Conservation of public lands
-
ప్రభుత్వ భూములపై ‘టెక్’ నిఘా!
ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ ప్రత్యేకంగా జియో ట్యాగింగ్‌కు నిర్ణయం తొలివిడతగా వెయ్యి స్థలాల గుర్తింపు రేపు జీహెచ్ఎంసీలో సిబ్బందికి శిక్షణ సిటీబ్యూరో : ప్రభుత్వ భూముల పరిరక్షణకు టెక్నాలజీని వాడుకోవాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఆక్రమణల నుంచి రక్షించడమే కాకుండా నిరంతరం ఆయా భూములను ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు వాటికి జియో ట్యాగింగ్ చేయాలని యోచిస్తోంది. తద్వారా అక్రమార్కులకు కళ్లెం వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రభుత్వ భూములను ట్యాగింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయని అంచనా వేస్తోంది. ఈ మేరకు కోట్లాది రూపాలయ విలువైన సుమారు వెయ్యి ప్రభుత్వ స్థలాల పార్శిల్స్‌లను అధికారులు గుర్తించారు. భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రతి పార్శిల్‌ను ట్యాగింగ్ చేస్తారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న జియో ట్యాగింగ్ విధానానికి రెవెన్యూ శాఖ కూడా సిద్ధమవుతోంది. జియో ట్యాగింగ్ చేసిన ప్రతి పార్శిల్ చిత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరిగి అప్డేట్ అవుతుంది. అధికార యంత్రాంగం జియో ట్యాగింగ్ అప్డేట్ పరిశీలించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం సిద్ధం చేస్తోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అలజడి, నిర్మాణం జరిగినా అప్డేట్ చిత్రం ద్వారా గుర్తించవచ్చు. తక్షణమే అడ్డుకునే చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. జియా ట్యాకింగ్ విధానంతో కోట్లాది రూపాయల విలువగల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు వీలుంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. వెయ్యి పార్శిల్స్‌కు ట్యాగింగ్ జిల్లా యంత్రాంగం తొలి విడతగా ప్రభుత్వ భూముల వెయ్యి పార్శిల్లను ట్యాగింగ్ చే యనుంది. దీని విలువ వందల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. నగరంలో మొత్తం మీద 54, 447 ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన 15,376, ఇతర శాఖలకు చెందిన 33,184, శిఖం, నాలా, కాల్వలకు సంబంధించిన 669, శ్మశాన వాటికలకు సంబంధించిన 961, ఇనామ్ 73, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 826, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 1188, ఎండోమెంట్‌కు చెందిన 1359, మిగులు భూమి 543 పార్శిల్స్ ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో వైపు సుమారు 1316 స్థలాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలి విడతగా మండలాల వారిగా ప్రాధాన్యత క్రమంలో విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి జియో ట్యాగింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు జియో ట్యాగింగ్‌పై శిక్షణ భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రభుత్వ భూముల ట్యాగింగ్‌పై రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జీహెచ్ఎంసీలో ఈనెల 17న గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు ట్యాగింగ్ శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతి మండల వీఆర్వో, సర్వేయర్లు విధిగా శిక్షణకు హజరయ్యే విధంగా తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే మండలాల వారిగా ల్యాప్‌టాప్‌లను అందించారు. ల్యాప్‌టాప్‌ల్లో జియో ట్యాగింగ్‌కు సంబంధించిన స్టాఫ్‌వేర్‌ను ఇన్స్టలేషన్ చేస్తారు. భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా పతి పార్శిల్‌ను ఎలా ట్యాగింగ్ చేయాలో అవగాహన కల్పిస్తారు. ప్రతి మండలంలో వార్డులు, బ్లాక్‌ల వారిగా ప్రభుత్వ భూముల పార్శిల్స్‌ను ట్యాగింగ్ చేసి మ్యాపింగ్‌లో భద్రపరుస్తారు. శాటిలైట్ ద్వారా భూముల ట్యాగింగ్ అప్డేట్లను పరిశీలిస్తారు. తొలివిడత గుర్తించిన పార్శిల్స్ జియో ట్యాగింగ్ పూర్తయితే రెండో విడతగా మరికొన్ని ప్రభుత్వ భూములను ట్యాగింగ్ చేస్తారు. ప్రభుత్వ భూములను రక్షిస్తాం ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో పరిరక్షిస్తాం. ప్రాధాన్యత గల సుమారు వెయ్యి స్థలాలను గుర్తించి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ట్యాగింగ్ చేసిన భూముల్లో ఎలాంటి కదలిక జరిగినా గుర్తించవచ్చు. తక్షణమే అడ్డుకునే చర్యలు చేపట్టవచ్చు. జియో ట్యాగింగ్‌లో మరింత అధునికత పరిజ్ఞానం రావచ్చు. దీంతో ప్రభుత్వ స్థలాల రక్షణకు మరింత దోహదపడే అవకాశం ఉంది. – ప్రశాంతి, జాయింట్ కలెక్టర్, హైదరాబాద్ -
