అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తహసీల్దార్ల బదిలీ వ్యవహారంలో తాజాగా కొత్త పంచాయితీకి తెరలేచింది. ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీ ప్రక్రియలో కొందరు ఉన్నత స్థాయి నేతలు, ఉద్యోగ సంఘ నేతలతో జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి కీలకమైన ప్రాంతాల్లో అనుకున్న చోటకు బదిలీ చేసుకున్నారు.
అనంతరం హుటాహుటిన ఆయా స్థానాల్లో విధుల్లోకి చేరారు. అయితే ఈ వ్యవహారంతో భంగపడ్డ మరికొందరు తహసీల్దార్లు కోర్టును ఆశ్రయించగా.. సోమవారం బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని పేర్కొంటూ.. ఎన్నికలకు ముందు పనిచేసిన చోటనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో అసలు కథ ఆరంభమైంది. బదిలీ ప్రక్రియలో భారీ మొత్తాన్ని ఖర్చుచేసి అనుకున్న చోటుకు బదిలీ చేయించుకున్న తహసీల్దార్లకు తాజా పరిణామం మింగుపడకుండా చేస్తోంది.
సీటు పాయె.. శ్రమ వృథా అయ్యే..!
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో పాలనా వ్యవహారాలపై దృష్టి సారించిన నేపథ్యంలో బదిలీల వైపు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ముందుగా తహసీల్దార్లు ఆపై క్యాడర్ అధికారులను బదిలీ చేయాలని భావించింది. ఇందులో భాగంగా ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లతోపాటు 33 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. అయితే ఎన్నికలకు ముందు పనిచేసిన అధికారులకు తిరిగి అవే పోస్టులు కట్టబెడుతూ కొన్నిచోట్ల ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మాత్రం కొత్తగా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితిని సానుకూలంగా మార్చుకున్న కొందరు అధికారులు ఓ మంత్రి అండదండలు.. ఓ ఉద్యోగ సంఘ నేతల ఆశీస్సులతో నగర శివారు మండలాల్లో అనుకున్న చోట పోస్టింగ్ ఇప్పించుకున్నారు.
వెనువెంటనే ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తమకు పాతస్థానాలు కేటాయించాలని కోరుతూ ఐదుగురు తహసీల్దార్లు ట్రైబ్యునల్‌ను ఆశ్రయిం చారు. దీంతో సోమవారం ఆ బదిలీలను రద్దు చేయడంతో పాటు ఆ ఐదుగురు తహసీల్దార్లకు గతంలో పనిచేసిన స్థానాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన బదిలీలన్నీ రద్దు కానున్నాయి. దీంతో ఎన్నో ‘వ్యయ’ప్రయాసలకోర్చి కీలకమైన చోట పోస్టింగులిప్పించుకున్న తహసీల్దార్లకు తాజా పరిస్థితులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇంత కష్టపడి కోరిన చోట సీటు దక్కించుకున్నప్పటికీ.. కనీసం పక్షం రోజులైనా పనిచేయలేకపోవడంపై వారు సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతా కొత్తగా..
తాజాగా జిల్లా పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్ బదిలీ కావడం.. కొత్త కలెక్టర్‌గా ఎన్.శ్రీధర్ బాధ్యతలు స్వీకరించడం అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. దీంతో తహసీల్దార్ల బదిలీ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోననే అంశం అధికారుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.