
షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌లో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తంచేశారు. దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడే బాధ్యత కలిగిన కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు కీలక పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే అధికార బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని అర్థం చేసుకోవచ్చని అన్నారు.
దళితుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని గుర్తుచేశారు. కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చడం రాజ్యాంగంపై, దళితుల సామాజిక హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని, కమిషన్‌లో ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ అచేతనంగా మిగిలిపోతే దళితులు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదులపై ఎవరు స్పందించారని ప్రశ్నించారు.