ఇల్లెందు : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు సకల సౌకర్యాలు, మెరుగైన ఆహారం అందించాలి. ఇందుకోసం మార్కెట్‌లో సరుకుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి. కానీ గత మూడేళ్లుగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోగా విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం తగ్గిస్తోంది. మెస్ చార్జీలకు, మెనూ అమలుకు పొంతన లేకపోవడంతో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందని సంక్షేమాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం సక్రమంగా అందక విద్యార్థులు రక్తహీనతతో వ్యాధుల బారిన పడుతున్నారు. 3 నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రోజుకు రూ.25, 8, 9, 10 తరగతుల వారికి రూ.28.33 చొప్పున అందించాలి. ఇందులో రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బు సరిపోక టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎదిగే పిల్లలకు మజ్జిగ, పెరుగు అందని ద్రాక్షలా మారింది. కనీసం ఆదివారం కూడా వీరికి పిండి వంటల రుచి తెలియదు. మాంసాహారం ఊసే లేదు. అరటి పండు మినహా మిగితా ఏ పండూ వీరి దరి చేరదు. ఇక హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ఉప్మా, పులిహోర, కిచిడి, జీరా రైస్, ఎగ్ బిర్యానీ, ఆలుగడ్డ కూర, మధ్యాహ్నం భోజనం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు అందించాల్సి ఉంది. సాయంత్రం స్నాక్స్‌లో మూడు పీస్‌లు పల్లిపట్టీ, శనగలు 20 గ్రాములు, గ్రీన్ పీస్ 20 గ్రాములు, బొబ్బర్లు, శనివారం స్వీటు అందజేయాలి. రాత్రి పూట భోజనంలో అన్నం, కూరగాయలు, సాంబారు అందించాలి. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి కొరవడకుండా ఉండేందుకు విటమిన్లు కలిగిన ఆహారం ఇవ్వాలి.
‘ప్రత్యేక’ పాలనలో పెరగని చార్జీలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు విద్యాసంవత్సరాల్లో మెస్ చార్జీలు ఏమాత్రం పెంచలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి మెస్ చార్జీలు పెంచగా తదనంతరం అధికారం చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు చార్జీలు పెంచారు. ఆ తర్వాత నూతన రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తున్నప్పటికీ మెస్ చార్జీలు పెంచటం విస్మరించింది.
నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు..
నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను అంటుతుండగా విద్యార్థులకు అందించే మెస్ చార్జీలు మాత్రం యథాతథంగానే ఉంచారు. దీంతో హాస్టల్, ఆశ్రమ పాఠశాలల సంక్షేమాధికారులు(హెచ్‌డబ్ల్యూఓ) మూస పద్ధతిలో తక్కువ ధరకు లభించే కూరగాయలతో కాలం గడుపుతున్నారు. ఇక కాస్మొటిక్స్ చార్జీల కింద బాలురకు నెలకు రూ.50, బాలికలకు నెలకు రూ.75 చెల్లిస్తున్నారు. ఏళ్లు గడిచినా ఈ చార్జీలు మాత్రం పెంచటం లేదు. బాలురకు కనీసం రూ.100, బాలికలకు రూ.150 చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. బాలుర క్షౌ రానికి పైసా కూడా విడుదల చేయటం లేదు. జిల్లాలో 24 బాలుర, 22 బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 7, 721 మంది, బాలికలు 8,958 మంది ఉన్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 12 బాలుర హాస్టళ్లలో 1215 మంది, ఆరు బాలికల హాస్టళ్లలో 1305 మంది ఉన్నారు.
హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసించే వారికి 3 నుంచి 7వ తరగతి వరకు రోజుకు 475 గ్రాములు, 8, 9, 10 తరగతుల వారికి 525 గ్రాముల బియ్యం కేటాయించారు. 2015–16లో కిలో పప్పు ధర రూ.103 ఉండగా, నేడు అదే పప్పు ధర కిలో రూ.145కు సరఫరా చేస్తున్నారు. అయితే అప్పుడు ఒక్కో విద్యార్ధికి పప్పు 25 గ్రామలు ఇవ్వగా నేడు 35 గ్రాములు ఇస్తున్నారు. నాడు 25 గ్రాములకు రూ. 2.58 ఉండగా ప్రస్తుతం రూ. 5.08కి పెంచారు. ఒక్కో విద్యార్ధికి పప్పు 10 గ్రాములు పెంచగా రూ. 2.58 పైసల నుంచి రూ. 5.08 పైసలకు భారం పెంచారు. నూనె 15 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. చింతపండు 18 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. కారం పొడి 8 గ్రాముల నుంచి 6 గ్రాములకు తగ్గించారు. ఉప్మా రవ్వ ఒక విద్యార్థికి 40 గ్రాములు కేటాయించగా, నేడు 30కి తగ్గించారు. ఇలా ఒకటి, రెండు వస్తువులు పెంచినా మిగితా అన్నింటి పరిమాణం తగ్గించడం గమనార్హం.