న్యూఢిల్లీ: పెరుగుతున్న వైమానిక దళ అవసరాలకు త్వరలో దళంలో చేరనున్న రఫేల్ యుద్ధవిమానాలు సరిపోవని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా పేర్కొన్నారు. దేశీయంగా యుద్ధ విమానాలు ఇతర ఆధునిక ఆయుధాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలు త్వరలో వైమానిక దళంలో సేవలందించనున్న విషయం తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడుల తరువాత వైమానిక దళం అందించగల సేవలపై ఉన్న అభిప్రాయంలో కీలక మార్పు వచ్చిందన్నారు. సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ శుక్రవారం నిర్వహించిన ‘ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో’ సదస్సులో బదౌరియా ప్రసంగించారు. ‘36 రఫేల్ యుద్ధ విమానాలు మన అవసరాలకు సరిపోవు. మనం దేశీయంగా తయారు చేసిన అస్త్ర క్షిపణిని ఎస్‌యూ 30, మిగ్ 29 వంటి ఇతర ఫైటర్ జెట్‌పై ఉపయోగించగలగాలి. అప్పుడే మన వైమానిక శక్తి మరింత పెరుగుతుంది’ అన్నారు. అయితే, ఇతర క్షిపణులను ప్రయోగించగల యుద్ధ విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడాలన్న ప్రభుత్వ నిర్ణయం సాహసోపేతమైందన్నారు. మన వైమానిక దళం లక్ష్యాలను కచ్చితంగా చేధించిందన్నారు. మన దాడిపై స్పందించేందుకు పాకిస్తాన్ వైమానిక దళానికి 30 గంటల సమయం పట్టిందని బదౌరియా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment