అభివృద్ధిలో అసమానతలు తొలగిస్తా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతానని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఏఎస్ కెరీర్‌లో ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కలెక్టర్ పోస్టుతోనే సాధ్యమని, మరోసారి ప్రభుత్వం ఈ అవకాశం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు.
కలెక్టర్ చెప్పిన మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
విలువైన అసైన్డ్, సీలింగ్ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తాం. శివార్లలోని భూములపై నిఘాను ముమ్మరం చేయడమేగాకుండా... ల్యాండ్ బ్యాంక్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూములు కాపాడుకోవడం అనివార్యం. తెలంగాణలో కీలకమైన పెట్టుబడులకు అనువైన ప్రాంతం రంగారెడ్డి జిల్లా. ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇతర పరిశ్రమల స్థాపనకు అనువైన కేంద్రంగా జిల్లాను మలచాల్సిన అవసరముంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తాం.
అసమానతలకు ఫుల్‌స్టాప్
గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో మిళితమైన జిల్లాలో అభివృద్ధిలో భారీ వ్యత్యాసం ఉంది. అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని శివార్లకు దీటుగా తయారుచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. ఉద్యాన తోటల పెంపకం, అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ ద్వారా వికారాబాద్, తాండూరు ప్రాంతాలను ప్రగతిపథంలో పయనింపజేస్తాం. హార్టికల్చర్, డెయిరీ విస్తృతి ద్వారా రైతాంగాన్ని ప్రోత్సహిస్తాం.
విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తా
సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించాల్సిందే. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించేందుకు సమష్టిగా కృషి చేస్తాం. మూడు వారాల్లో జిల్లాల్లో సమస్యలపై అధ్యయనం చేస్తా. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నిస్తాం.