‘సంక్షేమం’ మూత!
మూతపడనున్న 26 హాస్టళ్లు
ఆగస్టు 7 డెడ్‌లైన్
జిల్లాలో బాలబాలికలకు తప్పని ఇబ్బందులు
గురుకులంలో ఖాళీ లేని సీట్లు
ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవితవ్యం
తల్లిదండ్రుల్లో ఆందోళన
మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలను కుదించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో 26 హాస్టళ్లను మూసివేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆగస్టు ఏడో తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 50 మందిలోపు పిల్లలు ఉన్న, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలన్నింటినీ వెంటనే మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీనే దీనికి సంబంధించి జీవో నంబరు 45ను ప్రభుత్వం జారీ చేయగా, తాజా ఆదేశాలతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 146 హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 81 బాలురు, 65 బాలికల వసతి గృహాలు. మొత్తంగా 10,376 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ుదించేందుకు రంగం సిద్ధం చేయటంతో జిల్లాలో 15 బాలుర, 11 బాలికల వసతి గృహాలను మూసివేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 134 మంది బాలురు, 221 మంది బాలికలను ప్రభుత్వ వసతి గృహాల నుంచి బయటకు పంపే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
గురుకులాల్లో సీట్లు ఏవీ?
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ప్రాంతంలోని వసతి గృహాన్ని మూసివేస్తే సమీపంలోని గురుకుల పాఠశాలలో ఆ విద్యార్థులను చేర్చాల్సి ఉంది. పాఠశాలలు జూన్ 15న ప్రారంభం కాగా ఇప్పటికే దాదాపు 45 రోజులు గడిచాయి. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్చాలంటే ముందస్తుగా ప్రవేశ పరీక్ష నిర్వహించి అనంతరమే చేర్చుకుంటారు. ఇవేమీ పట్టించుకోకుండా గుడ్డిగా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 14 గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో నాలుగు బాలుర, 10 బాలికల పాఠశాలలు. తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లో పది గురుకుల పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో చేర్చడానికి వీలు లేకుండా పోయిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి, రెండు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించినా ఎంతమంది అక్కడ ఉంటారనే అంశంపై అనుమానాలు ఉన్నాయి.
మూతబడే హాస్టళ్లు ఇవే...
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాలకు సంబంధించి పెడన, మచిలీపట్నం నంబర్-8, 10, చల్లపల్లి-3, మానికొండ, పామర్రు, అడ్డాడ, ఆరుతెగలపాడు, పమిడిముక్కల, సింగ్‌నగర్, గుడివాడ-10, తాడంకి, తెన్నేరు, పెనమలూరు, వేలేరులలోని వసతి గృహాలను ఇప్పటికే మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా విద్యార్థులను దగ్గరలోని రుద్రవరం, పామర్రు, తిరువూరు, కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలల్లో చేరాలని కోరుతున్నారు. ఈ గురుకులాల్లో సీట్లు లేకపోవటంతో 134 మంది బాలురలో అధిక శాతం మంది పాఠశాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
బాలికల విభాగంలో ప్రకాష్‌నగర్, క్రీస్తురాజుపురం, గొల్లనపల్లి, మోటూరు, గుడివాడ-3, 11, నందిగామ జనరల్, వెలగలేరు, నందివాడ, చెన్నూరు, పునాదిపాడు వసతిగృహాలను మూసివేస్తున్నామని, దగ్గరలోని గురుకులాలు, ప్రత్యేక హాస్టళ్లలో చేర్చుతామని చెప్పటమే తప్ప కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో వసతి గృహాల్లో ఉన్న 231 మంది బాలికల విద్య ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వం వసతి గృహాలను మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం, ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులను గురుకులాల్లో చేర్చేందుకు అవకాశం లేకపోవటం తదితర కారణాలతో అధికారులు సతమతమవుతున్నారు. ఉన్న వసతి గృహాలను తొలగిస్తే పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.