యువ సైనికులపైనే దేశరక్షణ
వాయుసేనాధిపతి బ్రౌన్ ఉద్ఘాటన
దుండిగల్ వాయుసేన అకాడమీలో ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్
దేశరక్షణ వ్యవస్థ యువ సైనికులపైనే ఆధారపడి ఉందని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బ్రౌన్ అన్నారు. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఉదయం జరిగింది. ఇదే అకాడమీలో శిక్షణ పొంది 1972, జూన్14న బయటకు వచ్చిన బ్రౌన్ తాజా పాసింగ్ అవుట్ పరేడ్‌కు వాయుసేన చీఫ్‌గా హాజరు కావడం విశేషం. కింది ఉద్యోగుల పట్ల, వాయుసేన పతాకం పట్ల, దేశం పట్ల నిజాయతీగా ఉండాలని యువ అధికారులకు బ్రౌన్ సూచించారు. దేశరక్షణలో భాగస్వాములై.. తమ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయిం చారు. మొత్తం 202 మంది శిక్షణ పూర్తి చేసుకోగా ఇందులో 37 మంది మహిళలున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా.. బ్రౌన్ గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం వారికి ఫ్లాగ్‌లను బహూకరించారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవీణ్‌కుమార్‌ను ‘స్వార్డ్ ఆఫ్ హానర్’గా గుర్తించి అతనికి ఖడ్గధారణ చేశారు. గ్రౌండ్ డ్యూటీలో ప్రతిభ చూపిన విపిన్‌కుమార్ , నావిగేషన్ కోర్సులో ప్రతిభ కనబరిచిన ఫిర్దోస్ అహ్మద్‌దార్‌లకుజ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వాయుసేనలో శిక్షణ పొందిన అధికారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో చేసిన సాహసోపేత ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ పరమ్‌జిత్ సింగ్ గిల్, ఎయిర్ మార్షల్ ఆర్‌జీ బుర్లీతోపాటు వాయుసేన అకాడమీ అధికారులు, కేడెట్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.