పనితీరును మెరుగుపర్చుకోండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజించుకుని పనితీరుపై స్వయం మదింపు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, ప్రాథమిక వైద్య, ఆరోగ్యకేంద్రాలు, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయడం ద్వారా విధినిర్వహణలో నిబద్ధతను అలవర్చుకోవాలన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారుల పనితీరును ఆయన సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని, యంత్రాంగమంతా సమష్టిగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా కీలకమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి అధికారీ క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీహెచ్‌సీల తనిఖీ గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను మండల ప్రత్యేకాధికారులు ఆకస్మిక తనిఖీ చేశారని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రులకు హాజరుకాని సిబ్బంది, ఆస్పత్రుల నిర్వహణపై తనకు నివేదికలు పంపాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీదే శివారు మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. గురువారం ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ సంస్థలకు బదలాయించిన భూమిలో ప్రైవేటు సంస్థలకు ఏ మేర కేటాయించారు? నిరుపయోగంగా ఉన్న స్థలమెంత? అనే అంశంపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి ఇచ్చేందుకు క్లియర్ టైటిల్ భూములను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత ఆర్డీవో, తహసీల్దార్లదేనని స్పష్టం చేశారు. రేపు జిల్లాకు సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడి రాక ఈ నెల 28న కేంద్ర సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు విజయ్‌కుమార్ జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11:30 గంటలకు సఫాయి కర్మచారుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని ఆయన వివరించారు. -
అభివృద్ధిలో అసమానతలు తొలగిస్తా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతానని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఏఎస్ కెరీర్లో ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కలెక్టర్ పోస్టుతోనే సాధ్యమని, మరోసారి ప్రభుత్వం ఈ అవకాశం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు. కలెక్టర్ చెప్పిన మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. విలువైన అసైన్డ్, సీలింగ్ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తాం. శివార్లలోని భూములపై నిఘాను ముమ్మరం చేయడమేగాకుండా... ల్యాండ్ బ్యాంక్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూములు కాపాడుకోవడం అనివార్యం. తెలంగాణలో కీలకమైన పెట్టుబడులకు అనువైన ప్రాంతం రంగారెడ్డి జిల్లా. ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇతర పరిశ్రమల స్థాపనకు అనువైన కేంద్రంగా జిల్లాను మలచాల్సిన అవసరముంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తాం. అసమానతలకు ఫుల్స్టాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో మిళితమైన జిల్లాలో అభివృద్ధిలో భారీ వ్యత్యాసం ఉంది. అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని శివార్లకు దీటుగా తయారుచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. ఉద్యాన తోటల పెంపకం, అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ ద్వారా వికారాబాద్, తాండూరు ప్రాంతాలను ప్రగతిపథంలో పయనింపజేస్తాం. హార్టికల్చర్, డెయిరీ విస్తృతి ద్వారా రైతాంగాన్ని ప్రోత్సహిస్తాం. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తా సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించాల్సిందే. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించేందుకు సమష్టిగా కృషి చేస్తాం. మూడు వారాల్లో జిల్లాల్లో సమస్యలపై అధ్యయనం చేస్తా. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నిస్తాం.