ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఎన్నిక చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఆయన ఎంపిక తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆయన కేవలం మాలమహానాడు అధ్యక్షుడు మాత్రమేనని, ఆయనను ఇలాంటి కమిషన్‌కు ఎంపిక చేయడం ఏంటన్న వాదనలు వినిపించాయి.
ఇంత ముఖ్యమైన నియామకం చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చి, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని వాటిలోంచి ఎంపిక చేయాలని కోర్టు తెలిపింది. అసలు ఈ పదవికి అర్హతలు ఏంటన్న విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు విధించలేదు. ఎవరి నుంచి దరఖాస్తులు తీసుకోకుండా ముఖ్యమైన పదవికి చైర్మన్‌గా నియమించడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో కారెం శివాజీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం హైకోర్టు కొట్టేసింది. సమర్థుడైన మరో వ్యక్తిని నియమించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో అప్పీలుకు వెళ్లడానికి సైతం అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగిందని తెలిపింది.