ఇప్పటికీ అనేక గ్రామాల్లో అంటరానితనం ఉందని, దీన్ని రూపుమాపాలంటే ఉన్నత విద్య అభ్యసించడమే మార్గమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం కింద విదే శాల్లో విద్యనభ్యశించేందుకు ఎంపికైన విద్యార్థులతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి రావెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్, పీజీ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధి పథకం మంచి అవకాశమని, దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ పథకం ద్వారా ఉన్నతులుగా మారటమే కాకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ కుటుంబ నేపథ్యాలను వివరించారు. కాగా, ఇప్పటివరకు ఈ పథకం కింద 190 మంది విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లారు. ఇప్పుడు మరో 21 మంది విద్యార్థులు వెళ్లనున్నారు. ఈ పథకానికి ఎంపికైన వారిలో అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 38 మంది, గుంటూరు నుంచి 48, ప్రకాశం నుంచి 26 మంది విద్యార్థులున్నారు. ఇంజనీరింగ్‌తో పాటు పీజీ, పీహెచ్డీ, మేనేజ్‌మెంట్, ఫ్యూర్ సెన్సైస్, ఆర్ట్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్, ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా, నర్సింగ్ సర్టిఫికెట్ కోర్సులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు.