హాస్టళ్ల విలీనానికి నిరసనగా విద్యార్థుల ధర్నా
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పలు రకాల కారణాలతో విలీనం చేస్తే చూస్తు ఊరుకోబోమని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసఆచారి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాదిగా విద్యార్థులు సంక్షేమభవన్‌లో ధర్నా చేపట్టారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, మహేష్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస ఆచారి మాట్లాడుతూ.. జిల్లాలో 18 బీసీ, 23 ఎస్‌సీ వసతి గృహాలను విలీనం పేరుతో ప్రభుత్వం మూసివేసిందన్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో సంక్షేమ వసతి గృహాల్లో సీట్లు లభించక అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. పలు వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కూడా భోజనాలు పెట్టడం లేదని, నంద్యాల బొమ్మల సత్రం సమీపంలో ఉన్న బాలికల వసతి గృహాల్లో ఈ దుస్థితి నెలకొందన్నారు. ధర్నాలో ఏబీవీపీ జిల్లా నాయకులు సూర్య, ప్రశాంత్, శ్రీరామ్‌నాయక్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణు తదితరులు పాల్గొన్నారు.