కారెం నియామకంపై వివరణ ఇవ్వండి
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శులతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. అలాగే శివాజీ నియామకానికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయవాది జె.ప్రసాద్‌బాబు, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు.
ఐక్యతతోనే మాల, మాదిగల అభివృద్ధి: రావెల
సాక్షి, విజయవాడ బ్యూరో: ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగలు కలసి ముందుకు సాగితేనే అభివృద్ధి సాధిస్తామని, విడిపోతే పడిపోతామని మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. విజయవాడలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించే బ్యాంకర్లను జైళ్లో పెట్టించి రుణాలు ఇప్పిస్తానని చెప్పారు. కాగా, కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.