విద్యార్థులపై కేసులు సరికాదు
ఎస్‌ఎఫ్‌ఐ నగర సమితి ఉపాధ్యక్షుడు సుమంత్
గాంధీనగర్ :
వసతి గృహాల మూసివేతను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ నగర ఉపాధ్యక్షుడు సీహెచ్. సుమంత్ అన్నారు. ఈనెల 25న అలంకార్ సెంటర్‌లో ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసి అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన బుధవారం జరిగింది. సుమంత్ మాట్లాడుతూ హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. నిరసన ప్రదర్శనలో నగర నాయకులు దుర్గాప్రసాద్, ఏ మణికంఠ, బాబి, రాజు పాల్గొన్నారు.