హాస్టళ్ల విద్యార్థులకు అందని యూనిఫాం
Published Mon, Aug 1 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
నయీంనగర్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ హస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇంత వరకు యూనిఫాం అందలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటుతున్నా దుస్తులు ఇవ్వకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు వార్డెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన వారం రోజుల్లోనే మొత్తం నాలుగు జతల దుస్తులకు రెండు జతలైనా ఇస్తారు. అయితే, ఈసారి జిల్లాలోని 39 గిరిజన హస్టళ్లు, 39 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం 14వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తుల మాటేమో కానీ ఇంత వరకు కొలతలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంకా జిల్లాలోని 90 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని పది వేల మంది, 47 బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఏడు వేల మంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులకు సైతం ఇంత వరకు యూనిఫాంలు అందలేదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీల ద్వారా బట్టలు కుట్టించాలని జిల్లా దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరక్టర్ అంకం శంకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు బట్ట ఇచ్చి విద్యార్థుల దుస్తులు కుట్టిస్తారు. కానీ ఈసారి బట్ట కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికప్పుడు బట్ట కొనుగోలు చేసినా విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు కుట్టించి పంపిణీ చేసే వరకు రెండు నెలలైనా పడుతుంది. అంటే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక నాలుగు నెలల తర్వాతే విద్యార్థులకు యూనిఫాం అందే అవకాశముందని చెప్పొచ్చు.
Advertisement
Advertisement