కేయూలో పరిపాలన భవనం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు
కేయూ క్యాంపస్ (వరంగల్): కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన, హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, బీఎస్‌ఎఫ్, ఏబీఎస్‌ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
హాస్టళ్ల మరమ్మతులు పూర్తికాగానే హాస్టల్ సౌకర్యంతోపాటు ప్రత్యక్ష విద్యాబోధన ఉంటుందని రిజిస్ట్రార్ విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. మరమ్మతులు తొలుత ఈ నెల 7నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 16వరకు అని చెప్పారని, ఇంకా ఎన్నిరోజులు చేస్తారని రిజిస్ట్రార్‌తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ దశలో విద్యార్థులు పరిపాలనా భవనంలోనికి చొచ్చుకెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థులు ఆగ్రహంతో మొక్కల కుండీలను పగలగొట్టారు. రిజిస్ట్రార్ చాంబర్‌లోని కుర్చీలను ఎత్తిపడేశారు. చివరికి జూలై 4వతేదీ వరకు మరమ్మతులు పూర్తిచేసి హాస్టల్ వసతి కల్పిస్తామని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని రిజిస్ట్రార్ హామీనివ్వడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment