భగ్గుమన్న విద్యార్థిలోకం
భగ్గుమన్న విద్యార్థిలోకం
Published Tue, Jul 19 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
– హాస్టళ్ల విలీనానికి నిరసనగా సంక్షేమభవన్ ముట్టడి, బైఠాయింపు
– జీఓ ప్రతుల కాల్చివేత
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను విలీనం చేయడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. మంగళవారం మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేష్, బీసీ,ఎస్‌సీ,ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రామకష్ణ, అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి సంక్షేమభవన్‌ను ముట్టడించారు. హాస్టళ్లను ఎత్తివేయరాదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ పారదర్శకత, నాణ్యత పేరుతో ప్రభుత్వం సంక్షేమ వసతి గహాలను రద్దు చేయడంతో అనేక మంది గ్రామీణ∙విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులను రెసిడెన్సియల్ పాఠశాలల్లోకి ప్రవేశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుందని,అయితే వాటిల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేవని ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు లేఖ రాశారని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై ప్రేమ ఉంటే, ముందుగా రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించి, తర్వాత హాస్టళ్లను ఎత్తివేయాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో 18 బీసీ వసతి గహాలను విలీనం చేసిన ప్రభుత్వం తాజాగా 23 ఎస్‌సీ వసతి గహాలను విలీనం చేసేందుకు చర్యలు చేపట్టడం దురదష్టకరమన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సంక్షేమ వసతి గహాల్లోని విద్యార్థులు పదోతరగతిలో ఫలితాలు సాధిస్తున్నారని, తప్పుడు నిర్ణయాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు.వసతిగహాల ఎత్తివేత విషయంలో మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో విద్యార్థి నాయకులు సుధాకర్, చిన్న, రాధాకష్ణ, శివ, పవన్, చెన్న కేశవ్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement