'డబ్బంతా చెల్లిస్తేనే పాక్ ఫైటర్ జెట్స్ ఇస్తాం'
న్యూయార్క్: పాకిస్థాన్కు విక్రయించనున్న ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల విషయాల్లో సబ్సిడీకి అనుమతించబోమని అమెరికా స్పష్టం చేసింది. పూర్తి స్థాయి చెల్లింపులు చేస్తేనే ఆ విమానాలు అందించగలమని చెప్పింది. సోమవారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఇప్పటికీ ఆ విమానాలను కొనుక్కోవచ్చని అయితే పూర్తి స్థాయి చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. మొత్తం 699.04 మిలియన్ల డాలర్లు ఇచ్చేసి తీసుకోవచ్చని తెలిపింది.
పెంటగాన్ వెల్లడించిన ఓ నోటీసు ప్రకారం 42శాతం సబ్సిడీని పాకిస్థాన్ కోరింది. తమ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ముఖ్యమంగా వాయవ్య పాకిస్థాన్ లోని ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు తమకు సహాయం చేయాల్సిందిగా అందులో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను విక్రయించాల్సిందిగా పాక్ అమెరికాను కోరగా అందుకు ఆ దేశం అనుమతించింది. అయితే, సబ్సిడీ కోరిన నేపథ్యంలో పాకిస్థాన్ అవసరం అయితే, జాతీయ స్థాయి నిధులను వెచ్చించి కొనుగోలు చేయొచ్చని సూచించినట్లు అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.