సాక్షి, వరంగల్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు పలు అంశాలపై బీజేపీ హన్మకొండలో ‘నిరుద్యోగ మార్చ్’ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా, నిరుద్యోగ మార్చ్‌కు పోలీసులు పలు నిబంధనలు విధించారు. కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వరకు కొన్ని షరతులకు కట్టుబడి నిర్వహించుకునేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం అనుమతిచ్చింది. దీంతో, సీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యలో సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్బంగా వరంగల్ కమిషనరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ తెలంగాణ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబానికో న్యాయం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకో న్యాయమా? అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలో మీ తప్పులేకుంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ ఎందుకు జరిపించడం లేదు. బీజేపీ 30 లక్షల యువత కోసం కొట్లాడుతోంది. విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి మాట్లాడలేదు. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ ఎప్పుడైనా అంబేడ్కర్ జయంతిలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు.
ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం టైమ్‌పాస్ చేస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో తప్పులు జరగడం లేదు. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నష్టపోయిన యువతకు రూ.లక్ష నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నిరుద్యోగ మార్చ్‌కు ఎవరూ రారు అని బీఆర్‌ఎస్ నేతలు అన్నారు. ఇప్పుడు రావంతా కంటివెలుగు ఆపరేషన్ చేసుకోవాలన్నారు. ఈ నిరుద్యోగ మార్చ్ ఆగదు. ఈనెల 21వ తేదీన పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్ ఉంటుంది. 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తుంది. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment