
సంక్షామం
=హాస్టళ్లలో కొరవడిన మౌలిక సదుపాయాలు
=అద్దెభవనాల్లో అవస్థలు
=కటిక నేలపై నిద్ర
=తాగునీటికి, మరుగుదొడ్లకు ఇబ్బందులు
=తలుపులు, కిటికీల్లేక చలికి వణుకుతున్న విద్యార్థులు
సంక్షేమం అర్థతాత్పర్యాలు మారిపోతున్నాయి. సర్కారు మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. అభాగ్య విద్యార్థులకు అమ్మప్రేమ పంచాల్సిన హాస్టళ్లు ఈసురోమంటున్నాయి. పోషకాహార నిబంధనలు తుంగలో తొక్కి నీళ్ల చారు, పురుగుల అన్నం, నాసిరకం పప్పుతో సరిపెట్టే వార్డెన్లు లాభాలు మేస్తున్న చోట రక్తహీనత, ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. కిటికీలు తలుపులు లేనిఇరుకిరుకు అద్దె భవనాల్లో చలికి గజగజ వణుకుతున్నారు.
చోడవరం,న్యూస్‌లైన్ : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కొరవడుతున్నాయి. హాస్టళ్లలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు పలు ఇబ్బందులతో కాలం వెళ్లదీస్తున్నారు. మరో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా కొన్నింట ట్యూటర్ల కొరతతో విద్యాబోధన నామమాత్రంగా ఉంటోంది. జిల్లాలో 64 బీసీ,79 ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి పక్కా భవనాలులేవు. ఏళ్ల తరబడి గోవాడ బీసీ బాలిక వసతి గృహం, బీసీ బాలుర హాస్టల్, వడ్డాది, చోడవరం, అప్పలరాజుపురం, తురువోలు బీసీ బాలురు, చీడికాడ, రావికమతం బీసీ బాలికల వసతి గృహాలు అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నాయి.
వీటిల్లో అరకొరగా మరుగుదొడ్లతో ఇబ్బందులకు సొంత భవనాలు ఉన్న చోటే అరకొర వసతి ఉండగా ఇక అద్దెభవనాల్లో నడుస్తున్న హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకటి రెండు మరుగుదొడ్లు ఉండడం, వాడుక నీరుపోయే సౌకర్యం లేక విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. అసలే చలికాలం కావడంతో ప్రస్తుతం ఉన్న దుప్పట్లు వీరికి సరిపోవడం లేదు. చాపలు, దుప్పట్లు పరుచుకుని కటిక నేలపై నిద్రపోతున్నారు. మరో దుప్పటితో కప్పుకుంటున్నప్పటికీ కొన్ని హాస్టళ్లలో కిటికీలకు తలుపులు లేక చలి గాలి లోపలికి వచ్చి గజగజ వణికిపోతున్నారు.
అద్దె భవనంలో కొనసాగుతున్న చోడవరం బీసీ బాలురు హాస్టల్‌లో ఉన్న రెండు మరుగుదొడ్లు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. రావికమతం బీసీ బాలిక వసతి గృహంలో బోరు పనిచేయకపోవడంతో సమీపంలోని పబ్లిక్ కుళాయి నుంచి విద్యార్థులే నీటిని తెచ్చుకుంటున్నారు. కొరివాడ బీసీ హాస్టల్‌లో ఇక్కడ ఏడు గదులు ఉన్నాయి. వీటిలో ఐదింటికి తలుపులే లేవు. కాగడా పెట్టి వెదికినా ఇక్కడ మరుగుదొడ్లు కానరావు. చాలా హాస్టళ్లలో వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడంతో నిర్వహణంతా సిబ్బందే చేపడుతున్నారు. దీనివల్ల బాధ్యత కొరవడి మెనూ సక్రమంగా అమలు కావడం లేదు.
నీళ్ల చారు, పురుగుల అన్నం, నాసిరకం పప్పుతో సరిపెట్టే పరిస్థితి ఉంది. ఎస్సీ హాస్టళ్లలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఉండటంతోపాటు హాస్టళ్లలో తగిన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు పెద్దగా చేరడం లేదు. కాగా ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులకు ప్రత్యేక ట్యూటర్లను నియమించి టెన్త్ విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలి. కొన్నింట అర్హులైన ట్యూటర్లు లేక పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బీసీ హాస్టళ్లల్లో వసతి సమస్యలు ఎక్కువగా ఉంది.