని కల్పించి ఉంటే... ఎనిమిది విమానాలకు పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి అమెరికాకు 270 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోలుకు కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ, విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్ నిధులను వినియోగించడంపై అమెరికా సెనేటర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి తారుమారైంది.