కోటా విధానం మారదు
ప్రధాని మోదీ స్పష్టీకరణ
♦ దళితుల హక్కును ఎవరూ లాగేసుకోలేరు
♦ గిట్టనివారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
♦ అంబేడ్కర్ పీడితవర్గాల గొంతుక, ఆయన విశ్వమానవుడు
న్యూఢిల్లీ: దళితుల, బడుగు వర్గాల రిజర్వేషన్ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. వారి హక్కును ఎవరూ లాగేసుకోలేరన్నారు. దీనిపై గిట్టనివారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్లవారి హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్‌కింగ్‌తో రా జ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను పోల్చా రు. మోదీ సోమవారమిక్కడ అంబేడ్కర్ జాతీయ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం స్మారక ఉపన్యాసం చేశారు. ‘మేం అధికారంలో ఉన్నంత వరకు దళితులు, బడుగువర్గాల రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పూ వాటిల్లదు.
అయితే రాజకీయాలు చేసే వారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడూ కోటాను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణాలను బీజేపీ చాలా ఏళ్లు పాలించినా కోటాకు కోత వేయలేదన్నారు. తానిదివరకే చెప్పినట్లు.. అంబేడ్కరే మళ్లీ వచ్చినా మీ హక్కును లాగేసుకోలేరని చెప్పారు. దేశంలో అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించడానికి 60 ఏళ్లు ఎందుకు పట్టింద న్నారు. ఆస్తిలోనూ, ఇతర చాలా అంశాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన హిందూ కోడ్ బిల్లుకు మద్దతు లేకపోవడంతో నెహ్రూ కేబినెట్లో న్యాయ మంత్రిగా ఉన్న అంబేడ్కర్పదవికి రాజీనామా చేశారన్నారు. ఇది ప్రజలకు తెలియకుండా వక్రీకరించారన్నారు.
మహిళలకు సమాన హక్కులేనప్పుడు తాను మంత్రివర్గంలో ఉండలేనని చెప్పారని, దీంతో ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను దళితులపాలిట క్రీస్తు అని మాత్రమే చెబితే అది అన్యాయమే అవుతుందని, ఆయన అన్నిరకాల పీడిత వర్గాల గొంతుకగా ఉన్నారని, ఆయన విశ్వమానవుడు అని పేర్కొ న్నారు. దేశ సముద్రమార్గ బలంపై అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగానే పార్లమెంటులో జలమార్గాల బిల్లును ప్రవేశపెట్టామన్నారు. 2014లో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావిస్తూ... ‘మేమిక్కడ ఉండటం వారికి ఇష్టం లేదు. మ మ్మల్ని ఇక్కడ చూస్తే వారికి జ్వరం వస్తుంది. నియంత్రణ కోల్పోతారు.అబద్ధాలు చెబుతారు’ అని అన్నారు. ఇప్పటిదాకా ఆరుసార్లు అంబేడ్కర్ స్మారకోన్యాసం నిర్వహిస్తే ప్రధాని ప్రసంగించడం ఇదే మొదటిసారన్నారు.
అంబేడ్కర్‌కు అన్యాయం
అంబేడ్కర్‌కు ఎంతటి అన్యాయం జరిగిందో, అది ఎవరు చేశారో అందరికీ తెలుసని మోదీ అన్నారు. ‘ముంబైలోని ఇందు మిల్లుపై నిర్ణయాన్ని గత ప్రభుత్వాలు ఇంతకాలం ఎందుకు పెండింగ్‌లో పెట్టాయి. లండన్‌లో ఆయన నివసించిన ప్రాంతం విషయంలోనూ అదే జరిగింది. ఇన్నాళ్లు వారేం చేయకపోగా మమ్మల్నే నిందిస్తున్నారు. మా తర్వాత అధికారంలోకి వచ్చే వారి మనసుల్లో అంబేడ్కర్ ఉండరు. అందుకే అలీపూర్ రోడ్డులో అంబేడ్కర్ నివసించిన ఇంటిని స్మారకంగా నిర్మించే కార్యాన్ని 2018 మార్చి నాటికల్లా పూర్తిచేస్తాం’ అని అన్నారు. 2018, ఏప్రిల్ 14న ఈ స్మారకాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ చెప్పగా, సభికులు భారత్ మాతా కీ జై అని నినదించారు. ఈ భవనం ఢిల్లీలో విశిష్టంగా నిలిచిపోతుందని, ప్రపంచంలోనూ ఒక ఐకాన్‌గా నిలుస్తుందన్నారు. దళితుల మాదిరే అగ్రకులాల వారిని కూడా అంబేడ్కర్ తనవారిగానే భావించారన్నారు.