కారెం శివాజీకి మళ్లీ చుక్కెదురు
హైదరాబాద్ : పదవి విషయంలో కారెం శివాజీకి హైకోర్టులో మళ్లీ చుక్కెదురు అయింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎంపిక నిబంధనలకు విరుద్ధం అంటూ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా ఎస్‌సీ, ఎస్‌టీ చైర్మన్‌గా కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 13న జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది జె.ప్రసాద్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ రామచంద్రరావు తీర్పునిస్తూ కారెం శివాజీ నియామకాన్ని రద్దు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు కారెం శివాజీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.