కలువాయి, న్యూస్‌లైన్: వరుస దాడులతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఏసీబీ అధికారులు ఈ సారి తమ దృష్టి సంక్షేమ వసతిగృహాలపై పెట్టారు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి నిధులు కాజేస్తున్నారని, మెనూ అమలు సక్రమంగా లేదని ఆరోపణలు రావడంతో కలువాయిలోని ఎస్సీ బాలుర వసతిగృహంపై సోమవారం రాత్రి దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు, ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, ఎం.కృపానందం తన సిబ్బందితో హాస్టల్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. రాత్రి విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని పరిశీలించారు. పలు అంశాలపై విద్యార్థులతో పాటు ట్యూటర్‌ను విచారించారు.
ఆ సమయంలో హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య, తదితర వివరాలను నమోదు చేసుకున్నారు. స్టాక్ రూంలోని సరుకుల నిల్వపై ఆరా తీశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల సమయంలో హాస్టల్ వార్డెన్ నాయక్ లేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్టల్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
69 మంది విద్యార్థులే ఉన్నారు: జె.భాస్కర్‌రావు, డీఎస్పీ
తనిఖీల అనంతరం డీఎస్పీ భాస్కర్‌రావు విలేకరులతో మాట్లాడారు. కలువాయితో పాటు ప్రకాశం జిల్లా గుడ్లూరులోని వసతి గృహాలను తనిఖీ చేశామన్నారు. ఈ హాస్టల్‌లో 123 మంది విద్యార్థులు ఉంటున్నట్లు రికార్డుల్లో పేర్కొనగా 69 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. శుక్రవారం వరకు మాత్రమే విద్యార్థులకు హాజరువేసి ఉన్నారని, 123 మందికి 120 మంది హాజరైనట్లు చూపారన్నారు. శని, ఆది, సోమవారాల్లో అసలు హాజరువేయలేదని చెప్పారు. హాస్టల్‌లో కనీస వసతులు లేవని, ఇక్కడి పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని వెల్లడించారు.
నేనే ఫిర్యాదు చేశా: గూడూరు పుల్లారెడ్డి, హాస్టల్ వాచ్‌మన్
వార్డెన్ నాయక్‌పై కలెక్టర్, ఎస్పీ, ఏసీబీ అధికారులకు తానే ఫిర్యాదు చేసినట్టు హాస్టల్ వాచ్‌మన్ గూడూరు పుల్లారెడ్డి విలేకర్లకు చెప్పారు. ఆయన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, భోజన మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై ప్రశ్నించినందుకు తనపై పిల్లలతో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టిస్తానని బెదిరించారని తెలిపారు. రూ.54 వేలు జీతం కూడా నిలిపివేయించారని వివరించారు.
పిల్లలు తక్కువ .. హాజరు ఎక్కువ
Published Tue, Feb 25 2014 3:34 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement