కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సంక్షోభం నెలకొంది. చాలా చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మెనూ సంగతి పక్కనపెడితే.. ఇరుకు గదుల్లో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లా కేంద్రమైన కర్నూలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రెండు బాలుర వసతి గృహాలకు అద్దె భవనాలే దిక్కవగా.. తగినన్ని మరుగుదొడ్లు లేక విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. మంగళవారం అధికార యంత్రాంగం ప్రభుత్వ వసతిగృహాల్లో రాత్రి బస చేయనున్న దృష్ట్యా జిల్లాలో వీటి స్థితిగతులను పరిశీలిస్తే.. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 102 వసతి గృహాలు ఉండగా, 34 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 73 వసతి గృహాల్లో 25 అద్దె భవనాలే దిక్కయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్‌టెట్లు, బాత్‌రూంలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లోని బీసీ బాలురు వసతి గృహాలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. కనీసం గదులకు డోర్లు, కిటికీలకు తలుపులు కూడా లేకపోవడంతో దోమల వల్ల విద్యార్థులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ భవనాల్లోని వసతిగృహాల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పాణ్యం, కొట్టాలచెరువు, పాలెంచెరువు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో నిత్య నరకం అనుభవిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫ్లోరింగ్ దెబ్బతినింది. ఇక జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పెద్దపాడు, కోడుమూరు, ఎర్రగుంట్ల, మద్దికెర, ఉయ్యాలవాడ, డోన్, ఎమ్మిగనూరు(బాలికలు), ఎమ్మిగనూరు(బాలురు) ఎమ్మిగనూరు(అనంద నిలయం)తో పాటు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కోవెలకుంట్ల, ఆత్మకూరు వసతి గృహాలు ఎప్పుడు కూలుతాయో చెప్పలేని పరిస్థితి.
అందని నాలుగు జతల యూనిఫాం:
జిల్లాలోని పలు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇప్పటికీ ప్రభుత్వం సరఫరా చేయాల్సిన నాలుగు జతల యూనిఫాం అందకపోవడం గమనార్హం. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో 10,802 మంది, 73 బీసీ వసతి గృహాల్లో 10,662 మంది, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 10 వసతి గృహాలు, 10 ఆశ్రమ పాఠశాలల్లో 2215 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన నాలుగు జతల యూనిఫాం అందగా, బీసీ విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించి అందజేశారు. అయితే క్లాత్ సరఫరా కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు నేటికీ యూనిఫాం అందని పరిస్థితి నెలకొంది.
ప్రహరీ లేకపోవడంతో దినదిన గండం:
ఇప్పటికీ జిల్లాలోని చాలా హాస్టళ్లకు ప్రహరీలు కరువయ్యాయి. ఆలూరు పరిధిలోని ఆలూరు సమీకృత వసతి గృహం, ఆస్పరి, తెర్నేకల్, మద్దికెర, జొహరాపురం, ఆదోని పరిధిలోని ఆదోని నెంబర్-3, ఎమ్మిగనూరు ఆనందనిలయంతో పాటు నంద్యాల, కర్నూలు డివిజన్‌లోని పలు వసతి గృహాల విద్యార్థులు ప్రహరీ లేని కారణంగా రాత్రి వేళ భయాందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం లద్దగిరి బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థి పాముకాటుకు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వసతి.. దుర్గతి
Published Tue, Oct 29 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement