ఈ రోజులు మాకొద్దు..
రేపటి పౌరులు ఈనాటి పాట్లు..!
గొంతు దిగని అన్నం. గుడ్డు ఇస్తే పరమాన్నం.
చిరిగిన యూనిఫాంలు. అరిగిన పాదరక్షలు.
పెండింగ్‌లో కాస్మొటిక్ చార్జీలు. పేరుకైనా ఇవ్వని
సెలూన్ చార్జీలు.
పెచ్చులూడే పైకప్పులు. వీపుకు గుచ్చుకునేలా గచ్చులు.
నీళ్లు లేని ట్యాంకులు. నీళ్లున్నా పనిచేయని బోర్లు.
నొక్కులు పడ్డ ట్రంకు పెట్టెలు. బొక్కలు పడ్డ బకెట్లు.
తలుపులు లేని కిటికీలు. మరుగు లేని మురికిదొడ్లు.
దుర్గంధం వెదజల్లే కాల్వలు. దురదపెట్టేలా కుట్టే దోమలు.
ఎప్పుడూ రోగాలు. అప్పుడప్పుడూ విషపురుగుల కాట్లు.
చలికాలంలో కనిపించని దుప్పట్లు. ఎండాకాలంలో పనిచేయని ఫ్యాన్లు.
అధికశాతం అద్దె భవనాలు. అగ్గిపెట్టెల్లాంటి గదులు... ఇవేనా వసతి గృహాలు? అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు! ఈ రోజులు మాకొద్దు అంటున్నారు.. నవసమాజాన్ని కాంక్షిస్తున్న రేపటిపౌరులు!!